Andhra News: ఖర్చులిస్తే చాలు.. ఇసుక ఉచితం

గత ప్రభుత్వంలో ప్రజల్ని నానాయాతనలు పెట్టి, వైకాపా పెద్దలు కోట్లాది రూపాయలు దోపిడీ చేసేలా అమలు చేసిన 2019, 2021 ఇసుక విధానాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించింది. వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం-2024 అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Updated : 09 Jul 2024 07:16 IST

సీనరేజ్, నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు 
నగదు లావాదేవీలు ఉండవు.. డిజిటల్‌ చెల్లింపులే 
2019, 2021 ఇసుక విధానాల ఉపసంహరణ 
త్వరలో కొత్త విధానం  
అప్పటి వరకు నిల్వ కేంద్రాల్లోనిది అందజేత 
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
మొదలైన ఇసుక సరఫరా 
ఈనాడు - అమరావతి 

ఎన్టీఆర్‌ జిల్లా కీసర స్టాక్‌ యార్డు వద్ద సోమవారం ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తెదేపా నాయకులు, అధికారులు 

త ప్రభుత్వంలో ప్రజల్ని నానాయాతనలు పెట్టి, వైకాపా పెద్దలు కోట్లాది రూపాయలు దోపిడీ చేసేలా అమలు చేసిన 2019, 2021 ఇసుక విధానాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించింది. వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం-2024 అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక, పూడిక రూపంలో జలాశయాల్లో ఉన్నది ప్రజలకు సరఫరా చేసేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వానికి ఎటువంటి రాబడి లేకుండా కేవలం సీనరేజ్‌ ఛార్జి, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకొని, ఇసుక అందజేయాలని పేర్కొంది. ఇందుకు కలెక్టర్‌ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించింది. కేవలం డిజిటల్‌ చెల్లింపులను మాత్రమే తీసుకుంటూ, ఏ రోజుకు ఆ రోజు ఇసుక నిల్వల వివరాలు వెల్లడిస్తూ పారదర్శక విధానం అమలు చేసేలా ఆదేశాలిచ్చింది. ఇసుక ధరను ఎలా ఖరారు చేయాలి? పర్యవేక్షణ, నిఘా ఎవరు చూడాలి? అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వారిపై ఏం చర్యలు తీసుకోవాలి.. తదితరాలన్నింటిపై మార్గదర్శకాలతో గనులశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఉత్తర్వు జారీ చేశారు.

ఉపాధికి ఇసుక కీలకం

‘ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆధారపడి ఉన్న నిర్మాణ రంగానికి ఇసుక ప్రధానమైనది. ఇసుక ధరలను నియంత్రణలో ఉంచకపోతే సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్రప్రభావం చూపిస్తుంది. దీనివల్ల రాష్ట్రంలో నిరుద్యోగం పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, పెట్టుబడులపై ప్రభావం, పారిశ్రామికీకరణకు విఘాతం కలుగుతుంది. నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుకను ప్రజాప్రయోజనాల దృష్ట్యా వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటివల్ల రాష్ట్రమంతటా భవన నిర్మాణాలు, నీటిపారుదల పనులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, రాజధాని భవనాలు తదితరాల నిర్మాణాలకు సరసమైన ధరల్లో ఇసుక అందుబాటులోకి వస్తుంది’ అని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

జిల్లా ఇసుక కమిటీలే కీలకం

ఇసుక లావాదేవీల్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. వీటికి కలెక్టర్‌ ఛైర్మన్‌గా, ఎస్పీ, జేసీ, సబ్‌కలెక్టర్‌/ఆర్డీవో, ఎస్‌ఈబీ జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్టీవో, భూగర్భజలశాఖ డీడీ, జలవనరులశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, కాలుష్యనియంత్రణ మండలి ఈఈలు సభ్యులుగా, జిల్లా గనులశాఖ అధికారి కన్వీనర్‌గా ఉంటారు.

 • ప్రభుత్వ ఉత్తర్వుతో ఇప్పటి వరకు ఉన్న గుత్తేదారు సంస్థలు జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రాలను తొలగించారు. అవి నిల్వ కేంద్రాల్లో డంప్‌ చేసిన ఇసుకను జిల్లా కమిటీలు స్వాధీనం చేసుకోవాలి.
 • నిల్వ కేంద్రాలకు ఇన్‌ఛార్జులుగా వీఆర్వో, వీఏవో, గ్రామ, వార్డు సచివాలయ అధికారుల్లో ఎవరినైనా కలెక్టర్‌ నియమిస్తారు.  
 • నిల్వ కేంద్రంలో ఇసుక లోడింగ్, ర్యాంప్‌ నిర్వహణకు, సెక్యూరిటీ తదితరాల కోసం ఏదైనా పొరుగుసేవల సంస్థ (మ్యాన్‌పవర్‌ ఏజెన్సీ)ని నియమించుకోవాలి.
 • ఇసుక తవ్వి, రీచ్‌ నుంచి నిల్వ కేంద్రానికి రవాణా చేసినందుకు అయిన నిర్వహణ ఖర్చు, స్టేషనరీ వ్యయం, సీనరేజ్‌ ఫీజు, జీఎస్టీ మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుంటారు.
 • ప్రభుత్వ ఖజానాకు రాబడి తీసుకోరు.
 • నిర్వహణ ఖర్చులు, ఫీజులు కలిపి ఆయా నిల్వ కేంద్రాల్లో టన్ను ఇసుక ధర ఎంతనేది జిల్లా స్థాయి కమిటీ ఖరారు చేస్తుంది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు లోడింగ్‌

 • నిల్వ కేంద్రాల్లో ఎంత ఇసుక ఉంది, ధర ఎంత అనేది గనులశాఖ వెబ్‌సైట్‌ www.mines.ap.gov.in లో అందుబాటులో ఉంచాలి.
 • ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిల్వకేంద్రాలు పనిచేస్తాయి.
 • ఏ రోజు ఎంత ఇసుక విక్రయాలు జరిగాయి? ఇంకా ఎంత నిల్వ ఉందో రాత్రి 8 గంటలకు గనుల శాఖ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.
 • నిల్వ కేంద్రంలో ఇసుక కొనుగోలుదారుల ఆధార్, సెల్‌ నంబరు, ఇంటి చిరునామా, రవాణా వాహనం నంబరు నమోదు చేస్తారు.
 • ఒకరికి రోజుకు 20 టన్నుల ఇసుక తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది.
 • ఖరారు చేసిన ఇసుక ధరను డిజిటల్‌ రూపంలో తీసుకుంటారు. ముందు వచ్చినవారికే ముందు లోడ్‌ చేస్తారు.
 • నిల్వ కేంద్రం నుంచి వినియోగదారుల ఇంటికి  ఇసుక రవాణా చేసే వాహనాలు గనులశాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఇలా రిజిస్టరయిన   వాహనాల ద్వారా వినియోగదారులు ఇసుక తీసుకెళ్లొచ్చు. మున్ముందు ఈ వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరి.
 • లారీ సామర్థ్యం, దూరం బట్టి వినియోగదారుల నుంచి ఎంత ఛార్జీ తీసుకోవాలి అనేది జిల్లా కమిటీ ప్రకటిస్తుంది. నిల్వ కేంద్రం నుంచి ఇసుక తరలించినందుకు అయ్యే ఖర్చును వినియోగదారులే భరించాలి.
 • నిల్వ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. జీపీఎస్‌ అమర్చిన లారీలు ఎక్కడికి వెళ్తున్నాయనేది ట్రాక్‌ చేయాలి. ఇందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు,  రాష్ట్ర స్థాయిలో గనులశాఖ సంచాలకులు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి.  

అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు

 • ప్రతి జిల్లాలో కలెక్టర్, జిల్లా గనులశాఖ అధికారి పేరిట సంయుక్త బ్యాంక్‌ ఖాతా తెరుస్తారు. ఇసుక లావాదేవీలన్నీ దీని ద్వారానే జరుగుతాయి. నిర్వహణ ఖర్చులు, రీచ్‌లకు అనుమతుల కోసం కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాల్సిన ఫీజులు, మ్యాన్‌పవర్‌ ఏజెన్సీకి చెల్లింపులు వంటి ఖర్చులకు మాత్రమే ఈ ఖాతా నుంచి చెల్లించాలి. 
 • నిర్మాణ అవసరాలకు మించి ఇసుక నిల్వ చేసినా, తిరిగి అమ్మినా (రీసేల్‌), ఇతర అవసరాలకు వినియోగించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా క్రిమినల్‌ కేసులు పెడతారు. జరిమానాలు విధిస్తారు.
 • ఇసుక అక్రమంగా రవాణా చేస్తే రూ.2 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.

లాంఛనంగా విక్రయాలు ప్రారంభం

రాష్ట్రంలో ఇసుక విక్రయాలు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు విక్రయాలను ఆరంభించారు. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో విక్రయాలు ప్రారంభమవుతాయని గనులశాఖ వర్గాలు తెలిపాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇసుక నిల్వల వివరాలను ఆ శాఖ వెబ్‌సైట్‌లో సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. 21 జిల్లాల్లోని 88 నిల్వ కేంద్రాల్లో ఇసుక ఉన్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఏ నిల్వ కేంద్రంలో మెట్రిక్‌ టన్ను ధర ఎంత.. అనే వివరాలను కూడా పొందుపర్చారు. 


స్పీకర్‌ ఆదేశాలతో ఇసుక దొంగలపై విచారణ

గబ్బాడ ఇసుక యార్డు వద్ద ఎస్‌ఈబీ అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రావడంతో యార్డులో ఉన్న నిల్వలను విక్రయించడం ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని గబ్బాడ యార్డులో 48,204 టన్నుల ఇసుక నిల్వ ఉందని, దీనిని సోమవారం నుంచి విక్రయిస్తామని అధికారులు తొలుత ప్రకటించారు. అయితే ఇక్కడ 65 వేల టన్నుల ఇసుక మాయం చేశారని, ముందు ఆ దొంగను పట్టుకోవాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు, ఎస్‌ఈబీ సిబ్బంది పరిశీలించి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ విక్రయాలు ప్రారంభం కాలేదు.      

న్యూస్‌టుడే, నర్సీపట్నం గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని