వేటాడి మరీ.. మట్టుబెడతాం

కాబుల్‌ విమానాశ్రయం వెలుపల జంట పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వేటాడి, మట్టుబెట్టడం తథ్యమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతినబూనారు.

Updated : 28 Aug 2021 05:21 IST

కాబుల్‌ పేలుళ్ల బాధ్యులను వదిలిపెట్టం : బైడెన్‌

మా సైనికులు హీరోలు.. అగ్రరాజ్యాధినేత ఉద్వేగం

దాడులకు సిద్ధంకండని కమాండర్లకు ఆదేశం

వాషింగ్టన్‌: కాబుల్‌ విమానాశ్రయం వెలుపల జంట పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వేటాడి, మట్టుబెట్టడం తథ్యమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతినబూనారు. ప్రతీకారం తప్పదన్నారు. అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం ఐసిస్‌-కె ఉగ్రవాదులు ఆత్మాహుతి పేలుళ్లకు, కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 180 మంది మరణించారు. చనిపోయిన వారిలో 13 మంది, క్షతగాత్రుల్లో మరో 18 మంది అమెరికా సైనికులు ఉన్నారు. మృతులకు నివాళులర్పిస్తూ... బైడెన్‌ శుక్రవారం శ్వేతసౌధం వద్ద విలేకరులతో మాట్లాడారు. పేలుళ్లకు తెగబడిన వారికి దీటుగా బదులిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తన కమాండర్లను ఆదేశించారు.

‘‘కాబుల్‌ విమానాశ్రయం వెలుపల దాడులకు పాల్పడిన వారిని క్షమించం. మర్చిపోం. వారిని వేటాడి, మట్టుపెట్టడం తథ్యం. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అమెరికా ప్రయోజనాలను, మా ప్రజలను కాపాడుకోవడానికి నా అధికారాలన్నీ ఉపయోగిస్తా. జంట పేలుళ్లలో ప్రాణాలను త్యాగంచేసిన అమెరికా సర్వీసు సభ్యులు... హీరోలు. వారికి ఇదే సరైన పదం. ఈ దాడులు జరిపించింది ‘ఐఎస్‌ఐఎస్‌-కె’ గ్రూపే. విమానాశ్రయం వద్ద భద్రత చర్యలు చేపడుతున్న అనేకమంది అమెరికా సైనికులను, పౌరులను హతమార్చారు. మరెందరో గాయపడ్డారు. ఐఎస్‌ఐఎస్‌-కె స్థావరాలను, ఆస్తులను ధ్వంసం చేయడానికి, దాని నాయకులను మట్టుబెట్టడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని మా కమాండర్లను ఆదేశించాను. సరైన సమయంలో, సరైన చోట వారిని దెబ్బతీస్తాం. వారు నశించక తప్పదు.

31తో ఉపసంహరణ పూర్తిచేస్తాం

కాబుల్‌ నుంచి మా బలగాల ఉపసంహరణ ఈనెల 31తో పూర్తవుతుంది. అప్పటికల్లా తరలింపు ప్రక్రియను పూర్తిచేస్తాం. దీన్ని ఉగ్రవాదులు అడ్డుకోలేరు. మా మిషన్‌ ఆగదు. దళాలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా అఫ్గానిస్థాన్‌ నుంచి బయటపడాలనుకునే అమెరికన్లను తీసుకొస్తాం. మేమే వారిని గుర్తించి, వెనక్కు తీసుకొస్తాం.

విమానాశ్రయంపై దాడికి ఐసిస్‌ ఉగ్రవాదులు, తాలిబన్లు కలిసి కుట్ర పన్నారని చెప్పడానికి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లేవు. తాలిబన్లను ఎవరూ నమ్మరు. కాకపోతే, వారు తదుపరి కార్యాచరణ కొనసాగించేలా.. మేము ముందే చెప్పినట్టు అఫ్గాన్‌ను వీడి వెళ్తున్నాం. వీలైనంత మందిని వెనక్కు తీసుకొస్తున్నాం. తాలిబన్లేమీ మంచి వ్యక్తులు కారు. కానీ, విమానాశ్రయాన్ని ఎలా నిర్వహించాలో, నిర్వహించగలమో లేదో, ఆర్థిక వ్యవస్థను నడపగలమో లేదోనన్న ఆసక్తి వారిలో కనిపిస్తోంది. ట్రంప్‌ యంత్రాంగంతో చేసుకున్న ఒప్పందం మేరకే వారు గత ఏడాదిగా అమెరికా బలగాలపై ఎలాంటి దాడి చేయలేదు. మీరు ఎవరిపైన అయినా దాడి చేసుకోండిగానీ... అమెరికా సైనికుల జోలికి మాత్రం వెళ్లకండి అని తాలిబన్లతో ట్రంప్‌ ‘అవగాహన’కు వచ్చారు’’ అని బైడెన్‌ పేర్కొన్నారు.

క్షతగాత్రులు సీ-17లో తరలింపు...

కాబుల్‌ పేలుళ్లలో గాయపడిన తమ సిబ్బందిని సర్జికల్‌ సదుపాయాలున్న సీ-17 విమానం ద్వారా తరలించినట్లు అమెరికా రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. అఫ్గానిస్థాన్‌లో 2001 నుంచి ఇప్పటివరకూ జరిగిన వివిధ దాడుల్లో తమ సైనికులు 2,300 మంది మృతిచెందారని, 20 వేల మంది గాయపడ్డారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ వెల్లడించారు. సుదీర్ఘంగా జరిగిన వివిధ యుద్ధాల్లో ఇప్పటివరకూ 8 లక్షల మంది అమెరికా సైనికులు మరణించారని ఆయన వివరించారు.


మొహంలో దిగులు... మాటల్లో తడబాటు...

ఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చిన క్రమంలో విలేకరులు బైడెన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అధ్యక్షుడు ఒకానొక దశలో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన మొహంలో దిగులు, మాటల్లో తడబాటు ప్రస్ఫుటమయ్యాయి. బాధతో తలదించిన ఆయన, ప్రశ్నలకు బదులివ్వకుండా కాసేపు మౌనం వహించారు. మృతిచెందిన సైనికులకు నివాళిగా... శ్వేతసౌధంతో పాటు ప్రభుత్వ భవనాలు, మిలిటరీ, నావల్‌ పోస్టులు, విదేశాల్లోని రాయబార తదితర కార్యాలయాల వద్ద ఈనెల 30 వరకూ జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని బైడెన్‌ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని