Pawan Kalyan: తీరం కోతపై అధ్యయనం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రపు కోతను బుధవారం పరిశీలించారు.

Updated : 04 Jul 2024 03:37 IST

ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ 
1,360 ఎకరాలు సాగరంలో కలిసిపోవడంపై విస్మయం 

కాకినాడ జిల్లా వాకతిప్ప ఎస్సీ కాలనీలో సమస్యలు తెలుసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌. చిత్రంలో కాకినాడ ఎంపీఉదయ్‌శ్రీనివాస్‌

ఈనాడు-కాకినాడ, న్యూస్‌టుడే-కొత్తపల్లి, పిఠాపురం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రపు కోతను బుధవారం పరిశీలించారు. ఉప్పాడ పంచాయతీ సూరాడపేట వద్ద కోతకు గురైన ప్రాంతంలో ఏపీ మారిటైం బోర్డు, చెన్నై నుంచి వచ్చిన కేంద్ర అధికారులతో కలిసి పర్యటించారు. సర్వే విభాగం ఏర్పాటుచేసిన చిత్ర ప్రదర్శనను చూశారు. ఉప్పాడ తదితర 8 గ్రామాల్లో ఇప్పటివరకు 1,360.75 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయిందని సర్వేశాఖ ఏడీ లక్ష్మీనారాయణ వివరించడంతో విస్మయం చెందారు. జియో ట్యూబ్, రక్షణ గోడలు నిర్మిస్తే మత్స్యకార గ్రామాలకు భద్రత ఉంటుందని ఏడీ చెప్పారు. కోత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి, సమస్యకు పరిష్కారం సూచించాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

ఉప్పొంగిన అభిమానం

ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్‌కల్యాణ్‌ తొలిసారిగా రావడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. దారిపొడవునా పూలజల్లులతో ముంచెత్తారు. మహిళలు హారతులు పట్టారు. వాకతిప్ప ఎస్సీ కాలనీ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి మురుగు కాలువలు, పారిశుద్ధ్య పరిస్థితులు పరిశీలించారు. వాకతిప్ప శివారులో సూరప్ప చెరువు సమ్మర్‌స్టోరేజి ట్యాంకు, తాగునీటి శుభ్రత, నీటిపరీక్ష ప్రయోగశాలల పనితీరు పరిశీలించారు.

ఉప్పాడ తీరాన్ని పరిశీలించేందుకు వచ్చిన పవన్‌కల్యాణ్‌కు పూలజల్లులతో స్వాగతం పలుకుతున్న అభిమానులు

బాలుడి అభిమానానికి మురిసి..

గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసం నుంచి కొత్తపల్లి మండల పర్యటనకు పవన్‌కల్యాణ్‌ వెళ్తుండగా పదేళ్ల బాలుడు కొత్తెం హరీష్‌ జనసేన జెండా పట్టుకుని ఊపుతూ ఎండలో నిలబడడాన్ని పవన్‌కల్యాణ్‌ గమనించారు. కాన్వాయ్‌ ఆపి దిగిన ఆయన.. బాలుడిని హత్తుకుని ఫొటో తీసుకున్నారు. ఉపముఖ్యమంత్రి వెంట కాకినాడ కలెక్టర్‌ షాన్‌ మోహన్, కాకినాడ ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్, తెదేపా మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని