Rains: జాడ లేని వరుణుడు.. మండుతున్న భానుడు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే ఈ నెల 2న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గురువారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి.

Updated : 21 Jun 2024 08:54 IST

వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి
నైరుతి విస్తరించినా.. కురవని వర్షాలు

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే ఈ నెల 2న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గురువారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. కానీ ఉత్తరాంధ్రపై అధిక పీడన ద్రోణి ప్రభావం చూపడంతో స్తబ్దుగా ఉండిపోయాయి. రాష్ట్రమంతటా నైరుతి వ్యాపించినా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఎండలు మండిపోతున్నాయి. నైరుతి ప్రవేశించినప్పటి నుంచి ఒకటి, రెండు ప్రాంతాలు మినహా.. ఎక్కడా చెప్పుకోదగ్గ వానలు లేవు. పైగా రాష్ట్రమంతటా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వేడి, ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మే నెలలో ఉన్నట్లుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడంతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరో ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడితేనే వర్షాలు కురిసి.. వాతావరణం చల్లబడుతుందని స్పష్టం చేస్తున్నారు. 

ప్రస్తుతం కర్ణాటక, కేరళ తీరాల మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పిడుగులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని సూచించింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని