AP cabinet: ఆ కుటుంబాల్లో ఉద్వేగం.. ఉత్సాహం

కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం వారిలోనూ, వారి కుటుంబసభ్యుల్లోనూ ఒక రకమైన ఉద్వేగం, ఉత్సాహాన్ని నింపింది. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసి, ఈ రోజు కోసం నిరీక్షించిన వారి ఆనందం రెట్టింపయింది.

Updated : 13 Jun 2024 06:48 IST

పవన్‌ ప్రమాణ స్వీకారాన్ని మురిపెంగా చూసిన చిరంజీవి
దృశ్యాలు చిత్రీకరించిన పవన్‌ భార్య అనా
లోకేశ్‌ ప్రమాణ స్వీకారంలో బ్రాహ్మణి, దేవాన్ష్‌దీ అదే ఉత్సాహం
కొత్త మంత్రుల కుటుంబాల్లోనూ సంతోషం

పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో బంధిస్తున్న పవన్‌ సతీమణి అనా లెజ్నోవా

ఈనాడు, అమరావతి: కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం వారిలోనూ, వారి కుటుంబసభ్యుల్లోనూ ఒక రకమైన ఉద్వేగం, ఉత్సాహాన్ని నింపింది. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసి, ఈ రోజు కోసం నిరీక్షించిన వారి ఆనందం రెట్టింపయింది. పవన్‌కల్యాణ్, నారా లోకేశ్‌ ప్రమాణ స్వీకార సమయంలో వారి కుటుంబసభ్యులు సంతోషంగా కనిపించారు. కొత్త మంత్రులు, వారి కుటుంబసభ్యుల్లోనూ ఉద్విగ్నత కనిపించింది. 

పవన్‌కల్యాణ్‌ కుటుంబంలో ఉద్వేగం

పవన్‌కల్యాణ్‌ ప్రమాణం చేస్తున్నప్పుడు సభ చప్పట్లతో మారుమోగింది. వైకాపా పాలనలో ఆయన ఎన్నో వేధింపులు, విమర్శలను ఎదుర్కొన్నారు. వాటిపై ధైర్యంగా పోరాడారు. ప్రస్తుత అఖండ విజయం ఆయనలోనూ, ఆయన కుటుంబంలోను ఉద్విగ్నతను నింపింది. భార్యాపిల్లలతో సహా ఆయన కుటుంబసభ్యులంతా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. సోదరులు చిరంజీవి, నాగబాబు సతీసమేతంగా వచ్చారు. రామ్‌చరణ్, సాయిధరమ్‌తేజ్, ఇతర కుటుంబసభ్యులు ఒకే వాహనంలో వేదిక వద్దకు చేరుకున్నారు. పవన్‌కల్యాణ్‌ ప్రమాణస్వీకారం చేస్తుండగా అన్న చిరంజీవి మురిపెంగా చూశారు. పవన్‌ భార్య అనా తన సెల్‌ఫోన్లో వీడియో తీస్తూ ఆనందంగా కనిపించారు. ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్, చంద్రబాబులకు నమస్కరించి అదే వేదికపై కుడివైపున ఆసీనులైన ప్రముఖుల వైపు పవన్‌ వెళ్లారు. వారందరికీ నమస్కరించి అన్న చిరంజీవి కాళ్లకు మొక్కబోగా తొలుత వారించారు. అప్పటికీ నమస్కరించగా చిరంజీవి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. వారిద్దరు సంతోషంగా మాట్లాడుతూ కనిపించారు.


ప్రమాణ స్వీకార కార్యక్రమం వీక్షిస్తున్న లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి, సినీనటుడు రామ్‌చరణ్, ఎంపీ భరత్‌ దంపతులు

లోకేశ్‌ను ప్రమాణ స్వీకారానికి పిలిచేసరికి ఆయన భార్య బ్రాహ్మణి చప్పట్లు కొడుతూ.. పక్కనే ఉన్న కుమారుడు దేవాన్ష్‌ను వేదిక వైపు చూడాలని సూచించారు. లోకేశ్‌ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఇద్దరూ చప్పట్లు కొట్టారు. లోకేశ్‌ ప్రధాని కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించారు. ప్రధాని వారించి చేతులు పట్టుకుని మాట్లాడారు. తండ్రికి లోకేశ్‌ పాదాభివందనం చేశారు. గవర్నర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుల పాదాలకూ నమస్కరించారు. అమిత్‌షా కాళ్లకూ నమస్కరించబోగా వారించి చేతులు పట్టుకుని అభినందించారు.

కొత్త మంత్రులు ప్రమాణం చేసిన తర్వాత.. చాలా మంది తొలుత చంద్రబాబుకు నమస్కరించేందుకు ప్రయత్నించగా ఆయన వారించి ప్రధాని మోదీ వైపు చూపించారు. చాలా మంది మోదీ కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. 


ప్రజలతో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమం వీక్షిస్తున్నవసుంధర, బ్రాహ్మణి, దేవాంశ్‌ తదితరులు

ఉత్సాహంగా ఎన్టీఆర్‌ కుటుంబం...

ప్రమాణస్వీకారానికి ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు చాలామంది హాజరయ్యారు. అందరిలోనూ ఉద్విగ్నత కనిపించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆమె సోదరి.. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుకుంటూ ఒకేసారి వేదికపైకి వచ్చారు. పురందేశ్వరి తనకు కేటాయించిన స్థానం వైపు వెళుతూ భువనేశ్వరి భుజం తట్టి ఏదో మాట్లాడుతూ కనిపించారు. భువనేశ్వరి తన సోదరికి సమాధానం చెప్పి తన సీటు వైపు వెళ్లారు. కాసేపటికే బాలకృష్ణ తన సోదరి భువనేశ్వరి కూర్చున్నచోటుకు వచ్చి తలపై చేయి వేసి ఆశీర్వదించారు. నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు. బాలకృష్ణ అతిథులందరినీ స్వయంగా స్వాగతించారు. అగ్రనటులు రజనీకాంత్‌ దంపతులు, చిరంజీవిలకు ఎదురువెళ్లి బాలకృష్ణ ఆహ్వానించారు.కేంద్ర మంత్రి అమిత్‌షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులు పక్కపక్కనే కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. వారి వద్దే కేంద్ర మంత్రులు నడ్డా, నితిన్‌ గడ్కరీ ఆసీనులయ్యారు. సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సైతం ప్రముఖులందరితో మాట్లాడుతూ పరస్పరం నమస్కరిస్తూ కనిపించారు.


వేదికపై బాలకృష్ణతో ప్రధాని


వేదికపై భువనేశ్వరిని ఆశీర్వదిస్త్ను బాలకృష్ణ


తల్లి భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకుంటున్న లోకేశ్‌


అమిత్‌ షా, వెంకయ్యనాయుడి మాటామంతి


ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బస్సులో వెళ్తున్న ‘ మెగా’ కుటుంబ సభ్యులు

ప్రధాని కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నిస్తున్న లోకేశ్‌ను వారిస్తున్న ప్రధాని. చిత్రంలో భువనేశ్వరి, చంద్రబాబు


ప్రమాణ స్వీకారం వీక్షించడానికి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని