Deputy chief minister pawan kalyan: ఉద్యాన పంటలకు ‘ఉపాధి హామీ’

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల కోలాహలం నడుమ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, గ్రామీణ తాగునీటి సరఫరా, శాస్త్ర సాంకేతికశాఖల మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు.

Published : 20 Jun 2024 06:23 IST

గిరిజన గ్రామాలకు పంచాయతీ భవనాలు
దస్త్రాలపై తొలి రెండు సంతకాలు చేసిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌
కార్యకర్తల కోలాహలం మధ్య బాధ్యతల స్వీకరణ

తన వదిన సురేఖ ఇచ్చిన పెన్నుతో ఫైల్‌పై సంతకం చేసి మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న పవన్‌కల్యాణ్‌. చిత్రంలో నాగబాబు, అధికారులు  

ఈనాడు, అమరావతి: పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల కోలాహలం నడుమ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, గ్రామీణ తాగునీటి సరఫరా, శాస్త్ర సాంకేతికశాఖల మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసే దస్త్రంపై ఆయన మొదటి సంతకం, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన మరో దస్త్రంపై రెండో సంతకం చేశారు. అంతకంటే ముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్‌కల్యాణ్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు వెంట రాగా క్యాంపు కార్యాలయంలో వేంకటేశ్వరస్వామికి పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో పవన్‌ కల్యాణ్‌ టేబుల్‌పై గుంటూరు శేషేంద్రశర్మ రచించిన ‘ఆధునిక మహా భారతం’ పుస్తకం పెట్టారు. తన వదిన సురేఖ బహూకరించిన పెన్నుతో దస్త్రాలపై పవన్‌కల్యాణ్‌ సంతకం చేశారు. మంత్రి వెంట ఆయన సోదరుడు నాగేంద్రబాబు ఉన్నారు. పౌరసరఫరాలు, పర్యాటకశాఖల మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, లోకం మాధవి, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, వంశీకృష్ణ శ్రీనివాస్, ఆరణి శ్రీనివాసులు, మండలి బుద్ధప్రసాద్, అరవ శ్రీధర్, పిఠాపురం తెదేపా ఇన్‌ఛార్జి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ తదితరులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌కల్యాణ్‌కు మంత్రి నాదెండ్ల మనోహర్‌ పుష్ప గుచ్ఛం అందించి ఆలింగనం చేసుకున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, కమిషనర్‌ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు రావడంతో పవన్‌కల్యాణ్‌ క్యాంపు హౌస్‌ వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని