Krishnapatnam: ఒక విడతలో 10 లక్షల మందికి

రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే.. అన్ని వనరులు సమకూరితే ఒక విడతలో 10 లక్షల మందికి మందు తయారు చేయగలమన్న నమ్మకాన్ని ఆనందయ్య వ్యక్తం చేశారు.. ‘మందు తయారీకి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాం

Updated : 08 Jun 2021 07:27 IST

 మందు తయారీపై ఆనందయ్య విశ్వాసం
 ప్రభుత్వ సాయం కోరామని వెల్లడి

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు - కృష్ణపట్నం (ముత్తుకూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే.. అన్ని వనరులు సమకూరితే ఒక విడతలో 10 లక్షల మందికి మందు తయారు చేయగలమన్న నమ్మకాన్ని ఆనందయ్య వ్యక్తం చేశారు.. ‘మందు తయారీకి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఇప్పటివరకు సాయం అందలేదు. అందిన వెంటనే వేగంగా ప్రజలకు మందు అందిస్తాం’ అని చెప్పారు. సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో తన నివాసంలో ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో, విలేకరులతో మాట్లాడారు. ‘అవాంతరాలతో 15 రోజులపాటు తయారీ నిలిచిపోయింది. అనుమతి ఇచ్చినప్పటి నుంచి తయారీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులతో యంత్రాలు కాలిపోతున్నాయి. మందు తయారీ నిర్విరామంగా జరగాలంటే.. కాస్త సమయం పడుతుంది. దేశంలో అవసరమైన వారందరికీ అందజేయాలని ప్రణాళిక నిర్దేశించుకున్నాం. నా మీద రాజకీయ ఒత్తిడి లేదు. ముందుగా కొవిడ్‌ బాధితులకు ఇవ్వాలనుకుంటున్నాం. అధికారులు సహకరించి పాజిటివ్‌ వ్యక్తులను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తే ప్రయోజనంగా ఉంటుంది. సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పంపిణీ చేసే ఉద్దేశం లేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఆనందయ్య వివరించారు. మరో వైపు ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌, గ్రామీణ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి ఆయనతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో ఆనందయ్య మాట్లాడుతూ.. రవాణా, ప్యాకింగ్‌ వంటి పనులకు దాదాపు 300 మంది అవసరమవుతారని చెప్పారు. కృష్ణపట్నంలోనే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకుని తయారు చేసేందుకు ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు.
సంపాదించాలన్న ఆలోచన చేస్తే నాశనమవుతా: ఎమ్మెల్యే కాకాణి
వెంకయ్య స్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. ఆనందయ్య మందును అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకున్నా.. ఆ దిశగా ఆలోచన చేసినా తాను, తమ కుటుంబసభ్యులు సర్వనాశనమైపోతామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మండలం గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమంలోని కల్యాణమండపంలో ఆనందయ్య మందును ఆయన పంపిణీ చేశారు. తనపై అభాండాలు వేసిన వారికి ఏ శిక్ష విధించాలో దేవుడే చూసుకుంటారన్నారు. నియోజకవర్గంలోని 1.80 లక్షల కుటుంబాలకు తొలుత మందు అందజేస్తామని చెప్పారు.
నా ఆరోపణలన్నీ నిజాలే: సోమిరెడ్డి
నెల్లూరు, న్యూస్‌టుడే: ఆనందయ్య మందు పంపిణీకి తయారుచేసిన వెబ్‌సైట్‌ విషయంలో తాను చేసిన ఆరోపణలన్నీ నిజాలేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వాటి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడిస్తే అర్ధరాత్రి నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. సోమవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, అరెస్టు చేసుకోండని సవాల్‌ చేశారు. అక్రమంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించిన వారిపై కేసులు నమోదు చేయరా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేని కలిశానని వెబ్‌సైట్‌ తయారీదారు ఒప్పుకున్నారని, అధికారుల వద్దకు వెళ్లానని కూడా చెప్పారని వెల్లడించారు. పబ్లిక్‌ వెబ్‌సైట్‌లో ఉన్న వాటిని మీడియా ముందు ఉంచితే  కేసులు పెడతారా అని వ్యాఖ్యానించారు. సంస్థ ఉండేది నెల్లూరు దర్గామిట్ట పోలీసుస్టేషన్‌ పరిధిలో అయితే కృష్ణపట్నంలో కేసు ఎలా పెడతారని మండిపడ్డారు. వెబ్‌సైట్‌పై ఫిర్యాదు ఇవ్వాలని రోజంతా ఎదురుచూసినా ఒక్క పోలీసు అధికారి కూడా అందుబాటులో లేరన్నారు. దీంతో మెయిల్‌లో ఎస్పీకి పంపామని వివరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ, తమ పోరాటంతోనే ఆనందయ్య మందుకు అనుమతులు త్వరగా వచ్చాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని