EPFO: అధిక పింఛను కొద్దిమందికేనా?

EPFO on higher pension: ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం(ఈపీఎస్‌)-2014 సవరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమల్లో భాగంగా ఈపీఎఫ్‌వో అధిక పింఛనుకు సంబంధించి తాజాగా ప్రకటన జారీచేసింది.

Updated : 30 Dec 2022 12:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం(ఈపీఎస్‌)-2014 సవరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమల్లో భాగంగా ఈపీఎఫ్‌వో అధిక పింఛనుకు సంబంధించి తాజాగా ప్రకటన జారీచేసింది. సుప్రీం తీర్పులోని పేరా 44(5), 44(6) అమలుపై గురువారం ఈపీఎఫ్‌వో పింఛన్ల విభాగం అదనపు కేంద్ర పీఎఫ్‌ కమిషనర్‌ అనిమేష్‌ మిశ్ర మార్గదర్శకాలను జారీ చేశారు. 2014 సెప్టెంబరు 1కి ముందు ఉద్యోగ విరమణ చేసి, అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చెల్లిస్తూ అధిక పింఛనుకు ఆప్షన్‌ ఇచ్చిన వారికి మాత్రమే ఆ మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చారు. తీర్పులోని ఇతర పేరాలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తద్వారా లబ్ధిదారుల సంఖ్యను భారీగా కుదించారని, అతి కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందుతారన్న విమర్శలు వస్తున్నాయి. ఈపీఎఫ్‌ చట్టంలోని పేరా 11(3) ప్రకారం 2014 సెప్టెంబరు 1 నాటి సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6500గా ఉంది. అంతకుమించి వేతనం పొందుతున్న ఉద్యోగులు దానిపై పీఎఫ్‌ చందా చెల్లించేందుకు చట్టంలోని పేరా  26(6) అనుమతిస్తోంది. అధిక పింఛను కోసం అధిక వేతనంపై పింఛను నిధి (ఈపీఎస్‌)కి ఉద్యోగి తన వాటా జమ చేసేందుకు పేరా 11(3) కింద యజమానితో కలిసి జాయింట్‌ ఆప్షన్‌ ఇవ్వాలి. గతంలో పలు యాజమాన్యాలు ఈపీఎఫ్‌ అధికారులను సంప్రదించినా ఒప్పుకోకపోవడంతో ఈ ఆప్షన్‌ ఇవ్వలేకపోయారు. మరోవైపు సెప్టెంబరు 1 తరువాత అధిక పింఛనులో కొనసాగేందుకు జాయింట్‌ ఆప్షన్‌ ఆరునెలల్లోగా ఇవ్వాలని కోరింది. అప్పటికే పలు యాజమాన్యాల ఆప్షన్‌ను తిరస్కరించడంతో ఉద్యోగులు, యాజమాన్యాలకు అవకాశం లేకుండా పోయింది. ఇదే విషయమై కార్మికులు, ఉద్యోగులు చేసిన అప్పీళ్లకు స్పందించి.. సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 2014 నాటి సవరణకు ముందు అధిక పింఛను కోసం అధిక వేతనంపై ఈపీఎఫ్‌కు చందా చెల్లిస్తున్నవారు ఈపీఎస్‌లో చేరేందుకు మరికొంత సమయమిచ్చింది. 4నెలల్లోగా యజమానితో కలిసి ఉమ్మడిగా ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన తరువాత ఈపీఎఫ్‌ ఖాతాలో నగదును ఈపీఎస్‌లోకి మళ్లించాలని తెలిపింది. ఈపీఎఫ్‌వో తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిలో మెజారిటీ ఉద్యోగులను విస్మరించింది.


తాజా మార్గదర్శకాల్లో ఇలా..

  • 2014 సెప్టెంబరు 1కి ముందు ఉద్యోగ విరమణ చేసి గరిష్ఠ వేతన పరిమితికి మించి వేతనం పొందుతూ చట్టంలోని పేరా 26 (6) ప్రకారం అధిక వేతనంపై పీఎఫ్‌ చందా చెల్లించాలి. దీంతో పాటు పేరా 11 (3) సవరణకు ముందుగా యజమానితో కలిసి సంయుక్త ఆప్షన్‌ ఇవ్వాలి. ఈ ఆప్షన్‌ను పీఎఫ్‌ అధికారులు తిరస్కరించి ఉండాలి. ఈ మూడు అర్హతలు కలిగిన పింఛనుదారులు మాత్రమే అధిక పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లో ప్రత్యేక ఆప్షన్‌ ఇస్తారు.
  • ఆయా పింఛనుదారులు సంబంధిత ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్లకు దరఖాస్తు చేయాలి. అధికంగా చెల్లించే ఈపీఎస్‌ మొత్తాన్ని ఈపీఎఫ్‌ నుంచి బదిలీ లేదా అదనపు డిమాండ్‌ నోటీసును పీఎఫ్‌ కార్యాలయం జారీ చేస్తుంది.
  • దరఖాస్తుతో పాటు పేరా 26 (6)కు సంబంధించి యజమానితో కలిసి ఇచ్చిన జాయింట్‌ ఆప్షన్‌, అధిక పింఛను కోసం 11(3) జాయింట్‌ ఆప్షన్‌, ఉద్యోగి గరిష్ఠ వేతన పరిమితికి మించి పొందుతూ ఆ మేరకు భవిష్యనిధికి, పింఛనునిధికి జమ చేసిన ఆధారాలతో పాటు పీఎఫ్‌ అధికారులు జాయింట్‌ ఆప్షన్‌ తిరస్కరించినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాలి. అప్పుడే ఆ దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని