Corona: కొవిడ్‌ బాధితులకు క్షయ ముప్పు!

కొవిడ్‌-19 బాధితులకు క్షయ (టీబీ) ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. బ్లాక్‌ ఫంగస్‌లాగే టీబీ కూడా అదునుచూసి విరుచుకుపడే ‘అవకాశవాద’ ఇన్‌ఫెక్షనేనని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే కొవిడ్‌ కారణంగా...

Updated : 21 Dec 2022 17:02 IST

కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ

దిల్లీ: కొవిడ్‌-19 బాధితులకు క్షయ (టీబీ) ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. బ్లాక్‌ ఫంగస్‌లాగే టీబీ కూడా అదునుచూసి విరుచుకుపడే ‘అవకాశవాద’ ఇన్‌ఫెక్షనేనని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే కొవిడ్‌ కారణంగా టీబీ కేసులు పెరుగుతున్నాయని చెప్పడానికి ప్రస్తుతానికి తగిన ఆధారాల్లేవని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 2020లో కొవిడ్‌ నిబంధనలతో పాటు క్షయ నివారణకు చేపట్టిన ప్రత్యేక చర్యల కారణంగా టీబీ కేసులు 25 శాతం తగ్గినట్లు వెల్లడించింది. ఇటీవల కొవిడ్‌ బారిన పడినవారిలో అకస్మాత్తుగా టీబీ కేసులు పెరుగుతున్నాయని.. వైద్యుల వద్దకు ఇలాంటి కేసులు రోజూ వస్తున్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. అందరు కొవిడ్‌ బాధితులకూ టీబీ పరీక్షలు, టీబీ రోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని సిఫార్సు చేసినట్లు పేర్కొంది. అలాగే టీబీ-కొవిడ్‌ పరీక్షలకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలిచ్చింది. ఈ రెండు వ్యాధులకూ ఉన్న సారూప్యతలను వివరించింది. ఈ రెండూ వ్యాధిగ్రస్థుల నుంచి ఇతరులకు వేగంగా సంక్రమిస్తాయని.. ప్రాథమికంగా ఊపిరితిత్తులపైనే దాడి చేస్తాయని.. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలను కనబరుస్తాయని తెలిపింది. అయితే టీబీ సోకిన తర్వాత లక్షణాలు బయటపడటానికి ఎక్కువ సమయం పడుతుందని పేర్కొంది. టీబీ కారక బ్యాక్టీరియా మానవ శరీరంలో నిద్రాణ స్థితిలో ఉంటుందని.. ఏ కారణం వల్లనైనా రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు తీవ్రతను పెంచుతుందని వివరించింది. కొవిడ్‌ తర్వాత కూడా ఎవరిలోనైనా రోగనిరోధక శక్తి తగ్గితే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని