Deputy Chief Minister Pawan kalyan: కేంద్ర నిధులు మళ్లించారా?

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించారా? పంచాయతీల్లో సచివాలయాలు భాగమా.. కాదా? ఉపాధి హామీ పనుల్లో దుర్వినియోగమైన నిధుల రికవరీలో ఎందుకు వెనుకబడ్డారు?

Published : 20 Jun 2024 04:23 IST

సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదా?
ఉపాధి వేతనాల చెల్లింపుల్లో జాప్యానికి కారణమేంటి?
ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నల పరంపర
మొదటి సమావేశంలోనే అధికారుల ఉక్కిరిబిక్కిరి


అటవీశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించారా? పంచాయతీల్లో సచివాలయాలు భాగమా.. కాదా? ఉపాధి హామీ పనుల్లో దుర్వినియోగమైన నిధుల రికవరీలో ఎందుకు వెనుకబడ్డారు? కారణం ఏమిటి? అంబుడ్స్‌మన్లుగా రాజకీయ నేపథ్యంలో కలిగిన వారు ఉన్నారా.. లేదా? ఉపాధి కూలీలకు వేతనాల్లో చెల్లింపుల్లో జాప్యానికి కారణం ఎవరు? 

ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులకు సంధించిన ప్రశ్నలివి. 

ఆయన నుంచి ఊహించని రీతిలో ఎదురైన ప్రశ్నలకు అధికారులు సరిగా సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో మంత్రే మళ్లీ కలగజేసుకుని లేవనెత్తిన అంశాలపై మరోసారి సమగ్రంగా చర్చిద్దామని, సంసిద్ధులై ఉండాలని సూచించారు. మంత్రిగా పవన్‌ కల్యాణ్‌ బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టాక తన క్యాంపు కార్యాలయంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 12 గంటలకు మొదలైన సమావేశం 2 వరకు సాగింది. వివిధ అంశాలపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వగా వాటిపై మంత్రి తనకున్న సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, కమిషనర్‌ కన్నబాబు వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.

కేరళ మోడల్‌ అనుసరిద్దాం

‘గ్రామీణ సమగ్రాభివృద్ధి కోసం కేరళలో అమలు చేస్తున్న మోడల్‌ను ఏపీలోనూ అమలు చేసే విషయాన్ని పరిశీలించండి. పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాల విషయంలో కేరళలో అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఆదర్శంగా ఉన్నాయి. దీనిపై సమగ్రంగా చర్చించాక ప్రణాళిక సిద్ధం చేయండి. రాష్ట్రంలో పంచాయతీలకు సమాంతరంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకొచ్చింది? సర్పంచులకు వాటిపై పర్యవేక్షణ, నియంత్రణ లేకపోతే ఎలా? సచివాలయాల్లో సర్పంచులకు కూర్చోడానికి కుర్చీలూ లేవా? కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని అధికారులను పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.

పరిపాలనలో రాజకీయ జోక్యం ఉండదు 

‘మీరు స్వేచ్ఛగా, త్రికరణ శుద్ధితో పని చేయొచ్చు. పరిపాలనలో రాజకీయ జోక్యం ఉండదు. ఎవరైనా జోక్యం చేసుకుంటే చెప్పండి. వారిని కట్టడి చేస్తాం. నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. ఇందుకు మీరంతా సహకరించాలి. అంతా కలిసి పని చేద్దాం. మీరు చెబితే నేర్చుకోడానికి నేను సిద్ధమే. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేద్దాం. ఇందుకోసం ప్రయోగాత్మకంగా అరకులో పర్యటిద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలి. ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాల చెల్లింపుల్లో జాప్యాన్ని నిరోధించాలి. ఇందుకోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితోనూ మాట్లాడతా. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపైనా ప్రత్యేక కార్యాచరణ అవసరం’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

మడ అడవుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

మడ అడవుల పరిరక్షణ కోసం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. నగరవనాలు, సామాజికవనాల పెంపుపైనా దృష్టిసారించాలని పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్‌కల్యాణ్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అటవీ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పర్యావరణ సంబంధిత విషయాలపై ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చించారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ చిరంజీవి చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


మరోసారి చర్చించాలని నిర్ణయించిన అంశాలివీ

  • గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు వ్యవస్థను గాడిలో పెట్టాలి. గతంలో విజయవంతంగా అమలైన వ్యవస్థని గత వైకాపా ప్రభుత్వం రద్దు చేయడంతో గ్రామాల్లో ఎల్‌ఈడీలు వెలగడం లేదు. 
  • ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్‌ జారీ చేసేందుకు జలజీవన్‌ మిషన్‌ పథకాన్ని వేగవంతం చేయాలి. పనుల్లో జాప్యానికి    కారణాలను అధిగమించాలి. గడువులోగా పనులు పూర్తి చేయాలి. 
  • గ్రామాల్లో రహదారుల సమస్యకు పరిష్కారం చూపాలి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) సాయంతో చేపట్టే ప్రాజెక్టు పనులు జోరందుకోవాలి. గడువులోగా ప్రతిపాదిత  పనులు పూర్తి చేయాలి.
  • ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీల (సోషల్‌ ఆడిట్‌) విభాగం పనితీరుపై సమగ్ర సమీక్ష చేయాలి. పథకం అమలులో భాగంగా చేసిన పనుల్లో నాణ్యత లోపాల గుర్తింపు, వీటిపై బాధ్యుల నుంచి రికవరీ సరిగా జరుగుతుందా? లేదా? సోషల్‌ ఆడిట్‌ సరిగా నిర్వహిస్తున్నారా.. లేదా.. తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని