Pandora papers: పాండోరా ప్రకంపనలు

అక్రమంగా విదేశాల్లో ఆస్తులు, కంపెనీలను సమకూర్చుకున్న రాజకీయ నేతలు, ప్రముఖులు, సంపన్నుల వివరాలను వెలుగులోకి తెచ్చిన ‘పాండోరా పత్రాలు’ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీరిలో అనేక మంది తాము ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టంచేస్తున్నారు.

Updated : 05 Oct 2021 09:26 IST

రహస్య పత్రాల వెల్లడితో కదులుతున్న డొంకలు
అక్రమ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తునకు భారత్‌ నిర్ణయం
వెలుగులోకి మరికొన్ని పేర్లు

ఈనాడు, దిల్లీ: అక్రమంగా విదేశాల్లో ఆస్తులు, కంపెనీలను సమకూర్చుకున్న రాజకీయ నేతలు, ప్రముఖులు, సంపన్నుల వివరాలను వెలుగులోకి తెచ్చిన ‘పాండోరా పత్రాలు’ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీరిలో అనేక మంది తాము ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టంచేస్తున్నారు. తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. పత్రాల్లో 3 వందల మందికిపైగా భారతీయులు ఉండటం చర్చనీయాంశమైంది. అనిల్‌ అంబానీ, కిరణ్‌ మజుందార్‌ షా భర్త జాన్‌, సచిన్‌ తెందుల్కర్‌ పేర్లు వెలుగు చూశాయి. తాజాగా.. నీరా రాడియా, వినోద్‌ అదానీ, జాకీ ష్రాఫ్‌, కెప్టెన్‌ సతీశ్‌ శర్మ వంటి ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.  పన్నులు తక్కువగా ఉన్న దేశాల్లో అక్రమ పెట్టుబడుల వివరాలతో కూడిన పాండోరా పత్రాలను అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి ఆదివారం విడుదల చేసింది. ఇందులో 14 లీగల్‌, ఆర్థిక సేవా సంస్థల నుంచి సేకరించిన 1.2 కోట్ల రహస్య పత్రాలు ఉన్నాయి. ఇవి 29వేల ఆఫ్‌షోర్‌ కంపెనీలు, ట్రస్టుల వివరాలను బట్టబయలు చేశాయి.

పత్రాలపై దర్యాప్తు: కేంద్రం  

పాండోరా పత్రాల్లో వెల్లడైన సమాచారంపై దర్యాప్తు చేయనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్‌ ఆధ్వర్యంలోని సీబీడీటీ, ఈడీ, ఆర్‌బీఐ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ సిబ్బందితో కూడిన బృందం ఈ బాధ్యతను చేపడుతుందని వెల్లడించింది. ఈ కేసుల్లో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. దర్యాప్తు సమర్థంగా సాగేందుకు వీలుగా ఆయా దేశాల్లోని సంబంధిత సంస్థలు, పన్ను చెల్లింపుదారుల వివరాలను తెప్పిస్తామని వెల్లడించింది. ఇదివరకు ఐసీఐజే వెలువరించిన హెచ్‌ఎస్‌బీసీ, పనామా, ప్యారడైజ్‌ పేపర్స్‌ సమాచారం ఆధారంగా నల్లధనాన్ని అరికట్టేందుకు చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది. పనామా, ప్యారడైజ్‌ పేపర్ల దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్‌ 15నాటికి దాదాపు రూ.20,352 కోట్ల నల్లధనాన్ని కనిపెట్టినట్లు పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని