Andhra News: ‘పెద్దాయన’కు మేలు చేసేలా బొగ్గు గని ఒప్పందం

ఏ ప్రభుత్వ రంగ సంస్థ అధికారైనా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు చూస్తారు. కానీ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఎండీగా మొన్నటి వరకు వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం.. ఓ బొగ్గు గని ప్రాజెక్టు ద్వారా వైకాపా ప్రభుత్వంలో నెంబర్‌ టూగా చక్రం తిప్పిన ‘పెద్దాయన’కు ఎక్కువ ప్రయోజనం దక్కేలా చూశారు.

Published : 07 Jul 2024 06:08 IST

ఏపీఎండీసీ పూర్వపు ఎండీ వెంకటరెడ్డి నిర్వాకం
బ్రహ్మదియా బొగ్గు గని కోసం సంస్థ చేసిన ఖర్చు రూ.235 కోట్లు
టన్నుకు రూ.1,500 బదులు రూ.350 రెవెన్యూ షేర్‌ చాలని అంగీకారం 
ఇలాగే కొనసాగితే ఏపీఎండీసీకి రూ.218.5 కోట్ల నష్టం

ఈనాడు, అమరావతి: ఏ ప్రభుత్వ రంగ సంస్థ అధికారైనా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు చూస్తారు. కానీ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఎండీగా మొన్నటి వరకు వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం.. ఓ బొగ్గు గని ప్రాజెక్టు ద్వారా వైకాపా ప్రభుత్వంలో నెంబర్‌ టూగా చక్రం తిప్పిన ‘పెద్దాయన’కు ఎక్కువ ప్రయోజనం దక్కేలా చూశారు. ఆయన చేసిన ఘనకార్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. 

తక్కువ వాటా చాలంటూ..

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని బ్రహ్మదియా బొగ్గు గని బ్లాక్‌ను గతంలో కేంద్రం నిర్వహించిన వేలంలో ఏపీఎండీసీ దక్కించుకుంది. స్టీల్‌ప్లాంట్‌లో వినియోగించే స్టీల్‌-1 రకం కోకింగ్‌ కోల్‌ ఇక్కడ లభిస్తుంది. ఆ గనిలో 19 లక్షల మిలియన్‌ టన్నుల నిల్వలు ఉన్నట్లు అంచనా వేశారు. మైన్‌ ఆపరేటర్, ప్లానింగ్, ఇంజినీరింగ్, ఫైనాన్సింగ్, కన్‌స్ట్రక్షన్, డెవలప్‌మెంట్, ఆపరేషన్, మెయింటెనెన్స్‌ కోసం 2021లో ఏపీఎండీసీ టెండరు పిలవగా లెకాన్‌-ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్‌ అనే సంస్థలు సంయుక్తంగా బిడ్‌ దక్కించుకున్నాయి. ఇందులో లెకాన్‌ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిది కాగా, అదే ప్రాంతానికి చెందిన ‘పెద్దాయన’ ఆ సంస్థ పేరిట ఈ బిడ్‌ తన వశం చేసుకున్నారు. పేరుకే లెకాన్‌-ఎన్‌సీసీలు గుత్తేదారు అయినప్పటికీ మొత్తం మైన్‌ నిర్వహణ, అభివృద్ధి, తవ్వకాలన్నీ ‘పెద్దాయన’ చేసేలా మాట్లాడుకున్నారు. దీంతో ఆయన చెప్పినట్లే 2021 అక్టోబరులో గుత్తేదారు, ఏపీఎండీసీ మధ్య ఒప్పందాలు జరిగాయి. ఆ గని కోసం భూసేకరణ, పునరావాస పనులకు ఏపీఎండీసీ చేసిన ఖర్చుని.. గుత్తేదారు బొగ్గు తీసినందుకు చెల్లించే సొమ్ము నుంచి రికవరీ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మెట్రిక్‌ టన్నుకు రూ.350 చొప్పున ఫిక్స్‌డ్‌ రెవెన్యూ షేర్‌గా ఏపీఎండీసీకి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ లెక్కన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కేవలం రూ.66.5 కోట్లు మాత్రమే వస్తుంది. అయినా సరే ఎండీ వెంకటరెడ్డి ఇదేమీ పట్టించుకోలేదు.

ఖర్చు పెరిగినా.. వాటా పెంచకుండా?

వాస్తవానికి భూసేకరణ, పునరావాసానికి కలిపి ఏపీఎండీసీ రూ.235 కోట్ల వరకు వెచ్చించింది. ఇదే కాకుండా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు రూ.450 కోట్ల మేర బ్యాంక్‌ గ్యారంటీలు ఇచ్చింది. గుత్తేదారు నుంచి మెట్రిక్‌ టన్నుకు రూ.2 వేల చొప్పున ఫిక్స్‌డ్‌ రెవెన్యూ షేర్‌ తీసుకుంటే గానీ.. ఏపీఎండీసీకి గిట్టుబాటు కాదు. అయినా సరే ఈ విషయాన్ని పట్టించుకోకుండా వెంకటరెడ్డి తీవ్ర నిర్లక్ష్యం చూపారు. సంస్థ నష్టపోయినా.. పెద్దాయనకు లాభం తగ్గకూడదు అనేలా రూ.350 ఫిక్స్‌డ్‌ రెవెన్యూ షేర్‌కే మొగ్గు చూపారు.

చివర్లో కళ్లు తెరిచారు..

బొగ్గు బ్లాక్‌ కోసం ఏపీఎండీసీ చేసిన ఖర్చు అధికంగా ఉండటం, రెవెన్యూ షేర్‌ తక్కువగా ఉండటంపై.. రాబోయే రోజుల్లో ఎవరైనా ప్రశ్నించే అవకాశముందని గుర్తించిన వెంకటరెడ్డి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే కొంతకాలం ముందు అప్రమత్తమయ్యారు. ఫిక్స్‌డ్‌ రెవెన్యూ షేర్‌ రూ.350 నుంచి రూ.1,500కు పెంచాలని కోరుతూ గుత్తేదారుకు లేఖ రాశారు. అంటే 19 లక్షల మెట్రిక్‌ టన్నులకు కలిపి రూ.285 కోట్లు ఏపీఎండీసీకి వస్తుంది. మొదట ఒప్పందం చేసుకున్న ప్రకారం మెట్రిక్‌ టన్నుకు రూ.350 చొప్పునైతే మొత్తం రూ.66.5 కోట్లే వచ్చేది. అంటే రూ.218.5 కోట్లు సంస్థ నష్టపోవాల్సి వచ్చేది. మెట్రిక్‌ టన్నుకు చెల్లించే రెవెన్యూ షేర్‌ రూ.1,500కు పెంచాలన్న లేఖపై మొన్నటి వరకు స్పందించని పెద్దాయన.. కూటమి అధికారంలోకి రావడంతో అప్రమత్తమయ్యారు. ఫిక్స్‌డ్‌ రెవెన్యూ షేర్‌గా రూ.1,500 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ గుత్తేదారు పేరిట గత వారం ఏపీఎండీసీకి లేఖ రాసినట్లు తెలిసింది. మరోవైపు ఒప్పందం చేసుకున్న 18 నెలల్లోగా ఆ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తికి వీలుగా అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. ఒప్పందం గడువు ముగిసినా వెంకటరెడ్డి ప్రశ్నించకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని