YS Jagan: మంచి నీళ్ల పథకాన్ని ముంచేశారు!

గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పట్టణాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరకముందే ప్రాజెక్టు గడువు నెలాఖరుతో ముగియనుంది.

Published : 12 Jun 2024 06:23 IST

రక్షిత నీరు అందివ్వాలన్న లక్ష్యం నెరవేరకముందే ముగుస్తున్న ప్రాజెక్టు గడువు
ఐదేళ్లలో రూపాయి ఇవ్వని జగన్‌ సర్కార్‌
మొదటి విడత రుణ సాయంతోనే సరిపెట్టేసిన ఏషియన్‌ బ్యాంకు
కొత్తగా ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే పట్టణ ప్రజలకు నీళ్లు

ఈనాడు-అమరావతి: గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పట్టణాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరకముందే ప్రాజెక్టు గడువు నెలాఖరుతో ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) తన వాటాను పూర్తిగా విడుదల చేయలేదు. ఫలితంగా అనేకచోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయి నిష్ప్రయోజనం అవుతున్నాయి. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన రక్షిత నీటిని అందించాలన్న ఉదాత్త లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత తెదేపా ప్రభుత్వం ప్రాజెక్టును తీసుకుంది. ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరించి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా పక్కన పెట్టింది. కొత్తగా మరోసారి ఏర్పాటవుతున్న తెదేపా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టు గడువు పొడిగిస్తే అసంపూర్తి పనులు పూర్తై పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే వీలుంటుంది. లక్షలోపు జనాభా గల 50 పట్టణాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్‌ అందించే లక్ష్యంతో పట్టణ తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును గత తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చింది. రూ.4,900 కోట్ల వ్యయం చేసే ప్రాజెక్టుకు 70% నిధులను కేంద్ర ప్రభుత్వ సాయంతో ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం 2019 మేనెలలో అవగాహన ఒప్పందం జరిగింది. 30% నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చేందుకు అంగీకరించింది. 20 ప్యాకేజీల పనులకు టెండర్లు కూడా పిలిచి ప్రారంభించారు. ఆ తరువాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం తన వాటా నిధులను ఇవ్వకుండా ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది. ఏఐఐబీ మొదటి విడతగా రూ.330 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చాల్సిన నిధులను విడుదల చేయలేదు. భారీగా కమీషన్లు ఇచ్చిన అస్మదీయ గుత్తేదారు సంస్థలకు ఏఐఐబీ నిధుల్లో నుంచి రూ.300 కోట్ల వరకు పెండింగ్‌ బిల్లులను జగన్‌ ప్రభుత్వం చెల్లించి ఆ తరువాత చేతులు దులిపేసుకుంది.

ఏఐఐబీ హెచ్చరించినా బేఖాతర్‌

తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులివ్వని కారణంగా పనుల్లో పురోగతి లోపించిన విషయాన్ని ఏఐఐబీ నిపుణుల బృందం గుర్తించి ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులిస్తే మిగతా నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అనేకసార్లు లేఖలు రాసింది. లేదంటే ఒప్పందం రద్దు చేసుకుంటామని హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో గత ఐదేళ్లలో కేవలం రూ.330 కోట్లే ఏఐఐబీ విడుదల చేసి ఆ తరువాత మిన్నకుండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,200 కోట్లు (30%) కేటాయించినట్లైతే ఏఐఐబీ నుంచి తక్కువ వడ్డీకి రూ.3,700 కోట్లు (70%) రుణం వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పనులు ప్రారంభించిన గుత్తేదారులు క్రమంగా వాటిని పక్కన పెట్టారు. 

కేంద్రం ఆదేశాలపైనా నిర్లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు సరిగా విడుదల చేయని కారణంగా ఏఐఐబీ రుణం వెనక్కిపోతున్న విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తక్షణమే సింగిల్‌ నోడల్‌ ఏజన్సీ (ఎస్‌ఎన్‌ఏ) ఖాతా ప్రారంభించాలంటూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలనూ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో ఏఐఐబీతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు జమ చేయాలి. వీటిని వినియోగించి తదుపరి విడత నిధుల కోసం వినియోగ ధ్రువీకరణ పత్రాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాలి. వీటి ఆధారంగా ఏఐఐబీ నిధులు విడుదల చేస్తుంది. ఈ విధానం ద్వారా ప్రాజెక్టు పనుల్లో పురోగతి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఆశించినా ఫలితం లేకపోయింది. తన వాటా కింద గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా జగన్‌ సర్కార్‌ ఇవ్వలేదు.

 తాగునీటి సరఫరా ప్రాజెక్టు గడువు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏఐఐబీని ఒప్పించేందుకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ రాసిన లేఖలను ఆర్థికశాఖ పక్కన పడేసింది. ఒప్పందం ప్రకారం నెలాఖరుతో గడువు ముగియనుంది. అనేకచోట్ల పనులు నిలిచిపోయాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని