Nellore: నెల్లూరు మేయర్‌ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో వైకాపా నేతలకు ఉచ్చు బిగుస్తోంది.

Updated : 07 Jul 2024 08:56 IST

విచారణలో వెల్లడించిన నెల్లూరు నగరపాలక సంస్థ సిబ్బంది
సమగ్ర దర్యాప్తు కోరుతూ ఎస్పీకి కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ లేఖ

ఈనాడు, నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో వైకాపా నేతలకు ఉచ్చు బిగుస్తోంది. నగరంలోని సుమారు 70 భవనాలకు చెందిన తనఖా ఆస్తులను  ఫోర్జరీ సంతకాలతో విడుదల చేసి, రూ. కోట్లు దండుకున్న కుంభకోణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు చూసింది. దీనికి సంబంధించి ఇప్పటికే నలుగురు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను సస్పెండ్‌ చేసిన కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌.. సమగ్ర విచారణ కోరుతూ తాజాగా నెల్లూరు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు. అందులో ప్రధాన సూత్రధారిగా మేయర్‌ స్రవంతి భర్త జయవర్ధన్, ఆయన సహాయకుడు జి.శివకృష్ణలతో పాటు.. భాగస్వాములైన పట్టణ ప్రణాళిక అధికారుల పేర్లను పేర్కొన్నారు. దీంతో వైకాపా వర్గాల్లో కలకలం మొదలైంది. ఈ కుంభకోణం బయటపడ్డ తరువాత మేయర్‌ స్రవంతి, ఆమె భర్త వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

70 భవనాల తనఖా ఆస్తుల విడుదల

‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ మేయర్‌ స్రవంతి భర్త జయవర్ధన్, పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన పలువురు ఉద్యోగులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించారు. పురపాలక చట్టం పేర్కొన్న నిబంధనల ప్రకారం భవన నిర్మాణం జరపకపోతే వాటి యజమానులు కార్పొరేషన్‌కు మార్టిగేజ్‌ చేసిన ఆస్తిని విడుదల చేయరు. కానీ.. నెల్లూరులో నిబంధనల ప్రకారం కట్టని సుమారు 70 భవనాల తనఖా ఆస్తులను విడుదల చేసేశారు. అందుకోసం కమిషనర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ వ్యవహారంలో రూ. కోట్లు దోచుకున్నారు’ అని నెల్లూరు ములుమూడికి చెందిన న్యాయవాది కాకు మురళీ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

ఆయన ప్రోద్బలంతోనే

కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన కాకు మురళీ.. పలు భవనాల డాక్యుమెంట్లను ఆధారాలుగా సమర్పించారు. వాటిని పరిశీలించిన కమిషనర్‌ సంబంధిత అధికారులకు షోకాజ్‌ నోటీసులిచ్చారు. వాటికి స్పందించిన పలువురు ఉద్యోగులు... మేయర్‌ భర్త జయవర్ధన్, ఆయన అనుచరుడు జి.శివకృష్ణ తమను మేయర్‌ ఛాంబర్‌కు పిలిచి, కమిషనర్‌ సంతకం చేసిన పత్రాలిచ్చి, మార్టిగేజ్‌ విడుదల చేయాలని చెప్పడంతో చేసినట్లు వివరణ ఇచ్చారు. దీంతో టీపీఓలు ఎం.దేవేంద్ర, బి.ప్రవీణ్, డబ్ల్యూపీఆర్‌ఎస్‌లు పి.నాగేంద్ర, కె.కార్తీక్‌ మాలవ్యలను సస్పెండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల వివరణలు, మేయర్‌ భర్త జయవర్ధన్‌ పాత్రను పేర్కొంటూ.. సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ ఎస్పీకి లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని