Corona: డెల్టా ప్లస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఇటీవల వెలుగులోకి వస్తున్నా.. వీటి పుట్టుక ఎప్పుడో మొదలైందని తాజా ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రెండున్నర నెలల క్రితమే వీటి ఉనికి ఆరంభమైంది.

Updated : 28 Jun 2021 07:35 IST

వ్యాప్తి తీరు తెలిసేందుకు 3-4 నెలల సమయం
తక్కువ కేసులున్నా జాగ్రత్తలు తప్పవంటున్న శాస్త్రవేత్తలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఇటీవల వెలుగులోకి వస్తున్నా.. వీటి పుట్టుక ఎప్పుడో మొదలైందని తాజా ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రెండున్నర నెలల క్రితమే వీటి ఉనికి ఆరంభమైంది. తిరుపతిలో ఏప్రిల్‌లో ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలో తాజాగా డెల్టా ప్లస్‌ రకాన్ని సీసీఎంబీ గుర్తించడం గమనార్హం. డెల్టా ప్లస్‌ రకంలో అధిక సంక్రమణ వేగం, ఊపిరితిత్తుల కణాల్లో బలంగా అతుక్కుపోవడం, యాంటీబాడీల స్పందనను    తగ్గించడం వంటి లక్షణాలను గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులు తక్కువ సంఖ్యలో ఉన్నా తేలిగ్గా తీసుకోవద్దని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ రకం  వ్యాప్తి తీరుతెన్నులు తెలిసేవరకు జాగత్త్రలు పాటించాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు.

చిన్నగా మొదలై అంతటా వ్యాప్తి
తిరుపతిలో ఏప్రిల్‌లో సేకరించిన ఓ వ్యక్తి నమూనాలో డెల్టా రకం బయటపడగా.. ఇప్పటికే అక్కడ ఈ రకం కేసులు మరిన్ని వెలుగు చూడాలి. కానీ అలాంటి ఆధారాలేవీ కన్పించలేదు. ‘డెల్టా ప్లస్‌ రకం సోకిన వ్యక్తి, చుట్టూ ఉన్నవాళ్లు జాగ్రత్తలు పాటించడంతో వ్యాప్తి ఆగిపోయి ఉండవచ్చు. ఆ ప్రాంతంలోని నమూనాల్లో వైరస్‌ జన్యు పరిణామక్రమ విశ్లేషణలు తగిన స్థాయిలో జరిగి ఉండకపోవచ్చు. కొత్త వేరియంట్‌ తొలుత చిన్నగా మొదలై, ఆ తర్వాత అంతటా వ్యాప్తి చెందేందుకు కనీసం 3-4 నెలలపైనే పడుతుంది. అప్పటివరకు దానిపై నిఘా పెట్టాల్సిందే’ అని సీసీఎంబీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

సీసీఎంబీలో గుర్తింపు
వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణతోపాటు వ్యాప్తిపై నిఘా పెట్టేందుకు జాతీయ ప్రయోగశాలల్లో వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటూ పొరుగు రాష్ట్రాల నుంచి సీసీఎంబీకి నమూనాలు వస్తుంటాయి. వారానికి ఒకసారి వీటి జన్యు పరిణామ క్రమాలను కనుగొంటుంటారు. తిరుపతి నుంచి ఏప్రిల్‌లోనే నమూనాలు రాగా.. అప్పట్లోనే మ్యుటేషన్‌లో వచ్చిన మార్పుల ఆధారంగా కొత్త వేరియంట్‌ను పరిశోధకులు గుర్తించారు. ఇటీవల దీనికి డెల్టా ప్లస్‌ రకమని పేరు పెట్టడంతో.. తాము గుర్తించిన రకం కూడా ఇదేనని జీనోమ్‌ కన్సార్షియం ఇన్సకాగ్‌కు వారు సమాచారం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని