Andhra News: అమ్మా లేదు.. అమ్మఒడీ రాలేదు

‘మాకు అమ్మ లేదు.. ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడి కూడా రావడం లేదు’ అని ఇద్దరు చిన్నారులు చెప్పడంతో మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చలించిపోయారు. ఈ సంఘటన శ్రీకాకుళం

Updated : 18 Jun 2022 08:09 IST

గడపగడపకు కార్యక్రమంలో మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు చిన్నారుల వినతి

నరసన్నపేట, న్యూస్‌టుడే: ‘మాకు అమ్మ లేదు.. ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడి కూడా రావడం లేదు’ అని ఇద్దరు చిన్నారులు చెప్పడంతో మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చలించిపోయారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట హడ్కో కాలనీలో శుక్రవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చోటుచేసుకుంది. చిన్నాల తరుణ్‌, తేజ అన్నదమ్ములు. వీరి తల్లిదండ్రులు చనిపోయారు. ప్రస్తుతం వీరు అమ్మమ్మ బాలమ్మ, తాత చల్ల నర్సింహులు సంరక్షణలో పెరుగుతున్నారు. అయిదో తరగతి చదువుతున్న తరుణ్‌కు, మూడో తరగతి చదువుతున్న తేజకు అమ్మఒడి పథకం వర్తించడం లేదు. ఎందుకని అడిగితే.. సాంకేతిక కారణాల వల్ల రావట్లేదని అధికారులు చెబుతున్నారని చిన్నారులు కృష్ణదాస్‌ ఎదుట వాపోయారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. సుమారు ఆరు నెలల క్రితం తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత.. సంరక్షకులుగా అమ్మమ్మ, తాతలను రికార్డుల్లో చేర్చలేదని, అందుకే వీరికి అమ్మఒడి సాయం అందలేదని తెలిసింది. వెంటనే ఆ ప్రక్రియ పూర్తిచేసి వారికి లబ్ధి అందిస్తామని అధికారులు చెప్పారు. ఇదే కాలనీలో సింహాద్రి కిరణ్‌ తను అంగవైకల్యంతో బాధపడుతున్నానని, కుటుంబ పోషణ భారంగా మారిందని, తాను వికలాంగ పింఛను కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా రాలేదని విలపించాడు. తనకు సదరం ధ్రువపత్రం ఇవ్వట్లేదని వాపోగా.. సమస్యను పరిష్కరించాలని అధికారులను ధర్మాన ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని