Ramoji Rao: పత్రికా రంగానికి మార్గదర్శి

పత్రికా రంగంపై, తెలుగు ప్రజలపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని..ఆయన జీవితం నుంచి సాహసం, పట్టుదల, దార్శనికత వంటి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని సంపాదకులు, సీనియర్‌ పాత్రికేయులు పేర్కొన్నారు.

Updated : 17 Jun 2024 06:52 IST

దార్శనికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి
తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేశారు
ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం
‘రామోజీరావుకు అక్షరాంజలి’ సభలో సంపాదకులు, సీనియర్‌ పాత్రికేయులు

సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు
చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సీనియర్‌ పాత్రికేయులు కనపర్తి శ్రీనివాస్, 
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి, ఉండ్రు నరసింహారావు, వేణుగోపాలనాయుడు, రామచంద్రమూర్తి, 
డీఎన్‌ ప్రసాద్, విరాహత్‌ అలీ, తిగుళ్ల కృష్ణమూర్తి, శ్రీధర్, ఎం.నాగేశ్వరరావు, పీఎస్‌ఆర్‌సీ మూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: పత్రికా రంగంపై, తెలుగు ప్రజలపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని..ఆయన జీవితం నుంచి సాహసం, పట్టుదల, దార్శనికత వంటి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని సంపాదకులు, సీనియర్‌ పాత్రికేయులు పేర్కొన్నారు. నిబద్ధతకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఆయన నిలిచారని.. తెలుగును ప్రేమించి, అభిమానించి పత్రికా రంగానికి దారులు వేసి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ‘పాత్రికేయ శిఖరం రామోజీరావుకు అక్షరాంజలి’ సభను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. పత్రికలు, టీవీ ఛానళ్ల ఎడిటర్లు, సీనియర్‌ పాత్రికేయులు, ఈనాడు ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని వారంతా గుర్తుచేసుకున్నారు. పలువురు తమ అనుభవాల్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు జర్నలిజానికి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన పాత్రికేయ శిఖరం అంటూ  రామోజీరావును ప్రశంసించారు.

ఆల్‌ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్‌ జైపాల్‌రెడ్డి, ఆర్టీఐ మాజీ కమిషనర్‌ దిలీప్‌రెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు వైఆర్‌బీ సత్యమూర్తి (బాలు), ఎం.ఎల్‌.నరసింహారెడ్డి, కనపర్తి శ్రీనివాస్, ఉండ్రు నరసింహారావు, అద్దేపల్లి నరసింహారావు, శంకరనారాయణ, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు లావేటి వేణుగోపాలనాయుడు, ఉపాధ్యక్షురాలు వనజ, సంయుక్త కార్యదర్శులు హరిప్రసాద్, రమేష్‌ వైట్ల,   ట్రెజరర్‌ రాజేశ్, ఈసీ సభ్యులు వసంత్, శ్రీనివాస్‌    తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రెస్‌ అకాడమీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి. చిత్రంలో విజయనగరం ఎంపీ
అప్పలనాయుడు, సీనియర్‌ పాత్రికేయులు విరాహత్‌ అలీ, కందుల రమేష్, వీఎస్‌ఆర్‌ శాస్త్రి, శ్రీధర్, 
ఎం.నాగేశ్వరరావు, పీఎస్‌ఆర్‌సీ మూర్తి, డీఎన్‌ ప్రసాద్, అల్లం నారాయణ, వేణుగోపాలనాయుడు

రామోజీరావు సాహసికుడు...

అనేక విశిష్ట గుణాల మేలు కలయిక రామోజీరావు. అలాంటి వ్యక్తులు శతాబ్దానికి ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారు. ఆయనలోని ఏ గుణాన్నైనా ఎవరైనా అనుసరించవచ్చు కానీ సాహస ప్రవృత్తి మాత్రం అనితరసాధ్యం. మూడు నెలలుగా ఆరోగ్యం సహకరించకపోయినా.. 88 ఏళ్ల వయసులోనూ ఆయన మెదడు పాదరసంలా పనిచేసింది. జూన్‌ 5న ప్రచురితమైన ఎడిటోరియల్‌ కూడా ఆయన బ్రీఫ్‌ చేసి.. అనేకసార్లు దిద్దిన తర్వాతే వచ్చింది. రామోజీరావు నాస్తికుడు.. సూర్యుడంటే ఆయనకు ఆరాధనాభావం. సమయపాలనలో సూర్యుడే ఆయనకు ఆదర్శం. ఆయన క్రమశిక్షణకు మారుపేరు. కఠిన ఆహార నియమాలు పాటించేవారు. 60 ఏళ్లుగా రోజూ ఉదయం నడుస్తూనే ఉన్నారు. దాదాపు 7.70 లక్షల కిలోమీటర్లు నడిచారు. ఇది చంద్రుడిపైకి వెళ్లి, తిరిగి వచ్చినంత దూరం. ‘అబ్దుల్‌ కలాం అంటే నాకు అసూయ. ఆయన పనిచేస్తూనే పోయారు. నేను కూడా పనిచేస్తూ ఒరిగిపోవాలి’ అనే వారు. అలాగే ఒరిగిపోయారు. 2018లోనే తన స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు.

ఎం.నాగేశ్వరరావు, ఎడిటర్, ఈనాడు ఆంధ్రప్రదేశ్‌


దేనికైనా కొన్నేళ్ల ముందే పక్కా ప్రణాళిక

రామోజీరావు తాను అడుగుపెట్టిన ఏ రంగంలో అయినా కొన్ని సంవత్సరాల ముందే పక్కా ప్రణాళిక రూపొందించుకుని అనుకున్న సమయానికి ప్రారంభించేవారు. నేను రిపోర్టర్‌గా చేరినా... ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్‌ వైపు వెళ్లడంతో అందరికంటే ఎక్కువగా ఛైర్మన్‌తో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఉదయం ఎడిటోరియల్‌ సమావేశాలు నిర్వహిస్తే.. మధ్యాహ్నం నుంచి మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాల సమావేశాలు నిర్వహించే గొప్ప లక్షణం ఆయనలో ఉంది. ఎడిటోరియల్‌ సమీక్షల్లో మాత్రం పక్కా జర్నలిస్టుగా వ్యవహరించేవారు.ఆయన లేరన్న ఆలోచన ఇప్పటికీ నాకు రావడం లేదు. నా వెనుకే ఉన్నారు..సలహాలు ఇస్తున్నారనే భావన కలుగుతోంది. 

డీఎన్‌ ప్రసాద్, ఎడిటర్, ఈనాడు తెలంగాణ


కశ్మీర్‌వాసులు ఈటీవీ ఉర్దూ ఛానల్‌ను నమ్మేవారు

నేను ఈనాడులో పనిచేయలేదు కానీ, రామోజీరావు అంటే అభిమానం. నేను హెచ్‌ఎంటీవీలో పనిచేస్తున్నప్పుడు జమ్మూకశ్మీర్‌ వెళ్లి చాలామందిని కలిసి ఇంటర్వ్యూ చేశా. ‘మేం ఏ ఛానళ్లు చూడం.. ఏ ఛానళ్లను నమ్మం. ఈటీవీ ఉర్దూ న్యూస్‌ బులెటిన్‌ మాత్రం రోజూ చూస్తాం. అందులో ఉన్నది ఉన్నట్లు చూపిస్తారు’ అని నాతో కశ్మీరీలు చెప్పారు. రామోజీరావుని కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పా. 

రామచంద్రమూర్తి, సీనియర్‌ సంపాదకుడు


జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు

తెలుగు జర్నలిజానికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది, ఒక స్థానం కల్పించింది రామోజీరావే. ఆయన ఒక అంశాన్ని తీసుకుంటే విజయం సాధించేవరకు పట్టువదలరు. రాష్ట్రంలో ముఖ్యపాత్ర పోషించినా ఆయన ఏనాడూ ఎంపీ కావాలని కోరుకోలేదు. తన కుటుంబసభ్యులకూ ఆ పదవి ఆశించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వాల నుంచి, పోలీసుల నుంచి, వ్యవస్థల నుంచి జర్నలిజానికి ముప్పు వాటిల్లినప్పుడు అండగా నిలబడ్డారు.

కె.శ్రీనివాస్‌రెడ్డి, ప్రెస్‌ అకాడమీ అధ్యక్షుడు


మేరునగధీరుడు...

రామోజీరావు. ఓ మేరునగధీరుడు. ఆయన ఎంతో శక్తిమంతమైన వ్యక్తి అయినా రాజకీయాలవైపు చూడలేదు. మార్గదర్శి వంటి విషయాల్లో ఆయనకేదైనా సమస్య వస్తే ఆయనే పోరాడారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్‌ఫండ్‌ విషయాల్లో అప్పటి ప్రభుత్వాలు కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోరాడారు. తట్టుకుని నిలబడ్డారు. రామోజీరావుకు ఉన్న విశ్వసనీయతను చూసే ఖాతాదారులు డబ్బు కోసం ఒత్తిడి చేయలేదు.

కందుల రమేష్, సీనియర్‌ పాత్రికేయుడు


నిర్ణయాలు తీసుకోవడంలో సాహసి 

రాయిని రత్నంగా సానబెట్టే శక్తి ఒక్క రామోజీరావుకే ఉంది. 1994లో నేను ఈనాడులో చేరా. చిన్న పల్లెటూరి నుంచి, ఏం తెలియని వ్యక్తినైన నేను పాత్రికేయంలో ఎదిగానంటే ఆయనే కారణం. నిర్ణయాలు తీసుకోవడంలో సాహసి. చేయాల్సిన పని చేయాలి.. చేయకూడని పనుల్ని చేయవద్దు..ఈ విషయాల్ని ఆయన్నుంచి నేర్చుకున్నా. 

తిగుళ్ల కృష్ణమూర్తి, ఎడిటర్, నమస్తే తెలంగాణ


పత్రికా రంగానికి పెద్దదిక్కు...

నేను ఈనాడు సంస్థలో పనిచేయకపోయినా నాపై రామోజీరావు ప్రభావం ఉంది. పాత్రికేయాన్ని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లారు. పత్రికా రంగానికి ఆయన పెద్దదిక్కు. గొప్ప దార్శనికుడు. పత్రిక అంటే ఈనాడే అన్నట్లుగా ముందుకు తీసుకెళ్లిన ఘనత ఆయనది. 

అల్లం నారాయణ, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ మాజీ అధ్యక్షుడు


రెండు రోజులు ఏడిపించావయ్యా అన్నారు

ఛైర్మన్‌తో నాది 40 ఏళ్ల సాన్నిహిత్యం.  నాకు 45 ఏళ్ల వయసులో గుండె శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఆసుపత్రికి వచ్చి రెండురోజులు నన్ను ఏడిపించావయ్యా అన్నారు. అంతకంటే మనిషికి ఏం కావాలి!  నా కార్టూన్‌లతో చాలా కేసులు నమోదయ్యాయి. ఆయనే ఎదుర్కొన్నారు తప్ప నా దగ్గరకు రానివ్వలేదు. అదీ రామోజీరావు గొప్పతనం. 

శ్రీధర్, ప్రముఖ కార్టూనిస్ట్‌


పనిలో పరిపూర్ణత వచ్చేంత వరకు...

రామోజీరావుతో నాకున్న అనుబంధం పాతికేళ్లు. పని విషయంలో పరిపూర్ణత వచ్చేంతవరకు వదిలిపెట్టేవారు కాదు. వార్తల విషయంలో జర్నలిస్టులకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు. జీవితానికి సంబంధించి అనేక సత్యాలను చెప్పేవారు. వాటిని ఓ పుస్తకరూపంలో తీసుకువస్తే బాగుంటుంది. 

వీఎస్‌ఆర్‌ శాస్త్రి, ఎన్‌టీవీ చీఫ్‌ ఎడిటర్‌


నేను ఈరోజు ఎంపీని అయినా..

నేను ఈరోజు ఎంపీని అయినా.. ఈనాడులో కంట్రిబ్యూటర్‌గా నా జీవితం ప్రారంభమైంది. ఈనాడు విలేకరికి ప్రజల్లో ఉండే గౌరవాన్ని చూసి పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నించి సంస్థలో చేరా. రామోజీరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నా.

కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎంపీ


ఆ మహా వ్యక్తి వై-ఫైలా మన మధ్యే

రామోజీరావుతో అత్యంత సమీపంగా 27 ఏళ్ల పాటు పనిచేశా. పట్టిన పని అయ్యేదాక వెంటపడే ధీరోదాత్త గుణం ఆయనది. ఆ మహావ్యక్తి మన మధ్య లేరనుకోవద్దు.. వై-ఫైలా మన మధ్యే ఉన్నారు. ఇది రామోజీరావు సంతాప సభకాదు.. సంకల్ప సభ.

పీఎస్‌ఆర్‌సీ మూర్తి, సీనియర్‌ పాత్రికేయుడు


వృత్తిని, వ్యాపారాన్ని వేర్వేరుగా చూశారు.. 

రామోజీరావు వృత్తిని, వ్యాపారాన్ని వేర్వేరుగా చూశారు.రిపోర్టర్లు, సబ్‌ ఎడిటర్లను ఎప్పుడూ వ్యాపార ప్రకటనలు తేవాలని అడగలేదు. జర్నలిస్టులను నాణ్యమైన ఎడిషన్‌ మాత్రమే తీసుకురావాలని కోరేవారు. వృత్తి నియమాలను పాటించేవారికి ఆయన మద్దతు ఇచ్చారు. 

వల్లీశ్వర్, సీనియర్‌ పాత్రికేయుడు


రామోజీరావు జీవితం ఓ గ్రంథమే

రామోజీరావు జీవితం ఒక గ్రంథమే. తనతో పాటు పది మందిని బతికించాలనే తపన కలిగిన గొప్ప వ్యక్తి ఆయన. చాలాకాలంగా మీడియా విశ్వసనీయతను కోల్పోతోంది అనే చర్చ నడుస్తోంది. కానీ విశ్వసనీయత ఎలా ఉండాలనేది రామోజీరావు కచ్చితంగా నిరూపించారు. 

కె.విరాహత్‌ అలీ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు