Anakapalli: వికటించిన ఇంజక్షన్ల మందు

అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఇచ్చిన ఇంజక్షన్లు వికటించి 23 మంది అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది.

Published : 11 Jul 2024 04:26 IST

23 మందికి అస్వస్థత

వైద్యురాలు, సిబ్బందితో మాట్లాడుతున్న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌

అనకాపల్లి పట్టణం, నక్కపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఇచ్చిన ఇంజక్షన్లు వికటించి 23 మంది అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఈ బ్యాచ్‌ మందులను పక్కనపెట్టి, విచారణ చేపట్టారు. నక్కపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారికి మూడు రోజుల నుంచి మైట్రోజన్, సిప్రోఫ్లాక్సాసిన్, టాక్సిమ్‌ యాంటీబయాటిక్‌ ఇంజక్షన్లు ఇస్తున్నారు. మంగళవారం రాత్రి ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించడంతో ఒకేసారి దాదాపు 23మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ నక్కపల్లి నుంచి అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వికటించిన ఇంజక్షన్‌ బ్యాచ్‌ మందును రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా వినియోగించవద్దని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ బ్యాచ్‌ ఇంజక్షన్లు, సెలైన్‌ నమూనాలను కోల్‌కతా ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కళ్యాణి తెలిపారు. బుధవారం నక్కపల్లి ఆసుపత్రిలో రోగులకు వినియోగించిన మందులను పరిశీలించారు. జ్వరం, వాంతులు, విరేచనాలు తదితర సమస్యలతో ఆసుపత్రిలో చేరినవారితో పాటు గర్భిణులు, బాలింతలకు ఈ ఇంజక్షన్‌ చేశామని.. కేవలం ఇన్‌పేషెంట్లుగా ఉన్నవారిపైనే మాత్రమే ప్రతికూల ప్రభావం చూపిందని వైద్యులు శిరీష, జయలక్ష్మి తెలిపారు. మందు తయారీలో లోపం ఉన్నట్లు తేలితే కంపెనీపై కేసు పెడతామన్నారు. ఇదే డ్రగ్‌ అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో వినియోగించినప్పుడు నాలుగైదు రోజుల కిందట పలువురు అస్వస్థతకు గురైనట్లు రాత్రే తెలిసిందన్న విషయాన్ని విలేకరులు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇంతవరకు తమకు ఫిర్యాదులేవీ రాలేదని, అయినా దీనిపైనా విచారణ చేస్తామని చెప్పారు. కాగా, నక్కపల్లి నుంచి అనకాపల్లి తీసుకొచ్చిన 23 మందిలో ఒకరిని మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు