Finance Commission Funds: ఎన్నికల ముందే రూ.998 కోట్ల ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు

సర్పంచులను జగన్‌ ప్రభుత్వం మోసం చేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బీఆర్వో) ఇచ్చి మరీ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించింది.

Updated : 12 Jun 2024 08:18 IST

 సర్పంచులను మోసం చేసిన జగన్‌ ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: సర్పంచులను జగన్‌ ప్రభుత్వం మోసం చేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బీఆర్వో) ఇచ్చి మరీ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించింది. అప్పట్లో బీఆర్వో విడుదల కావడంతో నిధుల కోసం సర్పంచులు ఎదురు చూశారు. అయినా రాకపోవడంతో రెండు రోజుల క్రితం ఆరా తీస్తే ప్రభుత్వ అవసరాలకు వాటిని మళ్లించినట్లు తెలిసింది. 2024-25 సంవత్సరానికి రెండో విడతగా గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం రూ.998 కోట్లు ఈ ఏడాది మార్చిలో విడుదల చేసింది. ఇందులో దాదాపు రూ.700 కోట్లు (70%) గ్రామ పంచాయతీలకు కేటాయించింది. కేంద్రం నిధులిచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల పాటు గోప్యంగా ఉంచింది. విషయం తెలిసి సర్పంచులు ఆందోళనకు దిగడంతో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే ముందు బీఆర్వో ఇచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఆఘమేఘాలపై బిల్లులు తయారు చేసి రాష్ట్ర ఆర్థికశాఖకు నివేదిక పంపారు. ఈ మేరకు పంచాయతీల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేయాలి. సర్పంచుల ఆందోళనతో మెట్టు దిగి బీఆర్వో ఇచ్చిన ఆర్థికశాఖ.. ఆ తరువాత పట్టించుకోలేదు. నిధులను ఇతర అవసరాలకు మళ్లించి పంచాయతీరాజ్‌శాఖ పంపిన బిల్లులను పక్కన పడేసింది. గతంలోనూ రూ.1,250 కోట్లకుపైగా 14, 15 ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ప్రమేయం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని