TTD: నడకదారి భక్తులకు త్వరలో దివ్యదర్శన టోకెన్లు

తిరుమలకు అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

Updated : 04 Mar 2023 07:46 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలకు అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. నడక మార్గాల్లో తిరుమలకు వచ్చే భక్తుల్లో 60శాతం మంది వద్ద దర్శన టికెట్లు ఉండటం లేదని గుర్తించామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని, అది పూర్తికాగానే టోకెన్ల జారీని ప్రారంభిస్తామని తెలిపారు. శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన వారికి తిరుమలలోని ఎస్‌ఎన్‌జీహెచ్‌, ఏటీజీహెచ్‌ అతిథి గృహాల్లో 88 గదులు కేటాయించనున్నట్లు తెలిపారు. శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో నెలలో రెండు గుండెమార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. ఏప్రిల్‌ మొదటి వారానికి తిరుమలకు 10 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వస్తాయని, వీటిని ధర్మరథం బస్సుల స్థానంలో ఉపయోగిస్తామని వివరించారు. వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 5న జరిగే శ్రీసీతారాముల కల్యాణంలో ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని అన్నారు. తిరుమలలో గదుల కేటాయింపు విచారణ కేంద్రాల్లో రాగి బాటిళ్ల విక్రయానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని