ED: జగన్‌పై మరో కేసు

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో మరొకటి చేరింది. 11 సీబీఐ, 6 ఈడీ కేసులకు అదనంగా మరో ఈడీ కేసు నమోదు కావడంతో... కేసుల సంఖ్య 18కి పెరిగింది. ఉమ్మడి రాష్ట్ర ఏపీ హౌసింగ్‌ బోర్డు, ఇందూ

Updated : 21 Dec 2022 15:26 IST

 ఇందూ హౌసింగ్‌ బోర్డు అక్రమాలపై ఈడీ అభియోగపత్రం
 నిందితుల్లో వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌తో సహా 11 మంది
 విజయసాయిరెడ్డి పేరు తొలగింపు

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో మరొకటి చేరింది. 11 సీబీఐ, 6 ఈడీ కేసులకు అదనంగా మరో ఈడీ కేసు నమోదు కావడంతో... కేసుల సంఖ్య 18కి పెరిగింది. ఉమ్మడి రాష్ట్ర ఏపీ హౌసింగ్‌ బోర్డు, ఇందూ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టిన హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గత ఏడాది దాఖలు చేసిన అభియోగ పత్రంపై ఇటీవల ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. గత ఏడాది ఈడీ అభియోగ పత్రం దాఖలు చేసినప్పటికీ అందులో లోపాలు ఉండటంతో కోర్టు పలుమార్లు వెనక్కి పంపింది. సమగ్ర వివరాలతో ఈడీ దాఖలు చేసిన అభియోగ పత్రంపై ఏప్రిల్‌ 23న విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం మరోసారి విచారణకు రాగా జూన్‌ 30కి వాయిదా పడింది. ఈ కేసులో 11 మందిని (వ్యక్తులు/సంస్థలు) నిందితులుగా పేర్కొంది. నిందితుల జాబితాలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డి, జితేంద్ర మోహన్‌దాస్‌ వీర్వాణి, వై.వి.సుబ్బారెడ్డి, ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే వి.వి.కృష్ణప్రసాద్‌, ఇందూ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, చిడ్కో (సైబర్‌ హైటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌), ఇందూ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇందూ రాయల్‌ హోమ్స్‌, వసంత ప్రాజెక్ట్స్‌, ఎంబసీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లను చేర్చింది. నిందితులపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 4, 3 కింద ఫిర్యాదు దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణ జూన్‌ 30న జరగనుంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే రూ.117 కోట్ల ఆస్తులను జప్తు చేసిన విషయం విదితమే.
జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో నమోదైన కేసుల్లో మొదటిసారి విజయసాయిరెడ్డి పేరు కనిపించలేదు. సీబీఐ కేసులు 11, ఈడీ ఇప్పటిదాకా దాఖలు చేసిన 6 అభియోగ పత్రాలతో సహా మొత్తం 17 కేసుల్లోనూ రెండో నిందితుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ఉంది. హౌసింగ్‌ బోర్డు అక్రమాలపై దాఖలు చేసిన అభియోగ పత్రంలోనూ రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పేరును ఈడీ తన ఫిర్యాదులో తొలగించింది. విజయసాయిరెడ్డితో పాటు సీబీఐ కేసులో నిందితుల జాబితాలో ఉన్న జగన్‌కు చెందిన కార్మెల్‌ ఏసియా లిమిటెడ్‌ను, ఐఏఎస్‌ అధికారి ఎస్‌.ఎన్‌.మొహంతిని కూడా నిందితుల జాబితా నుంచి ఈడీ తొలగించింది.
కేసు నేపథ్యం ఇదీ
గృహనిర్మాణ మండలి నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, గచ్చిబౌలి, బండ్లగూడ, కర్నూలు జిల్లా నంద్యాలలో హౌసింగ్‌ ప్రాజెక్టులను ఇందూ గ్రూపు అక్రమంగా పొందిందని సీబీఐ పేర్కొంది. కూకట్‌పల్లిలో 65, బండ్లగూడలో 50, గచ్చిబౌలిలో 21 ఎకరాలను, నంద్యాల మూలసాగరంలో 75 ఎకరాలను మార్కెట్‌ ధరకంటే చౌకగా హౌసింగ్‌ బోర్డు కేటాయించింది. గృహనిర్మాణ మండలి ప్రాజెక్టులను పొందడానికి స్నేహితుల కంపెనీల సాయంతో ఇందూ కంపెనీ అర్హత సాధించిందని, ఆపై ఆ కంపెనీలు బయటికి వెళ్లిపోయాయని సీబీఐ పేర్కొంది. ఎంబసీ గ్రూపు ఛైర్మన్‌ జితేంద్ర వీర్వాణి అలియాస్‌ జీతూ వీర్వాణి ఈ ప్రాజెక్ట్‌ వల్ల రూ.50.16 కోట్లు లబ్ధి పొందారని తేల్చింది. గచ్చిబౌలి ప్రాజెక్టులో 4.5 ఎకరాలను కృష్ణప్రసాద్‌కు చెందిన వసంత ప్రాజెక్ట్స్‌కు కేటాయించారు. వసంత ప్రాజెక్ట్స్‌లో తనకున్న సగం వాటాను శ్యాంప్రసాద్‌రెడ్డి... అప్పటి సీఎం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డికి బదలాయించారు. వై.వి.సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్‌లు విల్లాలను మిత్రులు, బంధువులకు కేటాయించుకుని లబ్ధి పొందారు. వైవీకి వాటా దక్కడంతో ఇందూకు ఎలాంటి బిడ్‌ లేకుండానే అదనంగా 15 ఎకరాలను కూకట్‌పల్లి ప్రాజెక్టులో భాగంగా కేటాయింపు జరిగిపోయిందనీ సీబీఐ  వెల్లడించింది. వీటన్నింటికీ ప్రతిఫలంగా ఇందూ గ్రూపు పలు కంపెనీల ద్వారా జగన్‌ కంపెనీల్లోకి రూ.70 కోట్లు పెట్టుబడులు పెట్టింది. సీబీఐ ఛార్జిషీటు ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసి...పెట్టుబడుల మళ్లింపు, అక్రమ లావాదేవీలపై ఫిర్యాదు దాఖలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని