Andhra News: జగన్‌ జమానా బకాయిలు రూ. 5,278 కోట్లు

విద్యాశాఖలో వైకాపా ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు కొత్త ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. పాత బాకీలన్నీ తీర్చి, కొత్త కార్యక్రమాలు నిర్వహించడం కూటమి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.

Published : 11 Jul 2024 03:37 IST

విద్యాశాఖలో నిధుల్లేవు.. అన్నీ బాకీలే
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.3,480 కోట్లు..
బడుల్లో మౌలిక వసతులకు రూ.వెయ్యి కోట్లు పెండింగ్‌
చిక్కీలు, కోడిగుడ్లకు బాకీ రూ.178 కోట్లు
పేద పిల్లలకు కుట్టుకూలి కింద ఇవ్వాల్సింది రూ.65 కోట్లు
కొత్త ప్రభుత్వం ముందు బకాయిల సవాళ్లు

ఈనాడు, అమరావతి: విద్యాశాఖలో వైకాపా ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు కొత్త ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. పాత బాకీలన్నీ తీర్చి, కొత్త కార్యక్రమాలు నిర్వహించడం కూటమి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కొన్ని విభాగాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం వైకాపా సర్కారు దారి మళ్లించడంతో సిబ్బందికి జీతాలిచ్చేందుకూ కటకటలాడిపోతున్న పరిస్థితి. ఒక్క విద్యాశాఖలోనే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.5,278 కోట్ల పైమాటే. గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన బకాయిలు రూ.3,480 కోట్లు. 2023-24 విద్యా సంవత్సరానికి నాలుగు విడతల ఫీజు చెల్లించాల్సి ఉండగా.. ఒక్క విడతకు మాత్రమే ఎన్నికల ముందు బటన్‌ నొక్కి, జగన్‌ హడావుడి చేశారు. ఆ డబ్బులు కూడా విడుదల కాలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఐదేళ్లలో ఏ సంవత్సరం కూడా వసతి దీవెనను పూర్తిగా చెల్లించలేదు. పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులకు ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల చెల్లింపు పథకాన్ని 2020-21 నుంచి గత ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటి వరకు చెల్లించాల్సిన పీజీ ఫీజు బకాయిలే రూ.450 కోట్లకు పైగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఫీజుల డబ్బులు ఇవ్వకపోవడంతో చాలా మంది విద్యార్థులు ధ్రువపత్రాలను కళాశాలల్లోనే వదిలేశారు. 

మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తం

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ‘నాడు-నేడు’ రెండో విడతనే పూర్తి చేయలేదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి గత ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు నిలిపివేసింది. 2021 ఆగస్టు 16న ప్రారంభించిన రెండో విడత పనులను రెండున్నరేళ్లలోనూ పూర్తి చేయలేదు. దాదాపు 8 వేల అదనపు తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. 6 వేల మరుగుదొడ్లు పూర్తి చేయాలి. బడులకు రంగులు, తలుపులు, కిటికీల ఏర్పాటు ఇలా అన్ని పనులు పూర్తి చేసేందుకు రూ.వెయ్యి కోట్ల వరకు నిధులు అవసరం. ఇందులో గుత్తేదార్లకు చెల్లించాల్సిన బకాయిలే రూ.230 కోట్లు. 

ఆయాలు, వాచ్‌మన్ల జీతాలకూ కటకటే..

విద్యాశాఖలో నిధుల్లేక జీతాలకు కటకటలాడుతున్నారు. సమగ్ర శిక్షా అభియాన్‌కు కేంద్రం ఇచ్చిన నిధులనూ గత ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించేసింది. దీంతో ఎస్‌ఎస్‌ఏలోని 25 వేల మంది సిబ్బందికి మే, జూన్‌ నెలల వేతనాలుగా రూ.130 కోట్లు బకాయి పడింది. 

  • రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 46 వేల మంది ఆయాలు, 5 వేల మంది రాత్రి కాపలాదారులకు కొన్నిచోట్ల మార్చి నుంచి, మరికొన్ని చోట్ల ఏప్రిల్‌ నుంచి జీతాలివ్వలేదు. అమ్మఒడి పథకం లబ్ధిదారుల ఒక్కొక్కరి నుంచి మినహాయించిన రూ.2 వేలను సైతం గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసుకుంది. వీరికి రూ.75 కోట్ల వరకు బకాయి పడింది.  
  • జూనియర్‌ కళాశాలల్లో ఒప్పంద ఉద్యోగులకు మే, జూన్‌ జీతాల బకాయిలు రూ.41 కోట్లున్నాయి. 

కుట్టుకూలి ఇవ్వలేదు.. 

గతేడాది విద్యా కానుక కింద ఏకరూప దుస్తులిచ్చిన ప్రభుత్వం పిల్లలకు కుట్టుకూలి డబ్బులు రూ.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మళ్లీ ఏకరూప దుస్తులు అందిస్తున్నందున రెండూ కలిపి చెల్లించాలి. 

  • 2023-24 విద్యా కానుకకు సంబంధించి గుత్తేదార్లకు రూ.80 కోట్ల వరకు బకాయిలున్నాయి. పాఠ్యపుస్తకాల ముద్రణకు కాగితం సరఫరా చేసిన తమిళనాడు ప్రభుత్వానికి రూ.199 కోట్లు బాకీ పడింది. 
  • విద్యార్థులకు ఇచ్చే చిక్కీలకు ఆగస్టు నుంచి రూ.66 కోట్లు, కోడిగుడ్లకు డిసెంబరు నుంచి రూ.112.5 కోట్లు కలిపి మొత్తం రూ.178.5 కోట్ల బకాయిలున్నాయి. దీంతో గుత్తేదార్లు సరఫరాలో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఆఖరికి పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతకు వినియోగించే రసాయనాల బిల్లులు రూ.30 కోట్లు సైతం పెండింగ్‌ పెట్టారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని