Kurnool: కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ఓర్వకల్లు, పాణ్యం మండలాల పరిధిలోని గని అడవుల్లో గ్రీన్‌కో సంస్థ హైడల్‌ ప్రాజెక్టు నిర్మాణం పేరిట పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని అధికారులు గుర్తించారు. అటవీప్రాంతాన్ని నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఆక్రమించినట్లు గుర్తించారు.

Published : 09 Jul 2024 06:25 IST

140 ఎకరాల్లో ఆక్రమణలు 
ఇష్టారాజ్యంగా రోడ్ల నిర్మాణం 
నోటీసులు జారీ చేసిన అటవీశాఖాధికారులు 
నిర్మాణ సంస్థకు వైకాపాతో సన్నిహిత సంబంధాలు

గ్రీన్‌కో హైడల్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం

ఈనాడు-కర్నూలు, న్యూస్‌టుడే-ఓర్వకల్లు : ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ఓర్వకల్లు, పాణ్యం మండలాల పరిధిలోని గని అడవుల్లో గ్రీన్‌కో సంస్థ హైడల్‌ ప్రాజెక్టు నిర్మాణం పేరిట పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని అధికారులు గుర్తించారు. అటవీప్రాంతాన్ని నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఆక్రమించినట్లు గుర్తించారు. ఆ సంస్థ ఎండీ, సీఈవో వైకాపా నేతకు సోదరుడు కావడంతో అడ్డగోలుగా ఆక్రమణలకు పాల్పడ్డారని చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గని అటవీప్రాంతంలో 1,680 మెగావాట్ల హైడల్‌ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్‌కో ముందుకు వచ్చింది. అధికారికంగానే 903.54 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. హైడల్‌ ప్రాజెక్టు ఏర్పాటు ఆలోచనకు తెదేపా హయాంలోనే బీజం పడింది. 2019వ సంవత్సరానికి ముందు తెదేపా అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపాదనలు తయారై భూకేటాయింపులు జరిగాయి. అనంతరం వైకాపా అధికారంలోకి రావడంతో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సంస్థ ఎండీ, సీఈవో అనిల్‌ సోదరుడు చలమలశెట్టి సునీల్‌ వైకాపా నేత. ఆ పార్టీ తరఫున ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. వైకాపా నేతకు చెందిన ప్రాజెక్టు కావడంతో నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నా అధికారులు నోరు మెదపలేదు. ఇదే అదనుగా గ్రీన్‌కో సంస్థ ప్రతినిధులు అడవిని తమ సొంత అవసరాలకు వీలుగా మార్చేసి కేటాయించిన భూములకన్నా 140 ఎకరాలు అదనంగా వినియోగించుకుంటున్నారు.

తన ఇంటికి ఏర్పడ్డ భారీ పగుళ్లను చూపిస్తున్న ఓ మహిళ

అనుమతుల్లేకుండా రహదారుల నిర్మాణం 

అటవీప్రాంతంలో రహదారుల నిర్మాణానికి ఆ శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. అలాంటివేవీ లేకుండా రోడ్లను నిర్మించేశారు. కేటాయించిన దానికన్నా అదనంగా భూమి కావాలనుకుంటే ఆ మేర మళ్లీ వివరాలతో దరఖాస్తు చేయాలి. అలా దరఖాస్తులు చేయకుండా కావాల్సినంత భూమిని యథేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. కొండ ప్రాంతాన్ని పలుచోట్ల తవ్వి, టన్నుల కొద్దీ రాళ్లను గుట్టలుగా ఉంచేశారు. ప్రాజెక్టు పనులు చేసే కార్మికుల కోసం పలుచోట్ల తాత్కాలిక షెడ్లు వేశారు. తవ్వకాలు, నిర్మాణాలకు అవసరమైన పొక్లెయిన్లు, లారీలు ఇతర యంత్రాలు నిలపడానికి, వాటి నిర్వహణ, మరమ్మతులకు తాత్కాలిక గ్యారేజీలు కొన్నింటిని ఏర్పాటుచేశారు.

అటవీభూముల్లో అక్రమంగా నిర్మించిన షెడ్ల ప్రాంతం

ఇళ్లకు పగుళ్లతో గ్రామస్థుల్లో ఆందోళన

కొండను పేలుడు పదార్థాలతో పలుసార్లు పేల్చడంతో సమీపంలో ఉన్న గుమ్మితం తండా వాసుల ఇళ్లకు పలుచోట్ల పగుళ్లొచ్చాయి. గ్రామస్థులు సంస్థ యాజమాన్యాన్ని ప్రశ్నించగా అందరికీ కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారంతా మిన్నకుండిపోయారు. 

పట్టాభూములను లీజుకు తీసుకున్నారు...

గుమ్మితం తండా వాసులకు కొన్ని దశాబ్దాల కిందటే రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చారు. ఎక్కువ మందికి పాస్‌ పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రీన్‌కో సంస్థ వారి నుంచి భూములను లీజుకు తీసుకుంది. కొంతమంది నుంచి కొనుగోలు చేసింది. అటవీశాఖ రికార్డుల ప్రకారం ఆయా భూములు అటవీశాఖకు చెందినవని, అవి కావాల్సివస్తే గ్రీన్‌కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.

అటవీభూములను చదునుచేసి నిర్మాణ సామగ్రిని ఉంచిన ప్రదేశం


ఇళ్ల శ్లాబులు దెబ్బతిన్నాయి..

‘పేలుళ్ల తీవ్రతకు ఇళ్ల గోడలు, శ్లాబులు దెబ్బతిన్నాయి. కొత్త ఇళ్లు కట్టిస్తామన్నారు. ఆ హామీ ఎప్పటికి నెరవేరుస్తారో తెలియడంలేదు. తాజాగా అటవీశాఖాధికారులు వచ్చి మా భూములన్నీ అటవీశాఖకు చెందినవని అంటున్నారు. మా భూములకు పట్టాదారుపాసుపుస్తకాలన్నీ పక్కాగా ఉన్నా వాటిని అటవీశాఖ పరిధిలోనివిగా ఎలా చెబుతారో అర్థం కావడంలేదు’

సామేనాయక్, నారాయణ నాయక్, శివ, గుమ్మితం తాండావాసులు, కర్నూలు జిల్లా 


ఆక్రమణలు గుర్తించి నోటీసులు పంపాం
పి.శ్యామల, డీఎఫ్‌వో, కర్నూలు 

కేటాయించిన భూముల పరిధిని దాటి అటవీశాఖ భూములను గ్రీన్‌కో సంస్థ ప్రతినిధులు వినియోగించుకుంటున్నారు. తండావాసుల నుంచి భూములు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. మా రికార్డుల ప్రకారం అవన్నీ అటవీశాఖకు చెందినవే. కొనుగోళ్లు, లీజులు వాటికి చెల్లవు. ఈ నేపథ్యంలో గ్రీన్‌కోకు నోటీసులు ఇచ్చాం. ప్రభుత్వానికి నివేదిక పంపాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని