Andhra News: నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధుల గోల్‌మాల్‌

విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి కల్పించాల్సిన నైపుణ్యాభివృద్ధి సంస్థను వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్రంగా మార్చేశారు.

Published : 07 Jul 2024 05:04 IST

31 మంది బినామీ ఉద్యోగుల జీతాలు స్వాహా
వైకాపా హయాంలో ఓ సలహాదారు పాత్ర
సీమెన్స్‌ నిధులు కాజేసిన అధికారిణి
విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి

ఈనాడు, అమరావతి: విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి కల్పించాల్సిన నైపుణ్యాభివృద్ధి సంస్థను వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్రంగా మార్చేశారు. ఆ పార్టీ సామాజిక మాధ్యమాల కార్యకలాపాలకు ఈ సంస్థ భవనాన్ని వాడుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 మంది బినామీ ఉద్యోగులను నియమించుకొని, ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన ఓ వ్యక్తి ప్రతినెలా జీతాల పేరుతో డబ్బులు కాజేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారి చిరునామాలు ఇచ్చి, నకిలీ బ్యాంకుఖాతాలతో అక్రమాలకు పాల్పడ్డారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో సీమెన్స్‌ ప్రాజెక్టు శిక్షణ నిధులు రూ.30 లక్షల వరకు ఓ మహిళా అధికారి నొక్కేసిన విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పనిచేసిన అజయ్‌రెడ్డి వచ్చీరాగానే 2019కి ముందు చేరిన ఉద్యోగులకు జీతాలివ్వకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో దాదాపు 50మంది అప్పట్లో రాజీనామా చేశారు. కొత్తగా 250 మందిని విద్యార్హతలతో సంబంధం లేకుండా సిఫార్సుల ఆధారంగా నియమించి, రూ.లక్షల్లో జీతాలు చెల్లించారు. వీటన్నింటిపై విచారణ చేయిస్తే, అక్రమాలు బయటపడే ఆస్కారముంది.

ఇప్పటికీ రూ.లక్షల్లో జీతాలు

సీఎం జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డి సిఫార్సుతో ఉద్యోగంలో చేరిన భారతీరెడ్డిని ఏకంగా జనరల్‌ మేనేజర్‌గా నియమించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కోటిరెడ్డి ఇక్కడికి డిప్యుటేషన్‌పై వచ్చి ఈడీగా పనిచేసిన కాలంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారు. స్కిల్‌ హబ్స్, కళాశాలలకు అవసరమైన సామగ్రి కొనుగోళ్లలో భారీగా కమీషన్లు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కోటిరెడ్డి, భారతీరెడ్డి బృందం కలిసి శిక్షణ కేంద్రంలో కుర్చీలు, ప్రొజెక్టర్‌ సహా ఇతర    సదుపాయాలకు అధిక ధరలు నిర్ణయించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు విమర్శలున్నాయి. పాత ఫర్నిచర్‌కు కొత్తవాటిగా బిల్లులు పెట్టించినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కోటిరెడ్డి ఏపీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ సీఈఓగా కొనసాగుతున్నారు. వైకాపా సామాజిక మాధ్యమం, సర్వేల్లో పనిచేసిన దినేశ్‌రెడ్డిని తిరుపతిలో కొనసాగిస్తున్నారు. వీరికి రూ.లక్షల్లో జీతాలు   చెల్లిస్తున్నారు.

శిక్షణ నిధులు పక్కదారి 

సీమెన్స్‌ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబును అరెస్టు చేసిన జగన్‌ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు శిక్షణ నిధులను ఓ అధికారిణి నొక్కేసిన విషయం బయటపడింది. జగన్‌ వద్ద పనిచేసిన ఓ వ్యక్తి సిఫార్సుతో నైపుణ్యాభివృద్ధి సంస్థలో చేరిన ఆమె.. అక్కడ తన హవా కొనసాగించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీమెన్స్‌ ఒప్పందం ప్రకారం శిక్షణకు హాజరయ్యే విద్యార్థుల నుంచి నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు. కేంద్రం నిర్వహణ కోసం సంబంధిత కళాశాలకు 80%, శిక్షణ, ఇతర ఖర్చులకు 20% నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఇవ్వాలి. కానీ, 100% నిధులను ఈ అధికారిణి తన సొంత ఖాతాకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి.

ఎండీ కొనసాగింపుపైనే..

నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రస్తుత ఎండీ రాజాబాబు గత ప్రభుత్వంలో విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్‌గా వ్యవహరించినప్పుడు వైకాపాతో అంటకాగినట్లు ఆరోపణలున్నాయి. రామానాయుడు స్టూడియో లే అవుట్‌కు అనుమతులు ఇవ్వడంతో పాటు సీబీఏసీఎన్‌సీ మిషనరీ స్థలాల్లో వివాదాస్పద ఎంవీవీ ప్రాజెక్టుకు ఆఘమేఘాలపై ప్లాన్‌కు అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నప్పుడు ఓటరు జాబితాలో తప్పులకు బాధ్యుడిగా ఎన్నికల సంఘం ఆయన్ను బదిలీ చేసింది. ఈ అభియోగాలున్న రాజబాబును నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా కొనసాగిస్తుండడంతో వైకాపా హయాంలో నియమితులైన ఉద్యోగులు ఇష్టారాజ్యంగా  వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని