Andhra News: బి.సుబ్బారెడ్డి వైదొలిగె... సీవీ సుబ్బారెడ్డి వచ్చె!

రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) నియామకంలో ఎస్సీ, ఎస్టీ ఇంజినీర్లకు మరోసారి అన్యాయం జరిగింది.

Updated : 01 Dec 2022 08:31 IST

పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ నియామకంలో మరోసారి భంగపడ్డ ఎస్సీ, ఎస్టీ ఇంజినీర్లు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) నియామకంలో ఎస్సీ, ఎస్టీ ఇంజినీర్లకు మరోసారి అన్యాయం జరిగింది. సీనియారిటీ ప్రకారం ఈఎన్‌సీ స్థానానికి అర్హులను పక్కన పెట్టి... జాబితాలో ఐదో వ్యక్తిని ఈఎన్‌సీ స్థానంలో కూర్చోబెట్టి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించడం పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. 2021 మే 31న చీఫ్‌ ఇంజినీర్‌గా పదవీవిరమణ చేసిన బి.సుబ్బారెడ్డికి ఈఎన్‌సీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆయన కంటే సీనియర్లయిన ఎస్సీ, ఎస్టీ ఇంజినీర్లు ఇప్పటికే నష్టపోయారు. సుబ్బారెడ్డి పదవీకాలాన్ని రెండు విడతల్లో ఏడాదిన్నర పాటు ప్రభుత్వం పొడిగించింది. దీంతో ఇన్నాళ్లూ కొందరు సీఈలుగానే ఉద్యోగ విరమణ చేశారు. ఈఎన్‌సీ ఎఫ్‌ఏసీగా బుధవారం వరకు ఉన్న బి.సుబ్బారెడ్డి మరో ఆరు నెలలు తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. చివరకు ఆయన వైదొలగడంతో సీఈల సీనియార్టీ జాబితాలో మొదటి పేరున్న ఎస్టీ వర్గానికి చెందిన బి.బాలునాయక్‌ను ఈఎన్‌సీగా నియమిస్తారని భావించిన ఇంజినీర్లకు ప్రభుత్వం చివరిక్షణంలో షాకిచ్చింది. ఆయన కంటే జూనియర్‌ అయిన సీవీ సుబ్బారెడ్డిని ఈఎస్‌సీగా నియమించి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన నియామక జీవో బుధవారం రాత్రి 10 గంటల వరకూ వెలువడలేదు. ఏపీ ఇ-గెజిట్‌ పోర్టల్‌ జీవో పెడితే సుబ్బారెడ్డి కంటే సీనియర్‌ ఇంజినీర్లు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్న ఉద్దేశంతో తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని