gas cylinder price:బండ బాదుడు!

పెట్రోలు, డీజిల్‌ ధరలు మళ్లీ పరుగు తీస్తున్నాయి. వాటితో వంట గ్యాస్‌ కూడా పోటీపడుతోంది. లీటరు పెట్రోలు రూ.110, డీజిల్‌ రూ.101 దాటేశాయి. లీటరు పెట్రోలుపై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున బుధవారం పెరిగింది. గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర మరో రూ.15 పెరిగి రూ.922 అయింది. ఈ ఏడాది జులైలో రూ.25.50 పెంచారు. ఆగస్టు 17, సెప్టెంబరు 1 తేదీల్లో రూ.25 చొప్పున పెరిగింది. పదేళ్లలో ఇంధన వాడకం, కేంద్రానికి వచ్చే ఆదాయం రెట్టింపు అయ్యాయి.

Updated : 07 Oct 2021 05:19 IST

గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.15 పెంపు
లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్‌ రూ.100 పైమాటే
పదేళ్లలో రెట్టింపైన ఇంధన వినియోగం, ప్రభుత్వాల ఆదాయం
ఈనాడు - అమరావతి

పెట్రోలు, డీజిల్‌ ధరలు మళ్లీ పరుగు తీస్తున్నాయి. వాటితో వంట గ్యాస్‌ కూడా పోటీపడుతోంది. లీటరు పెట్రోలు రూ.110, డీజిల్‌ రూ.101 దాటేశాయి. లీటరు పెట్రోలుపై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున బుధవారం పెరిగింది. గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర మరో రూ.15 పెరిగి రూ.922 అయింది. ఈ ఏడాది జులైలో రూ.25.50 పెంచారు. ఆగస్టు 17, సెప్టెంబరు 1 తేదీల్లో రూ.25 చొప్పున పెరిగింది. పదేళ్లలో ఇంధన వాడకం, కేంద్రానికి వచ్చే ఆదాయం రెట్టింపు అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈసారి తొలి త్రైమాసికంలోనే (ప్రొవిజనల్‌) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నిరకాల పెట్రో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా రూ.1.52 లక్షల కోట్లు సమకూరాయి. ఇందులో పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రూ.72,361 కోట్లు, రాష్ట్రాలకు అమ్మకపు పన్నుల రూపంలో రూ.55,974 కోట్లు వచ్చాయి. అయినా పన్నుల తగ్గింపు బాధ్యత మీదంటే మీదంటూ కేంద్ర, రాష్ట్రాలు తప్పించుకుంటున్నాయి.

గృహవినియోగ గ్యాస్‌ సిలిండర్‌పై తొమ్మిది నెలల్లోనే రూ.206 పెంచారు. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో సిలిండర్‌ ధర రూ.716 ఉండగా.. అక్టోబరులో రూ.922 అయింది. గతేడాది నవంబరుతో పోలిస్తే.. రూ.300 వరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1.43 కోట్ల గృహ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో నెలకు 1.15 కోట్ల మంది సిలిండర్లు తీసుకుంటున్నారు. ఈ ఏడాదిలో పెంచిన రూ.200 లెక్కన చూస్తే.. నెలకు రూ.230 కోట్ల మేర వినియోగదారులపై భారం పడుతోంది.

ప్రతి నెలా వంటగ్యాస్‌ ధరల్ని పెంచుతున్న కేంద్రం.. రాయితీకి దాదాపుగా మంగళం పాడేసింది. గతంలో సిలిండర్‌పై రూ.300 వరకు ఇవ్వగా.. ఇప్పుడు నామమాత్రంగానే అందుతోంది.

వాణిజ్య సిలిండర్‌ (19 కిలోలు) ధర కూడా రూ.32 పెరిగింది. గత నెలలో రూ.1,814 ఉన్న సిలిండర్‌ రేటు.. అక్టోబరులో రూ.1,846 అయింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో రూ.1,891 వరకు ఉంది.

రోజువారీ పెట్రో బాదుడు

పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల రోజువారీ వ్యవహారంగా తయారైంది. జులై వరకు పగ్గాల్లేకుండా పెరిగిన ధరలు.. కొంతకాలం ఆగాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కొద్ది రోజులుగా పరుగు మళ్లీ మొదలైంది. వరసగా పదో రోజు డీజిల్‌, ఏడో రోజు పెట్రోలు ధరలు పెరిగాయి. దీంతో విజయవాడలో లీటరు పెట్రోలు రూ.108.54, డీజిల్‌ రూ.100.98 అయ్యాయి.

రాష్ట్రంలో విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, కడప మినహా.. మిగిలిన అన్ని జిల్లా కేంద్రాల్లో లీటరు పెట్రోలు రూ.109, డీజిల్‌ రూ.101పైనే ఉన్నాయి. చిత్తూరులో పెట్రోలు రూ.110, డీజిల్‌ రూ.102 దాటాయి.

శ్రీశైలంలో లీటరు పెట్రోలు రూ.110.07, డీజిల్‌ రూ.102.09 ఉండగా.. తిరుపతిలో పెట్రోలు రూ.109.43, డీజిల్‌ రూ.101.48 చొప్పున విక్రయిస్తున్నారు.

రెట్టింపైన రాబడి.. బాదుడు ఆపని కేంద్రం

దశాబ్దకాలంలో ఇంధన వినియోగం రెట్టింపు అయింది. ఏడేళ్లలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయమూ 164% పెరిగింది. అయినా పన్నులు తగ్గట్లేదు. అన్నిరకాల పెట్రో ఉత్పత్తులపై వివిధ రకాల పన్నుల రూపంలో కేంద్రానికి 2014-15 సంవత్సరంలో రూ.1.72 లక్షల కోట్ల ఆదాయం లభించగా.. గత ఆర్థిక సంవత్సరం నాటికి రూ.6.71 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో రూ.89,652 కోట్ల ఆదాయం వచ్చింది.

దశాబ్దకాలంలో ఇంధన వాడకం దాదాపు రెట్టింపైంది. కొవిడ్‌ కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో కొంత తగ్గినా.. ఈ ఏడాది మళ్లీ పెరిగింది. 2019-20 ఆగస్టులో దేశవ్యాప్తంగా 25,75,000 టన్నుల పెట్రోలు వినియోగించగా.. ఈ ఏడాది ఆగస్టులో 26,91,000 టన్నులకు పెరిగింది.

2018 అక్టోబరులో లీటరు పెట్రోలుపై రూ.17.98, డీజిల్‌పై రూ.13.83 చొప్పున పన్నులు వసూలు చేయగా.. గతేడాది ఫిబ్రవరి నుంచి పెట్రోలుపై రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 చొప్పున పిండుకుంటున్నారు.
పెట్రోలుపై పన్నులు తగ్గించిన తమిళనాడు.. ఏపీ కంటే లీటరుకు రూ.10 తక్కువ ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం.. పెట్రోలుపై పన్నులను తగ్గించింది. గతంలో 15% అమ్మకపు పన్ను+ లీటరుకు రూ.13.02 చొప్పున ఉండగా.. దీన్ని 13% అమ్మకపు పన్ను+ లీటరుకు రూ.11.52 చేసింది. ఈ రాష్ట్రానికి పన్నుల ద్వారా ఏడాదికి (2018-19లో) రూ.14,421 కోట్ల ఆదాయం వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే.. పక్కనే ఉన్న తమిళనాడులో పెట్రోలు ధరలు లీటరుకు రూ.10 వరకు తక్కువగా ఉన్నాయి. కుప్పంలో అత్యధికంగా లీటరు పెట్రోలు ధర రూ.111.48, డీజిల్‌ రూ.103.33 ఉంది. పక్కనే ఉన్న తమిళనాడు పరిధిలోని ప్రాంతంలో లీటరు పెట్రోలు రూ.101.56, డీజిల్‌ రూ.96.98 ఉంది.


రాష్ట్రానికి 3 నెలల్లో రూ.3,420 కోట్లు

క్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లోనే అమ్మకపు పన్ను ఎక్కువ. అదనపు వ్యాట్‌, రోడ్డు అభివృద్ధి సుంకం ద్వారా లీటరు పెట్రోలుపై రూ.29, డీజిల్‌ ద్వారా రూ.22పైగా రాష్ట్ర ఖజానాకు వస్తోంది. గతేడాది రూ.11,014 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో పెట్రోలు, డీజిల్‌పై అమ్మకపు పన్ను ద్వారా రూ.3,420 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.43 కోట్ల ఆదాయం వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని