Corona: ఒకసారి వస్తే 10 నెలల వరకూ రక్షణ!

ఒకసారి కొవిడ్‌-19కు గురైనవారు మళ్లీ మహమ్మారి బారిన పడే ముప్పు చాలా తక్కువని తాజా అధ్యయనంలో నిరూపితమైంది. ఇలాంటి వారికి సహజ రోగనిరోధకత పది నెలల పాటు ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ

Updated : 05 Jun 2021 08:29 IST

కొవిడ్‌ రీ-ఇన్‌ఫెక్షన్‌పై బ్రిటన్‌ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం

దిల్లీ: ఒకసారి కొవిడ్‌-19కు గురైనవారు మళ్లీ మహమ్మారి బారిన పడే ముప్పు చాలా తక్కువని తాజా అధ్యయనంలో నిరూపితమైంది. ఇలాంటి వారికి సహజ రోగనిరోధకత పది నెలల పాటు ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని తేలింది! యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధన వివరాలను ‘ద లాన్సెట్‌ హెల్దీ లాంగెవిటీ’ జర్నల్‌ అందించింది. ఇంగ్లండ్‌లోని కేర్‌ హోమ్‌లో నివాసం ఉంటున్నవారు, వైద్య సిబ్బంది కలిపి మొత్తం 2,111 మందికి... గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ పరిశోధకులు పలు దఫాలుగా కొవిడ్‌ యాంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించారు. అయితే- ‘‘నివాసుల్లో 682 మంది, సిబ్బందిలో 1,429 మంది అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 634 మంది ఇంతకుముందే కొవిడ్‌కు గురయ్యారు. అధ్యయన సమయంలో నివాసుల్లో నలుగురు, సిబ్బందిలో 10 మంది రెండోసారి కొవిడ్‌ బారిన పడ్డారు. ఇంతకుముందు కొవిడ్‌కు గురికాని 1,477 మందిలో... 93 మంది నివాసులకు, 111 మంది సిబ్బందికి మొదటిసారి ఇన్‌ఫెక్షన్‌ సోకింది. మిగతా వారితో పోల్చితే... ఒకసారి కొవిడ్‌ వచ్చి, ఇళ్లలో ఉంటున్నవారికి రీ-ఇన్‌ఫెక్షన్‌ ముప్పు 85%, వైద్య సిబ్బందికి 60% తక్కువగా ఉంటోంది. సుమారు 10 నెలల వరకూ కొవిడ్‌ నుంచి వీరికి రక్షణ లభిస్తోంది’’ అని యూసీఎల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఇన్‌ఫార్మేటిక్స్‌ పరిశోధనకర్త మరియా రుతికోవ్‌ విశ్లేషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని