ఫేస్‌బుక్‌ సాంకేతిక తప్పిదంతోనే..

ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ సేవలు స్తంభించడానికి ఆ సంస్థ చేసిన పొరపాటే కారణమని తెలుస్తోంది. సోమవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు ఏడు గంటలపాటు స్తంభించిన ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రాం సేవలు మంగళవారం తెల్లవారుజాము నుంచి యథావిధిగా

Updated : 06 Oct 2021 10:45 IST

ప్రపంచవ్యాప్తంగా సేవలకు అంతరాయం
 ఏడు గంటల తర్వాత పునరుద్ధరణ

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ సేవలు స్తంభించడానికి ఆ సంస్థ చేసిన పొరపాటే కారణమని తెలుస్తోంది. సోమవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు ఏడు గంటలపాటు స్తంభించిన ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రాం సేవలు మంగళవారం తెల్లవారుజాము నుంచి యథావిధిగా పనిచేయడం ప్రారంభించాయి. ‘కాన్ఫిగరేషన్‌’లో తప్పుడు మార్పులు జరగడం వల్లనే సేవలు నిలిచిపోయినట్లు ఫేస్‌బుక్‌ పేర్కొంది. ‘బ్యాక్‌బోన్‌ రౌటర్స్‌ కాన్ఫిగరేషన్‌’లో మార్పులు చేయడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. డేటా సెంటర్లు, నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌ మధ్య సమన్వయానికి ఈ రౌటర్లే కీలకం. దీనిలో మార్పుల వల్ల డొమైన్‌ నేమ్‌ సిస్టం (డీఎన్‌ఎస్‌)లో తప్పులు వచ్చాయి. డీఎన్‌ఎస్‌ అంటే వెబ్‌సైట్‌ పేరును ఐపీ చిరునామాగా మార్చే వ్యవస్థ. సేవలు నిలిచిపోయినప్పుడు వినియోగదారులతో పాటు ఫేస్‌బుక్‌ సిబ్బందీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో అంతర్గత సమాచార వ్యవస్థ కూడా స్తంభించింది. ఈ సేవల్నీ ఫేస్‌బుక్‌ డొమైన్‌ నుంచే యాక్సెస్‌ చేయాల్సి ఉండటం ఇందుకు కారణం. డీఎన్‌ఎస్‌ సమస్య వల్ల ఫేస్‌బుక్‌ కార్యాలయంలోని ఇంజినీర్ల బ్యాడ్జీలు కూడా పనిచేయలేదు. ఫలితంగా వారు కార్యాలయంలోని కీలక గదుల్లోకి ప్రవేశించలేకపోయారు. సమస్యను పరిష్కరించేందుకు అన్ని గంటలు పట్టడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది.

ఏమైందో తెలుసుకుంటున్నాం..

సేవలకు అంతరాయం కలగడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. సేవల్లో కలిగిన అంతరాయానికి గానూ తమను క్షమించాలని ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌ కోరారు. ఒకరితో ఒకరు అనుసంధానమయ్యేందుకు ప్రజలు ఫేస్‌బుక్‌పై ఎంతగా ఆధారపడతారో తనకు తెలుసునని చెప్పారు. ‘సేవలు నిలిచిపోవడం వల్ల వాడకందారుల సమాచారానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దాదాపు సేవలన్నీ మునుపటి మాదిరిగా అందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మాపై ఆధారపడిన కోట్లమంది ప్రజలకు, వ్యాపారులకు కలిగిన అసౌకర్యంపై చింతిస్తున్నాం. ఎందువల్ల అంతరాయం వాటిల్లిందో పూర్తిస్థాయిలో తెలుసుకునే పనిలో ఉన్నాం. మా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది’ అని ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షుడు సంతోష్‌ జనార్ధన్‌ తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద సామాజిక మాధ్యమ సంస్థ అయిన ఫేస్‌బుక్‌ నుంచి సేవలన్నీ ఒకేసారి నిలిచిపోవడం అత్యంత అరుదైనదని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక పేర్కొంది.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts