YSRCP: వైకాపా పాలనలో అరాచక డీఎస్పీలు

వారంతా డీఎస్పీ స్థాయి అధికారులు.. చట్టం, నిబంధనల ప్రకారం పనిచేయాల్సింది పోయి ఐదేళ్లలో వైకాపా బంటుల్లా సేవలందించారు. ఆ పార్టీ నాయకుల అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచారు.

Updated : 15 Jun 2024 07:24 IST

జగన్‌కు వీరభక్తుల్లా విధి నిర్వహణ
వైకాపా నాయకుల దాడులు, దాష్టీకాలకు వెన్నుదన్ను
తెదేపా, జనసేన నాయకులపై అడ్డగోలుగా అక్రమ కేసులు

ఈనాడు, అమరావతి: వారంతా డీఎస్పీ స్థాయి అధికారులు.. చట్టం, నిబంధనల ప్రకారం పనిచేయాల్సింది పోయి ఐదేళ్లలో వైకాపా బంటుల్లా సేవలందించారు. ఆ పార్టీ నాయకుల అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచారు. తెదేపా, ఇతర ప్రతిపక్ష నాయకులను అణచివేశారు. అడ్డగోలుగా కేసులు పెట్టి వేధించారు. నిర్బంధాలతో హింసించారు. బాధితులపైనే రివర్స్‌ కేసులు పెట్టారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. జగన్‌ వీరభక్తులుగా వ్యవహరించిన ఆ డీఎస్పీల తీరుపై ప్రస్తుతం తెదేపా వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. 


చంద్రబాబు పట్ల సుధాకర్‌రెడ్డి దురుసు ప్రవర్తన

వైకాపా హయాంలో చిత్తూరు, పలమనేరు డీఎస్పీగా.. కుప్పం ఇన్‌ఛార్జి డీఎస్పీగా సుదీర్ఘకాలంపాటు బాధ్యతలు నిర్వర్తించిన ఎన్‌.సుధాకర్‌రెడ్డి తెదేపా శ్రేణులను అణచివేశారన్న ఫిర్యాదులున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశమే చట్టమన్నట్టు పేట్రేగిపోయారన్న విమర్శలున్నాయి. జీవో-1ని సాకుగా చూపించి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్డుషోకు అనుమతి నిరాకరించారు. కుప్పం రానీయకుండా అడ్డుకున్నారు. ఆయనతో వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. పుంగనూరులో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన వందల మంది తెదేపా కార్యకర్తలపై అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేసి వెంటాడి వెంబడించి మరీ జైల్లో పెట్టారు. అనేకమందిపై రౌడీషీట్లు తెరిచారు. నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. కుప్పం, పుంగనూరులలో వైకాపా నాయకుల అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచారు.


అడ్డగోలు కేసులతో హింసించిన వీరరాఘవరెడ్డి

వైకాపా హయాంలో రెండు విడతల్లో అనంతపురం డీఎస్పీగా పనిచేసిన జి.వీరరాఘవరెడ్డి వైకాపా కార్యకర్తగానే ఎక్కువ గుర్తింపు పొందారన్న విమర్శలున్నాయి. మాజీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి మాటే శాసనమన్నట్లు పనిచేశారన్న ఫిర్యాదులున్నాయి. తెదేపాలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న ముఖ్య నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం సెక్షన్ల కింద అడ్డగోలుగా కేసులు పెట్టారు. క్రియాశీల తెదేపా నాయకులను బైండోవర్‌ చేయించారు. స్థానిక ఎన్నికల్లో తెదేపా నాయకులను పోలింగ్‌ ఏజెంట్లుగానైనా కూర్చోనివ్వలేదు. దొంగ ఓట్లేస్తున్న వైకాపా నాయకులకు కొమ్ముకాశారు. అదేంటని ప్రశ్నించినవారిపై విరుచుకుపడ్డారు. వైకాపా ప్రభుత్వ మద్యం విధానంపై విమర్శలు చేసినందుకు తెదేపా మహిళా నాయకురాళ్ల ఇళ్లకు అర్ధరాత్రి వెళ్లి సోదాలు చేశారు. వారి ఫోన్లు లాక్కున్నారు. వేధింపులు తాళలేక ఓ మహిళా నాయకురాలు ఆత్మహత్యకు యత్నించారు. తాజా ఎన్నికల సందర్భంలోనూ ఆయన తెదేపా కార్యకర్తలపై దాష్టీకాన్ని చూపారన్న విమర్శలున్నాయి.


అరాచకశక్తిగా వీఎన్‌కే చైతన్య

రాజంపేట డీఎస్పీ వీఎన్‌కే చైతన్య వైకాపా హయాంలో అరాచక శక్తిగా వ్యవహరించారు. రెండున్నరేళ్లపాటు తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన ఆయన వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చట్టమన్నట్టు నడుచుకున్నారన్న విమర్శలున్నాయి. ‘తెదేపా నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగారు. అక్రమ కేసులు బనాయించారు. కస్టడీకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. వైకాపావారి వల్ల అన్యాయం జరిగిందని ఫిర్యాదిస్తే చాలు వారిపై రివర్స్‌ కేసులు పెట్టి హింసించారు. పాత కేసులన్నీ తిరగదోడారు’ అనే ఫిర్యాదులున్నాయి. చైతన్య బాధితులు ఆయనపై ఏకంగా 23 ప్రైవేటు కేసులు వేశారు. పోలింగ్‌ అనంతరం తాడిపత్రిలో చెలరేగిన హింసను నియంత్రించే ముసుగులో ఇటీవల రాజంపేట నుంచి తాడిపత్రికి వెళ్లిన చైతన్య.. తెదేపా నేత జేసీ ప్రభాకరరెడ్డి నివాసంలోకి చొరబడి అక్కడున్న పార్టీ కార్యకర్తలను విచక్షణరహితంగా కొట్టారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఎన్నికల సమయంలో రైల్వేకోడూరు నియోజకవర్గంలో జనసేన తరఫున పోలింగ్‌ ఏజెంట్లను వైకాపా నాయకులు అపహరిస్తే కనీస చర్యలు తీసుకోలేదు. రివర్స్‌లో జనసేన నాయకులపైనే కేసులు పెట్టారు. 


వైకాపా దాడులకు వెన్నుదన్నుగా పల్లంరాజు

పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేసిన పల్లంరాజు.. మాచర్ల, గురజాల నియోజకవర్గాల మాజీ వైకాపా ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌రెడ్డిల అరాచకాలకు కొమ్ముకాశారన్న ఫిర్యాదులున్నాయి. ఎన్నికలకు ముందు వైకాపా అరాచక శక్తులను బైండోవర్‌ చేయకుండా సహకరించారన్న విమర్శలున్నాయి. పోలింగ్‌ రోజున వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నా అడ్డుకోలేదన్న ఆరోపణలున్నాయి. గురజాల సబ్‌డివిజన్‌ పోలీసు కార్యాలయానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నప్పటికీ మిన్నకున్నారు. మాచర్లలో అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడే అవకాశముందని తెలిసినా చర్యలు తీసుకోలేదు. దాడులకు మరింతగా ఊతమిచ్చేలా వ్యవహరించారని, పోలింగ్‌ రోజున వైకాపా నాయకుల చేతిలో దాడులకు గురైన తెదేపా శ్రేణులు పల్లంరాజుకు ఫోన్‌ చేస్తే.. సమాచారాన్ని మాచర్ల ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి చేరవేశారన్న ఫిర్యాదులున్నాయి. 


అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాశారు.. 

రాయచోటి డీఎస్పీగా మహబూబ్‌బాషాను ఎన్నికలకు ముందు వైకాపా నేతలు ఏరికోరి తెచ్చుకున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక తెదేపా నేతలే లక్ష్యంగా ఆయన కేసులు పెట్టారు. రామాపురం మండలంలో వైకాపా నాయకులు తెదేపా ప్రచార రథంపై దాడి చేసి డ్రైవర్‌ను గాయపరిస్తే చర్యలు తీసుకోకుండా పరామర్శించేందుకు వెళ్లిన ప్రస్తుత మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డిపై కేసు పెట్టారు. చిన్నమండెం మండలం వండాడిలో ఓ సర్పంచి ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి ర్యాలీగా వెళ్లిన తెదేపా నాయకులపై కేసు నమోదు చేశారు. పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం వద్ద తెదేపా ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ప్రచార వాహనాన్ని వైకాపా నేతలు తగలబెట్టినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. 


చంద్రబాబు అరెస్టు సమయంలో మహేశ్వరరెడ్డి జులుం

పలమనేరు డీఎస్పీగా ఇటీవల వరకూ పనిచేసిన సి.మహేశ్వరరెడ్డి.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సర్వసైన్యాధ్యక్షుడిలా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. వైకాపా దాష్టీకాలకు, దాడులకు కొమ్ముకాశారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టారు. అంతకుముందు నంద్యాలలో పనిచేసినప్పుడు వైకాపా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి, ఆయన కుటుంబీకుల కనుసన్నల్లో పనిచేశారన్న విమర్శలున్నాయి. వైకాపా అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు ప్రతిపక్ష నాయకులపై జులుం ప్రదర్శించారు.  


యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు

గతంలో చిత్తూరు డీఎస్పీగా పనిచేసిన శ్రీనివాసమూర్తి వైకాపా కార్యకర్తలా పనిచేశారన్న అభియోగాలున్నాయి. లోకేశ్‌ యువగళం పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులు కలిగించారు. 

సురేందర్‌రెడ్డి

తిరుపతి డీఎస్పీగా పనిచేసిన సురేందర్‌రెడ్డి, తిరుపతి ఎస్‌బీ డీఎస్పీగా విధులు నిర్వర్తించిన ఎం.భాస్కరరెడ్డి వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారు. తిరుపతి స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే పులివర్తి నానిపై వీరి సమక్షంలోనే వైకాపా మూకలు దాడిచేశాయి.

భాస్కరరెడ్డి

తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన గంగయ్య తొలినుంచీ వైకాపాకు కొమ్ముకాస్తూనే ఉన్నారు. పోలింగ్‌ అనంతరం వైకాపా నాయకులు తెదేపా శ్రేణులపైకి దాడులకు వెళితే నియంత్రించలేదు. పరోక్షంగా సహకరించారు.

తెదేపా ప్రచారాన్ని అడ్డుకుంటూ, దౌర్జన్యానికి పాల్పడుతున్న వైకాపా నేతలపై కడప డీఎస్పీ షరీఫ్‌ చర్యలు తీసుకోలేదు. వివిధ కేసుల్లో తెదేపా శ్రేణుల్నే ఇరికించారు. తాజా మాజీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా సోదరుడు అహమ్మద్‌బాషా రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో వీరంగం సృష్టించినా చర్యలు తీసుకోలేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్న వైకాపా నేతలపై కేసులు పెట్టలేదు.

నెల్లూరు గ్రామీణ డీఎస్పీ పి.వీరాంజనేయులురెడ్డి వైకాపాకు కొమ్ముకాస్తూ తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని, ప్రచారానికీ అనుమతించకుండా తెదేపా శ్రేణులను వేధించారన్న విమర్శలున్నాయి. 

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కె.విజయ్‌పాల్‌ తెదేపా శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టారని, వైకాపా మాజీ ఎంపీ భరత్‌ ఆదేశాలతో తెదేపా నాయకుల్ని వేధించారన్న ఫిర్యాదులున్నాయి. ఎన్నికల సమయంలో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున చీరలు, ఇతర వస్తువులను పంచుతున్నప్పుడు సహకరించారనే అభియోగాలున్నాయి.

ప్రస్తుతం భీమవరం డీఎస్పీగా ఉన్న వి.నారాయణస్వామిరెడ్డి.. వైకాపా అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఒంగోలు డీఎస్పీగా పనిచేసినప్పుడు ఏకపక్షంగా పనిచేశారన్న ఫిర్యాదులున్నాయి.

పల్నాడు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేల అరాచకాలకు నరసరావుపేట డీఎస్పీగా పనిచేసిన వీఎస్‌ఎన్‌ వర్మ అండగా నిలిచారన్న ఫిర్యాదులున్నాయి.


అమరావతి రైతులపై బాలచంద్రారెడ్డి, మాధవరెడ్డిల దమనకాండ

బాలచంద్రారెడ్డి

టెక్కలి డీఎస్పీ ధనిరెడ్డి బాలచంద్రారెడ్డి (అంతకుముందు రామచంద్రపురం డీఎస్పీగా వ్యవహరించారు), గతంలో అమలాపురం డీఎస్పీగా పనిచేసిన వై.మాధవరెడ్డిలు వైకాపాకు కొమ్ముకాశారన్న ఫిర్యాదులున్నాయి. అమరావతి నుంచి అరసవల్లి వరకూ మహాపాదయాత్రగా వెళుతున్న రైతులపై దౌర్జన్యం చేసి దాడులకు పాల్పడ్డారు. అమరావతి రైతులు పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించి రామచంద్రపురంలో బస చేసినప్పుడు వారు అక్కడ ఉండటానికి వీల్లేదంటూ బాలచంద్రారెడ్డి దురుసుగా ప్రవర్తించారు. అందరినీ బలవంతంగా ఖాళీ చేయించారు. రైతులు పాదయాత్రలో వినియోగించిన వెంకటేశ్వరస్వామి దివ్యరథానికి కాపలాగా ఉన్నవారిపై భౌతిక దాడులకు పాల్పడి అందులోని సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌లను తీసుకెళ్లిపోయారన్న ఫిర్యాదులున్నాయి. అమలాపురం జిల్లా పేరు మార్పు సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లలో వైకాపా నాయకుల ఆదేశాల మేరకు ప్రతిపక్షాలకు చెందిన అమాయకులను కేసుల్లో ఇరికించారన్న విమర్శలు మాధవరెడ్డిపై ఉన్నాయి.

మాధవరెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని