AP fibernet: అన్న నిర్వహణ కాంట్రాక్టర్‌.. మేనల్లుడు హెచ్‌ఆర్‌ అధికారి

సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు.. మేనల్లుడు హెచ్‌ఆర్‌ విభాగానికి ఇన్‌ఛార్జ్‌. ఇదీ ఏపీ ఫైబర్‌నెట్‌ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డి తీరు. ఆయన సొంత జాగీరులా సంస్థ ఆదాయాన్ని బంధుగణానికి.. కోటరీకి పంచిపెట్టారు.

Published : 08 Jul 2024 08:26 IST

ఏపీ ఫైబర్‌నెట్‌ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డి నిర్వాకం
ఏటా రూ.12 కోట్ల నిర్వహణ కాంట్రాక్టు అన్నకే
అక్రమాలు బయటకు రాకుండా.. ఆధారాల ధ్వంసం
ఈనాడు - అమరావతి 

సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు.. మేనల్లుడు హెచ్‌ఆర్‌ విభాగానికి ఇన్‌ఛార్జ్‌. ఇదీ ఏపీ ఫైబర్‌నెట్‌ మాజీ ఎండీ మధుసూదన్‌రెడ్డి తీరు. ఆయన సొంత జాగీరులా సంస్థ ఆదాయాన్ని బంధుగణానికి.. కోటరీకి పంచిపెట్టారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌లో అక్రమాలు చూస్తే నోరెళ్లబెట్టే పరిస్థితి. 2019లో ఏటా రూ.7.08 కోట్లు ఉన్న సంస్థ జీతాల పద్దును.. ఏకంగా రూ.48 కోట్లకు పెంచేశారు. అవసరం లేకున్నా సిబ్బందిని నియమించి, వారికి జీతాల పేరుతో ఐదేళ్లలో సుమారు రూ.200 కోట్లు పంచిపెట్టారు. సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు ద్వారా ఏటా రూ.12 కోట్ల చొప్పున దోచిపెట్టారు. ఇప్పుడు సంస్థ ప్రధాన కార్యాలయం తలుపులు తెరవకుండానే.. అప్పటి అక్రమాల ఆధారాలను ధ్వంసం చేసేందుకు మాజీ ఎండీ కోటరీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కీలకమైన ఫైనాన్స్, పరిపాలన, హెచ్‌ఆర్‌ విభాగాల పర్యవేక్షణను మధుసూదన్‌రెడ్డి సన్నిహితులకే అప్పగించినట్లు సమాచారం. వారంతా సంస్థలో జరిగిన అక్రమాలను బయటకు వెళ్లకుండా చూసుకుంటున్నారు. కొందరు సిబ్బంది ఫైళ్లను ధ్వంసం చేస్తున్నారన్న సమాచారంతో గత నెల నాలుగో తేదీ నుంచి విజయవాడలోని సంస్థ కార్యాలయాన్ని అధికారులు సీజ్‌ చేశారు. 

ఈ-ఆఫీసు ఇక్కడ పనిచేయదు

సంస్థ ఎండీగా మధుసూదన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. ఈ-ఆఫీసు నిలిపేశారు. ఫైళ్లు మాన్యువల్‌గా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. దాంతో ఇప్పుడు దస్త్రాలను సిబ్బంది ధ్వంసం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై రూ.30లక్షల చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలను కోటరీ ఇప్పటికే ధ్వంసం చేసింది. వాటిలో వ్యక్తిగత చెల్లింపుల దస్త్రాలే ఉన్నాయని సమాచారం. ఎవరికి చెల్లించారనే వివరాలు దొరక్కుండా ఇలా చేశారు. ఫైనాన్స్‌ విభాగంలో ఓచర్‌ మాత్రమే ఉంచి.. బిల్లులు లేకుండా చేశారు. ఇలాంటి వాటిలో మరికొన్ని.. 

  • సంస్థ ఎండీ వాహనంతో పాటు మరో రెండింటికీ బిల్లులు పెట్టి ప్రతినెలా సుమారు రూ.3లక్షల వరకు అదనంగా డ్రా చేసేవారు. ఆ వాహనాలు ఎవరివి?
  • ప్రింటర్లు లేకుండా.. వాటికి క్యాట్రిడ్జ్‌లు కొనుగోలు చేసినట్లు.. నెలకు రూ.1.50 లక్షలు ఖర్చుచూపారని సమాచారం.  
  • ఎన్నికలకు ముందు డ్రోన్‌ కార్పొరేషన్‌ ద్వారా రెండు రోజుల్లో రూ.20 లక్షల చెల్లింపులు చేయించి.. వాటి బిల్లులను చింపేశారని విశ్వసనీయ సమాచారం. 
  • జిల్లాల్లోని కొందరు నెట్‌వర్క్‌ మేనేజర్ల వ్యక్తిగత ఖాతాలకు నగదు జమచేసి.. ఆ మొత్తాన్ని ఆఫీసు పనుల కోసం జమచేసినట్లు గోల్‌మాల్‌ చేశారని తెలిసింది.

ఫైబర్‌నెట్‌.. వైకాపా నియామక సంస్థగా మారిందా?

సంస్థ అవసరం లేకున్నా.. 2022 నుంచి వైకాపాలో ముఖ్యనేతల సిఫారసుతో సిబ్బంది నియామకాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 120 మంది ఫీల్డు సిబ్బందిని మే 30న విధుల నుంచి తప్పించినట్లు జూన్‌ 4న ఉత్తర్వులు ఇచ్చారని తెలిసింది. వారిని విచారిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే ప్రమాదం ఉందని ఇలా చేశారని తెలిసింది. అన్ని కేడర్లతో కలిపి 1,299 మంది సిబ్బంది పనులు చేస్తున్నారు. అందులో శాశ్వత సిబ్బంది ఇద్దరే. మిగిలినవారంతా సిఫార్సులతో వచ్చినవారే. పార్టీ కోసం పనిచేసేవారికి ఉపాధి కల్పించేలా.. ఫీల్డు సిబ్బంది జాబితాలో వారి పేర్లను చేర్చి సంస్థ నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. వారిలో వైఎస్సార్‌ జిల్లావారే అత్యధికం. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కూడా జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ కార్యాలయాల్లో 110 మంది ఫీల్డు సిబ్బందిని గత ప్రభుత్వం నియమించింది. ఈ వ్యవహారం మొత్తం సంస్థలో ఈడీ హోదాలో ఉన్న వ్యక్తి చేస్తున్న ‘జగన్మాయ’గా ఆరోపణలు వినిపిస్తున్నాయి.


సోదరుడికి ఖర్చు లేకుండా..

ఎండీ మధుసూదన్‌రెడ్డి సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టారు. ఫైబర్‌నెట్‌ ప్రసారాలు చేసే వైర్లు తెగినా.. స్తంభాలు విరిగినా వాటిని గుత్తేదారే సరిచేయాలి. కానీ, సంస్థ ఫీల్డు సిబ్బందితో ఈ మరమ్మతులు చేయించినట్లు తెలుస్తోంది. దీంతో సోదరుడికి ఖర్చు లేకుండా లబ్ధి చేకూరిందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని