Pawan Kalyan: పంచాయతీలను ముంచేశారు.. రూ. 5,500 కోట్లు మళ్లించేశారు

కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గత వైకాపా ప్రభుత్వం రూ.5,500 కోట్లు మళ్లించేసింది.

Published : 21 Jun 2024 06:23 IST

నిర్ధారించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ
ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు సమగ్ర నివేదిక

విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీ పథక సామాజిక తనిఖీ విభాగం
అధికారులతో సమీక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ 

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గత వైకాపా ప్రభుత్వం రూ.5,500 కోట్లు మళ్లించేసింది. వాటిలో పంచాయతీలకు సంబంధించినవే రూ.3,198 కోట్లు ఉన్నాయి. మిగతా రూ.2,302 కోట్లు జిల్లా, మండల పరిషత్తులకు ఇచ్చినవి. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్తు ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిధుల మళ్లింపు విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన ఈ నిధుల మళ్లింపుపై సర్పంచులు ఆందోళన వ్యక్తం చేయగా, కేంద్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిలోనే నిధులు వేయాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 15వ ఆర్థిక సంఘం 2021-22 నుంచి ప్రారంభమైంది. మధ్యంతర నివేదిక ఆధారంగా ఏడాది ముందు 2020-21 నుంచే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. 2021-22 నుంచి 2023-24 మధ్య గత నాలుగేళ్లలో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం రూ. 8,605 కోట్లు కేటాయించి రూ. 8,527.46 కోట్లు విడుదల చేసింది. 2024-25, 2025-26 సంవత్సరాలకు మరో రూ. 4,251 కోట్లు వస్తాయని అంచనా. 

యథేచ్ఛగా ఉల్లంఘనలు 

ఆర్థిక సంఘం నిధుల విషయంలో వైకాపా ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలను ఉల్లంఘించింది. గ్రామాల్లో తాగునీటి సరఫరా మెరుగుకు, పారిశుద్ధ్య పనులకే వాటిని ఖర్చు చేయాలన్న ఆదేశాలకు తిలోదకాలిచ్చింది. పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిల కోసం వాటిని మళ్లించేసింది. కేంద్ర ప్రభుత్వ విచారణలోనూ ఈ విషయం వెల్లడైంది. ఎన్నికల ముందు 2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం ఇచ్చిన రూ. 998 కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్నట్లుగా ఉత్తర్వులిచ్చి కూడా మోసం చేసింది. ఇప్పటికీ అవి జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీల బ్యాంకుల్లో జమ కాలేదు. 

నిధులొచ్చిన రెండు వారాల్లో విడుదల చేసేలా ప్రణాళిక 

ఇకమీదట కేంద్రం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన రెండు వారాల్లో అవి పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం కానుంది. అలాగే ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని