Polavaram: ప్రధాన డ్యాం ప్రాంతంలో సీపేజి ఎత్తిపోయాల్సిందే

పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న సీపేజిని పూర్తిగా నిరోధించడం అసాధ్యమని విదేశీ నిపుణుల బృందం తేల్చిచెప్పింది.

Published : 11 Jul 2024 04:42 IST

కొంత గ్రావిటీ ద్వారా పంపాలి.. మిగిలింది ఎత్తిపోయాలి
అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించుకోవాలి
డయాఫ్రం వాల్‌పై నిర్ణయం తుది నివేదికలోనే
పోలవరంపై విదేశీ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక సమర్పణ
ఈనాడు - అమరావతి

పోలవరం స్పిల్‌వేకు ఇరువైపులా గోదారమ్మ ప్రవాహం

పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న సీపేజిని పూర్తిగా నిరోధించడం అసాధ్యమని విదేశీ నిపుణుల బృందం తేల్చిచెప్పింది. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే ఆ నీటిని కొంత గ్రావిటీ ద్వారా బయటకు పంపాలని పేర్కొంది. మిగిలిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయడమే మార్గమని తేల్చిచెప్పింది. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే +17 మీటర్ల కన్నా దిగువకు మాత్రమే సీపేజి నీటిని అనుమతించాలని, అంతకు పైన ఉన్న నీటినంతా బయటకు పంపాల్సిందేనని స్పష్టం చేసింది. విదేశీ నిపుణుల బృందం ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఇందులో కొన్ని సాంకేతిక అంశాలపై స్పష్టత ఇచ్చింది. డయాఫ్రం వాల్‌ గురించి ఇంకా ఎలాంటి అభిప్రాయమూ వెల్లడించలేదు. తుది నివేదికలోనే ఈ అంశంపై తమ అభిప్రాయం వెల్లడిస్తామని విదేశీ నిపుణుల ప్యానెల్‌ పేర్కొంది. డ్యాంల భద్రత, నిర్మాణం, జియో టెక్నికల్‌ అంశాల్లో విశేష అనుభవం ఉన్న డేవిడ్‌ బి.పాల్, రిచర్డ్‌ డోన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, సీస్‌ హించ్‌బెర్గర్‌ అందరూ కలిసి చర్చించుకుని, కొంత అధ్యయనం చేసి తమ ప్రాథమిక నివేదికను అందించారు. కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ ఈ నివేదికను రాష్ట్ర జలవనరులశాఖ అధికారులకు పంపారు. ఆ నివేదిక ఆధారంగా ఎలా ముందుకు వెళ్లనున్నారో, ఆ ప్యానెల్‌ సూచించిన పరీక్షలను ఎలా చేపడతారో తమకు తెలియజేయాలని ఛైర్మన్‌ కోరారు.

ప్రాథమిక నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు...

  • ఎగువ కాఫర్‌ డ్యాం భద్రత, సీపేజి ఈ డ్యాంలో నుంచే జరుగుతోందా లేదా అన్న విషయాలు నిర్ధారించేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని సిఫార్సుచేశారు. ఎగువ కాఫర్‌ డ్యాంలో ఎక్కడెక్కడ బోర్‌హోల్స్‌ ఎలా వేయాలి? పరీక్షలు ఎలా చేయాలో కూడా తెలియజేశారు. కొన్ని గుంతలు జంక్షనులో, మరికొన్ని ఇసుక ఉన్నచోట, మరికొన్ని క్లే కోర్‌ ఉన్నచోట వేసి సీపేజి ఉందా లేదా అన్నది పరీక్షించాలి.
  • కొన్నిచోట్ల ఫిజోమీటర్లు ఏర్పాటుచేయాలని  సూచించారు. వాటి ఆధారంగా సీపేజిని గుర్తించేందుకు వీలుంటుంది.
  • దిగువ కాఫర్‌ డ్యాంలో ఎక్కడెక్కడ ఎంతమేర గుంతలు వేసి పరీక్షలు చేయాలో సిఫార్సు చేశారు. ఈ కట్టడాల నుంచి సీపేజి ఉందని తేలితే తదనుగుణంగా ట్రీట్‌మెంట్‌ ప్రణాళికలు తెలియజేస్తారు. ఈ పరీక్షల నివేదికలు విదేశీ నిపుణులకు పంపాలి.
  • ప్రధాన డ్యాం ప్రాంతంలో 2020 భారీ వరదల వల్ల అగాధాలు ఏర్పడ్డాయి. అక్కడ భూభౌతిక పరిస్థితులు మారిపోయాయి. డ్యాం నిర్మించాలంటే అక్కడ ఆ అగాధాలను పూడ్చి ఇసుకతో నింపి సాంద్రత పెంచాలని ఇప్పటికే తేల్చారు. ఆ పనులు జరుగుతున్నా కొన్నిచోట్ల ఇసుక సాంద్రత పెంచే పనులు చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 20 మీటర్ల లోతు వరకు ఇలా ట్రీట్‌మెంట్‌ చేయాలి. కొన్నిచోట్ల 10 మీటర్ల కన్నా దిగువకు వెళ్లడం సాధ్యం కావడం లేదు. ఆ ప్రాంతాల్లో మల్టీఛానల్‌ ఎనాలసిస్‌ ఆఫ్‌ సిస్మిక్‌ రేస్‌ పరీక్షలు చేయాలని నిపుణుల బృందం సిఫార్సు చేసింది. దీనివల్ల ఆ దిగువన ఉన్న ఇసుక సాంద్రత ఎంతవరకు పెంచగలిగారు, భూ భౌతిక పరిస్థితులు నిర్మాణ పనులకు తగ్గట్టుగా మారాయా లేదా అన్నది తేలుతుంది. ఒకవేళ సాంద్రత పెరగకపోతే ఎక్కడెక్కడ ఇంకా డెన్సిఫై చేయాలో తెలుస్తుంది. అప్పుడు ఎలా ముందుకు వెళ్లాలో పరిష్కారాలు సూచిస్తామని నిపుణుల బృందం పేర్కొంది.

గ్యాప్‌ 1 ప్రధాన డ్యాం పనుల సామర్థ్యంపైనా..

పోలవరం ప్రాజెక్టులో గతంలో గైడ్‌బండ్‌ కుంగిపోయింది. రెండు వేర్వేరు సీజన్లలో పనులు చేయడం వల్ల బంకమట్టి రేణువులు అక్కడి స్టోన్‌ కాలమ్‌లలో చేరి కట్టడం కుంగిందని నిపుణులు తేల్చారు. అదే తరహాలోనే గ్యాప్‌ 1 ప్రధాన డ్యాం నిర్మాణ పనులూ చేపట్టారు. కొంతమేర ఆ పనులు జరిగాయి. ఈ నేపథ్యంలో గ్యాప్‌ 1 ప్రధాన డ్యాంలో స్టోన్‌ కాలమ్‌ల నిర్మాణ పటిష్ఠత తేల్చేందుకు పరీక్షలు చేయాలని సిఫార్సు చేశారు. ఆ స్టోన్‌ కాలమ్‌లలోకి రంధ్రాలు చేసి నీటిని పంపాలన్నారు. అలా పర్మిబులిటీ పరీక్షలు నిర్వహించాలని సిఫార్సు చేశారు. అక్కడ ఎంత నష్టం జరిగిందన్న అంశాల ఆధారంగా వాటి సామర్థ్యాన్ని తేల్చి చెప్పవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలు చేసి ఫలితాలను నిపుణుల బృందానికి పంపాలి.

  • ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతంలో కొంతమేర బంకమట్టి నేలలు ఉన్నాయి. ఇక్కడ వరదల వల్ల ఎప్పటికప్పుడు కొత్త మట్టిపొరలు ఏర్పడుతుంటాయి. ఆ ప్రాంతంలో ప్రతి పొరనూ విశ్లేషించేలా కొన్ని సిఫార్సులు చేశారు. బంకమట్టి నేలపొరల మధ్య ఇసుక పొరలు ఉన్నాయా అన్నది పరీక్షించాలని సిఫార్సు చేశారు.
  • ప్రధాన రాతి, మట్టి డ్యాం పనులకు సంబంధించి తుది నివేదికలోనే వారి అభిప్రాయాలు వెల్లడించనున్నారు.

క్రమంగా పెరుగుతున్న వరద

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద బుధవారం సాయంత్రానికి నీటి మట్టం 26.77 మీటర్లకు పెరిగింది. 48 గేట్ల నుంచి 55 వేల క్యూసెక్కులు దిగువకు వెళుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నెమ్మదిగా వరద పెరుగుతున్నట్లు జలవనరులశాఖాధికారులు తెలిపారు.  

న్యూస్‌టుడే, పోలవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని