Jaggayyapeta: జగ్గయ్యపేటలో అతిసారం.. ఇద్దరి మృతి

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో డయేరియా లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. స్థానిక శాంతినగర్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్న సట్టు శివన్నారాయణ (38) వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలై మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Published : 22 Jun 2024 05:02 IST

మూడు రోజుల్లో 50 మంది ఆసుపత్రిపాలు
పల్నాడు జిల్లాలో మరో 10 మందికి అస్వస్థత
అప్రమత్తమైన అధికార యంత్రాంగం

జగ్గయ్యపేట, దాచేపల్లి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో డయేరియా లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. స్థానిక శాంతినగర్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్న సట్టు శివన్నారాయణ (38) వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలై మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతుండటంతో గురువారం పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వాసుపత్రికి పంపడంతో వైద్యులు పరీక్షించి, ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. చిల్లకల్లుకు చెందిన తోటపల్లి వెంకటేశ్వర్లు (75) గురువారం వాంతులు, విరేచనాలతో నీరసించిపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని కుటుంబసభ్యులు తెలిపారు. గత మూడు రోజుల్లో జగ్గయ్యపేటలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మొత్తం 50 వరకు అతిసారం కేసులు నమోదయ్యాయి. వీరిలో 30 మంది పరిస్థితి మెరుగుపడటంతో ఇంటికెళ్లారు. ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వైద్యారోగ్య శాఖ మంత్రికి సమాచారం అందించారు. ఆయన సూచనలతో కలెక్టర్‌ ఢిల్లీరావు, డీఎంహెచ్‌ఓ సుహాసిని శుక్రవారం జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానపల్లిలోని ఎస్సీ కాలనీలో అతిసారంతో సుమారు 10 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ కాలనీకి మంచినీళ్లు అందిస్తున్న పంచాయతీ బోర్ల వద్ద మురుగు నిల్వ ఉండటంతో నీరు కలుషితమవుతోంది. కొన్నిచోట్ల కాలువల్లో ఉన్న పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడి మురుగు చేరుతోంది. దీని ప్రభావంతో మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని