Chandrababu: చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

ముఖ్యమంత్రిని ఉద్దేశించి తెదేపా నేత పట్టాభిరామ్‌ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైకాపా నేతలు డిమాండు చేశారు. గురువారం వైకాపా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేపట్టారు. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు.

Updated : 22 Oct 2021 05:41 IST

రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు

ఈనాడు, యంత్రాంగం: ముఖ్యమంత్రిని ఉద్దేశించి తెదేపా నేత పట్టాభిరామ్‌ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైకాపా నేతలు డిమాండు చేశారు. గురువారం వైకాపా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేపట్టారు. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. విజయవాడలో వైఎస్‌ విగ్రహం వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి దీక్షను ప్రారంభించారు. ‘చంద్రబాబుకు రాజకీయాల్లోనే కాదు, సమాజంలోనే ఉండే అర్హత లేదు, తెదేపా నాయకులు ఎక్కడ కనిపించినా నిలదీయాలి’ అని సూచించారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.

* తెదేపాను కాపాడుకునేందుకే చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విశాఖజిల్లా తగరపువలస దీక్షకు ఆయన హాజరయ్యారు. పెందుర్తి దీక్షలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, గాజువాక జంక్షన్లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేశ్‌ బైక్‌ర్యాలీ నిర్వహించి, పట్టాభిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు.

* మరోసారి నోరు కదిపితే పట్టాభికైనా, వాళ్ల తాతకైనా కాళ్లు విరుగుతాయని విద్యుత్తుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద దీక్షలో ఆయన మాట్లాడారు. పర్చూరు, చీరాల, అద్దంకి, కనిగిరి, మార్కాపురం, దర్శి ప్రాంతాల్లో చేపట్టిన దీక్షల్లో ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.

* చిత్తూరు జిల్లాలోని పలు స్టేషన్లలో పట్టాభిపై వైకాపా నేతలు ఫిర్యాదుచేశారు. నారాయణవనం, వాల్మీకిపురం, చిత్తూరులో దీక్షల్లో పలువురు పాల్గొన్నారు.

* అనంతపురంలోని వైకాపా కార్యాలయం, బుక్కరాయసముద్రం, కదిరి, రాయదుర్గం, గుంతకల్లులో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

* కడప అంబేద్కర్‌ కూడలి, రైల్వేకోడూరు, రాయచోటిలో దీక్షలు జరిగాయి.

* చంద్రబాబు దొంగదీక్షలతో ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని నెల్లూరు జిల్లా ముత్తుకూరు దీక్షలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఆత్మకూరు, నెల్లూరులోనూ దీక్షలు జరిగాయి.

* తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దీక్షలో మంత్రి వేణుగోపాలకృష్ణ, కాకినాడలో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, తుని గొల్లప్పరావు సెంటర్‌లో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్‌, అమలాపురంలో ఎంపీ చింతా అనూరాధ పాల్గొన్నారు.

* పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో మంత్రి రంగనాథరాజు ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. నరసాపురం అంబ్కేడర్‌ కూడలి, పాలకొల్లు, గోపాలపురం ప్రాంతాల్లో నిర్వహించిన దీక్షల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

* శ్రీకాకుళం జిల్లా రాజాంలోని పాలకొండ కూడలి, ఇచ్ఛాపురం, కవిటి, ఆమదాలవలస, రణస్థలం ప్రాంతాల్లో దీక్షలు చేశారు.

* కర్నూలు జిల్లా ఆలూరులో దీక్షకు మంత్రి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. నంద్యాల గాంధీచౌక్‌లో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో దీక్షను ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.

* గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు. తాడికొండలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి, వేమూరులో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లిలో ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్‌, రేపల్లెలో ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు హాజరయ్యారు.

* విజయనగరం జిల్లా కురుపాం దీక్షలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోనూ దీక్షలు జరిగాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు