Pawan Kalyan: ఎర్రచందనం దందాలో పెద్ద తలకాయల్ని పట్టుకోండి

ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అటవీ శాఖాధికారులను ఆదేశించారు.

Updated : 06 Jul 2024 06:16 IST

బెయిల్‌పై తిరుగుతున్న స్మగ్లర్లపై నిఘా పెట్టండి
అటవీ శాఖాధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అటవీ శాఖాధికారులను ఆదేశించారు. నిఘా వ్యవస్థను పటిష్ఠపరచాలని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారందర్నీ అరెస్టు చేయాలని సూచించారు. ఎక్కడెక్కడ ఎర్రచందనం డంప్‌లు ఉన్నాయో గుర్తించి, ఈ స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న కీలక సూత్రధారులను పట్టుకోవాలని చెప్పారు. వారు తప్పించుకోవటానికి వీల్లేకుండా పక్కాగా కేసులు నమోదు చేయాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసుల్లో గతంలో అరెస్టై ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నవారి కార్యకలాపాలు, వారు ఎవరెవరితో లావాదేవీలు కొనసాగిస్తున్నారనే అంశాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఆ దిశగా అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఇప్పటి వరకూ నమోదు చేసిన కేసులు, వాటిలో ఎన్నింటిలో శిక్షలు పడ్డాయి? ఎన్ని వీగిపోయాయి? అందుకు కారణాలేంటి తదితర అంశాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు. నేపాల్‌లో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలను తిరిగి ఏపీకి తీసుకురావటంపై దృష్టి సారించాలన్నారు. వైఎస్సార్‌ జిల్లా అటవీ శాఖాధికారులతో శుక్రవారం సమావేశమై ఆదేశాలిచ్చారు. 

జగనన్న కాలనీలో పట్టుబడ్డ ఎర్రచందనం డంప్‌పై నివేదిక

వైఎస్సార్‌ జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో పట్టుబడ్డ ఎర్రచందనం డంప్‌నకు సంబంధించిన నివేదికను ఆ జిల్లా అటవీ శాఖాధికారులు పవన్‌ కల్యాణ్‌కు సమర్పించారు. రూ.1.6 కోట్ల విలువైన 158 దుంగలు పట్టుబడ్డాయని చెప్పారు. ఈ కేసులో దూదేకుల బాషా, మహ్మద్‌ రఫీ, అరవోళ్ల రఫీ, చెల్లుబోయిన శివ సాయి అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని.. లతీఫ్‌ బాషా, లాల్‌ బాషా, జాకీర్, ఫక్రుద్దీన్‌ అనే స్మగ్లర్లకు కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తించారని నివేదించారు. 

సముద్రం కోతపై సమగ్ర అధ్యయనం: పవన్‌ కల్యాణ్‌ 

రాష్ట్రంలో సముద్రపు కోతపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేయించాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సముద్రతీరంలో 31 శాతం మేర, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోనే సుమారు 70 కి.మీ మేర భూమి కోతకు గురైందని అధికారులు చెప్పడంతో ఆయన పైవిధంగా స్పందించారు. సముద్రంలోకి పారిశ్రామిక వ్యర్థాల్ని విడుదల చేయడంతో మత్స్యసంపదకు ప్రమాదం వాటిల్లుతోందని పలు సందర్భాల్లో మత్స్యకార ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుల్ని పవన్‌ ప్రస్తావించారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టి పెట్టాలన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో పీసీబీ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. పర్యావరణహితంగా పరిశ్రమలు నిర్వహించాలని, అయితే పర్యావరణ నిబంధనలు పారిశ్రామిక ప్రగతికి అవరోధం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశ్రామిక కాలుష్యంపై ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు