Kakinada: ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ

ఆ రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Updated : 05 Jul 2024 08:54 IST

కాకినాడ జిల్లాలో రొయ్యల శుద్ధి కేంద్రం
కాలువల్లోకి యథేచ్ఛగా వ్యర్థాల విడుదల
జలాలు కలుషితమై గగ్గోలు పెడుతున్న స్థానికులు

కరప మండలం గురజనాపల్లిలోని వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌ రొయ్యల శుద్ధి కర్మాగారం

కరప, న్యూస్‌టుడే: ఆ రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లిలో ఉన్న వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌ రొయ్యల శుద్ధి కర్మాగారం గురించే ఇదంతా. కాకినాడ నగర వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడికి చెందిన ఈ పరిశ్రమ 2015లో ఏర్పాటయింది. ఇక్కడ రొయ్యల ప్రాసెసింగ్‌ చేస్తుంటారు. ఈ ప్రక్రియలో విడుదలయ్యే వ్యర్థ జలాలను ఖాళీగా ఉన్న వందల ఎకరాల సాల్ట్‌ భూముల గుండా చిన్న చిన్న కాలువల్లోకి వదిలేస్తున్నారు. అవి ఉప్పలంక సమీపంలోని గోదావరి పాయ ద్వారా సముద్రంలో కలుస్తున్నాయి. ఒకప్పుడు ప్రజావసరాలకు ఉపయోగపడిన ఈ కాలువల్లోని నీరు.. ఇప్పుడు కలుషితమై విషతుల్యంగా మారింది. గురజనాపల్లి, చొల్లంగి, ఉప్పలంక గ్రామాలపై ప్రభావం ఉండగా.. ఉప్పుసాగునూ ఈ కలుషిత జలాలు ప్రభావితం చేస్తున్నాయి. సముద్రంలోని చేపలు చనిపోయి మత్స్యకారులకు ఉపాధీ కరవవుతోంది. 

పత్తా లేని పీసీబీ అధికారులు

ప్రతి రెండు నెలలకు ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలన జరగాల్సి ఉన్నా కాలుష్య నియంత్రణశాఖ (పీసీబీ) అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఇదే పరిశ్రమలో గతంలో ఏడాది కాలంలో మూడుసార్లు అమ్మోనియా గ్యాస్‌ లీకైన ఘటనలున్నాయి. పలుమార్లు ప్రమాదం జరిగినా యాజమాన్యం తమ సొంత ప్రైవేటు ఆసుపత్రులలో బాధితులను చేర్పించి కేసులు లేకుండా జాగ్రత్త పడింది. కాకినాడలో ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమీక్షలోనూ ఈ పరిశ్రమ కాలుష్యం గురించి ప్రస్తావించారు. పీసీబీ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


కర్మాగారం నుంచి వస్తున్న కాలుష్య కారక వ్యర్థాలు


తగిన చర్యలు తీసుకుంటాం
- సందీప్‌రెడ్డి, ఈఈ, ఏపీ పీసీబీ, కాకినాడ

గురజనాపల్లిలోని రొయ్యల శుద్ధి పరిశ్రమ నుంచి రసాయనిక వ్యర్థాలు బయటకు వదలకుండా చర్యలు చేపడతాం. అనుమతికి మించి అధిక ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించి యాజమాన్యానికి ఇప్పటికే నోటీసు అందజేశాం. ప్రత్తిపాడు మండలం లంపకలోవలోని రొయ్యల పరిశ్రమకూ నోటీసులు ఇచ్చాం. జల కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని