DWCRA: రూ.2,100 కోట్లు దారి మళ్లింపు

ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలు రూపాయి, రూపాయి కూడబెట్టుకున్న అభయహస్తం నిధులనూ వైకాపా ప్రభుత్వం వదల్లేదు. 2021లో ఎల్‌ఐసీ వద్ద ఉన్న రూ.2,100 కోట్లను లాగేసుకున్నారు. ఆ నిధులు ఏం చేశారో, ఎక్కడికి మళ్లించారో ఇప్పటికీ మిస్టరీనే.

Published : 17 Jun 2024 05:44 IST

అవన్నీ డ్వాక్రా మహిళల అభయహస్తం నిధులే
2021లో ఎల్‌ఐసీని తప్పించి సెర్ప్‌ ఆధీనంలోకి తెచ్చిన వైకాపా ప్రభుత్వం
స్త్రీనిధికి చెందిన రూ.1000 కోట్ల నిధులూ ఇదే తరహాలో దుర్వినియోగం
విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి

ఈనాడు, అమరావతి: ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలు రూపాయి, రూపాయి కూడబెట్టుకున్న అభయహస్తం నిధులనూ వైకాపా ప్రభుత్వం వదల్లేదు. 2021లో ఎల్‌ఐసీ వద్ద ఉన్న రూ.2,100 కోట్లను లాగేసుకున్నారు. ఆ నిధులు ఏం చేశారో, ఎక్కడికి మళ్లించారో ఇప్పటికీ మిస్టరీనే. ఇదే కాదు.. డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు రుణాలిస్తామని చెప్పి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో తెచ్చిన రూ.1000 కోట్ల స్త్రీనిధి లెక్క కూడా తేలలేదు. ఈ రెండు వ్యవహారాల్లో అప్పటి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) సీఈఓ ఇంతియాజ్‌ కీలకంగా వ్యవహరించారు. ఆయన కర్నూలు నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈ వ్యవహారాలపై విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశముంది.

అభయహస్తం అంటే ఏమిటి? 

డ్వాక్రా సంఘాల్లోని 18-60 ఏళ్ల మధ్య మహిళలకు 2009లో ఈ పథకాన్ని అమలు చేశారు. ఏడాదికి సభ్యులు వారి వాటాగా రూ.365 చెల్లిస్తే రాష్ట్రప్రభుత్వం వారి తరఫున మరో రూ.365 జమచేస్తుంది. వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.500 చొప్పున పింఛను ఇస్తారు. 2013-14 తర్వాత ఇందులో నమోదు నిలిపేశారు. ప్రస్తుతం ఏపీలో 9 లక్షల మంది వాటాదారులు ఉన్నారు. లబ్ధిదారులు, ప్రభుత్వ వాటా కలిపి 2021 నాటికి దాదాపుగా రూ.2,100 కోట్లకు చేరింది. ఈ మొత్తంపై కన్నేసిన వైకాపా ప్రభుత్వం.. నోడల్‌ ఏజెన్సీగా ఉన్న ఎల్‌ఐసీని తప్పించి తామే అమలుచేస్తామంటూ రూ.2,100 కోట్లను వెనక్కి తీసుకుంది. ఈ మొత్తం ఏమైందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. 

ప్రత్యేక ఖాతాల్లో ఉంచినట్టు నమ్మబలికే యత్నం: ఎల్‌ఐసీ నుంచి తీసుకున్న రూ.2,100 కోట్లను సెర్ప్‌ పరిధిలోనే ప్రత్యేకఖాతాలో ఉంచినట్టు అప్పట్లో ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఈ పథకం నుంచి వైదొలగిన వారికి వాళ్ల వాటా మొత్తాన్ని తిరిగివ్వాలి. ఇది దాదాపుగా రూ.320 కోట్ల వరకు ఉంది. ఏ ఒక్కరికీ వైకాపా ప్రభుత్వం తిరిగి చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు.

సీఐఎఫ్‌ నిధులకూ ఎసరు: జీవనోపాధి కల్పనకు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడమే స్త్రీనిధి సంస్థ విధి. ఇందుకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని వారికి అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలిస్తుంది. తీసుకున్న మొత్తాన్ని డ్వాక్రా మహిళలు నెలవారీ వాయిదాలుగా చెల్లిస్తారు. వచ్చిన మొత్తాన్ని ఇతరులకు రుణంగా ఇస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇలా డ్వాక్రా మహిళలకు రుణం ఇప్పించేందుకంటూ స్త్రీనిధి సంస్థలోని ఓ కీలక అధికారి బ్యాంకుల నుంచి రూ.1000 కోట్లు అప్పుగా తెచ్చారు. ఆ మొత్తాన్ని వారికి ఇవ్వకుండా మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. డ్వాక్రాసంఘాలకు పెట్టుబడి నిధిగా మండల సమాఖ్యల్లో ఏళ్లుగా నిల్వ ఉన్న రూ.100 కోట్లు కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ నిధుల్ని (సీఐఎఫ్‌) దుర్వినియోగం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని