Afghanistan: అఫ్గాన్‌లో ఉగ్ర ఘాతుకం

అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు శుక్రవారం మరో దారుణానికి తెగబడ్డారు. కుందుజ్‌లోని గొజరే సయ్యద్‌ అబద్‌ మసీదు వద్ద షియాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 143 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ప్రావిన్స్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Updated : 09 Oct 2021 05:18 IST

మసీదులో ఆత్మాహుతి దాడి
46 మంది మృతి.. 143 మందికి గాయాలు
ఇస్లామిక్‌ స్టేట్‌ ముష్కర చర్య

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు శుక్రవారం మరో దారుణానికి తెగబడ్డారు. కుందుజ్‌లోని గొజరే సయ్యద్‌ అబద్‌ మసీదు వద్ద షియాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 143 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ప్రావిన్స్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మసీదులో అధిక సంఖ్యలో షియాలు మధ్యాహ్నం ప్రార్థనలు జరుపుతున్న సమయంలో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. మసీదు ప్రాంతం భీతావహంగా మారింది. పేలుడు తీవ్రతకు.. అక్కడున్నవారు దూరంగా ఎగిరి పడ్డారు. మసీదు ప్రవేశద్వారం, మెట్ల వద్ద అంతా రక్తసిక్తమైంది. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది. ఆసుపత్రుల్లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆత్మాహుతి ఘటన జరిగిన సమయంలో మసీదులో భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నట్లు కుందుజ్‌ ప్రావిన్స్‌ పోలీసు అధికారి దోస్త్‌ మహమ్మద్‌ ఒబైదా తెలిపారు. షియాల భద్రతకు తాలిబన్లు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇది ఆత్మాహుతి దాడేనని తాలిబన్‌ ప్రభుత్వానికి చెందిన కుందుజ్‌లోని అధికారులు తెలిపారు.

ఐఎస్‌ పనే..

ఈ ఘాతుకం తమ పనేనని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) గ్రూప్‌ ప్రకటించింది. తాలిబన్లకు బద్ధశత్రువుగా మారిన ఈ ఉగ్రవాద ముఠా.. అఫ్గాన్‌లో షియా ముస్లిం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటూ అనేక సార్లు దాడులకు తెగబడింది. అఫ్గాన్‌లో మైనారిటీలుగా ఉంటూ నిత్యం వివక్షకు గురవుతున్న హజారాలు (షియాలు) లక్ష్యంగానే తాజాగా దుశ్చర్యకు పాల్పడింది. కుందుజ్‌లో ఉగ్రదాడిని అఫ్గానిస్థాన్‌లోని ఐక్యరాజ్య సమితి మిషన్‌ ఖండించింది. అఫ్గాన్‌లో షియాలకు తాలిబన్లు భద్రత కల్పించాలని మతపెద్ద సయ్యద్‌ హుస్సేన్‌ అలిమీ బల్ఖీ కోరారు. కుందుజ్‌ ప్రావిన్స్‌ జనాభాలో హజారాలు 6% వరకు ఉన్నారు. అధిక సంఖ్యలో ఉజ్బెక్‌ ప్రజలు కూడా ఇక్కడ ఉంటున్నారు. ఉగ్రవాదులుగా మార్చేందుకు ఇస్లామిక్‌ స్టేట్‌ ముఠా వీరినే ఎంచుకుంటోంది. మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడటం వారంలో ఇది మూడోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని