Chandrababu: చంద్రబాబు దీక్షకు పోటెత్తిన కార్యకర్తలు

రాష్ట్రం నలుమూలల నుంచీ భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణుల కోలాహలం, జైజై నినాదాల మధ్య తెదేపా అధినేత చంద్రబాబు గురువారం ఉదయం నిరసన దీక్ష ప్రారంభించారు. ‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరాటం’ పేరుతో చంద్రబాబు

Updated : 22 Oct 2021 05:36 IST

అర్ధరాత్రి వరకు కొనసాగిన రాక

ఈనాడు, అమరావతి: రాష్ట్రం నలుమూలల నుంచీ భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణుల కోలాహలం, జైజై నినాదాల మధ్య తెదేపా అధినేత చంద్రబాబు గురువారం ఉదయం నిరసన దీక్ష ప్రారంభించారు. ‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరాటం’ పేరుతో చంద్రబాబు తలపెట్టిన 36 గంటల నిరాహార దీక్ష మంగళగిరి సమీపంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 8.20 నిమిషాలకు ప్రారంభమైంది. అల్లరిమూకల దాడిలో పగిలిన అద్దాలు, దెబ్బతిన్న ఫర్నిచర్‌, చెల్లాచెదురుగా పడి ఉన్న గాజుపెంకుల మధ్యే, ఎన్టీఆర్‌ విగ్రహం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై చంద్రబాబు దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. ఆయనతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు, శాసనసభాపక్ష ఉపనేత రామానాయుడు వేదికపై దీక్షలో కూర్చున్నారు. తొలుత అచ్చెన్నాయుడు మాట్లాడాక.. చంద్రబాబు, తర్వాత మాజీ మంత్రులు, ముఖ్య నేతలు ప్రసంగించారు.

పోలీసులు అడ్డుకుంటారేమోనని..

దీక్షాస్థలికి వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు ఇంటి దగ్గరే అడ్డుకుంటారేమోనన్న అనుమానంతో కొందరు తెదేపా నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రే ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఆరు గంటలకే మరికొందరు నాయకులు, కార్యకర్తలు వచ్చారు. చంద్రబాబు ఉదయం 7.45 గంటలకు తన నివాసం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి బయల్దేరారు. ఆయన తాడేపల్లి మీదుగా జాతీయ రహదారిపైకి వచ్చి, పార్టీ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంది. అదే సమయానికి ఆ మార్గంలో ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడ వెళుతుండటంతో, చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు వేరే దారిలో పంపించారు. దీంతో ఆయన రాక 20 నిమిషాలు ఆలస్యమైంది. ఆయన వెంట వస్తున్న నాయకులు, కార్యకర్తల వాహనాల్ని సర్వీసు రోడ్డులోకి ప్రవేశించేచోట పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా శ్రేణులు ఆగ్రహించడంతో.. కాలినడకన కార్యాలయానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. మాజీ మంత్రులు, ముఖ్య నేతల వాహనాల్ని మాత్రమే పార్టీ కార్యాలయం వరకు పోనిచ్చారు. చంద్రబాబు దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు తరలి వచ్చారు. గురువారం సాయంత్రానికి కార్యకర్తలు మరింతగా పోటెత్తడంతో దీక్షాస్థలి కిక్కిరిసిపోయింది. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వాహనాల్లో వస్తున్న నాయకుల్ని పశ్చిమగోదావరి జిల్లాలో పలు చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. తనను 5చోట్ల ఆపారని సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. తెదేపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు బక్కని నర్సింలు ఆధ్వర్యంలో అక్కడి నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు వచ్చారు.


అరలీటరు నీళ్లతోనే రోజంతా..

దయం ఇంటి నుంచి బయల్దేరే ముందు చంద్రబాబు జావ మాత్రమే ఆహారంగా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీక్ష ప్రారంభించాక మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఆ తర్వాత కొంచెం మంచినీళ్లు తాగారు. రోజంతా అరలీటరు నీళ్లతోనే ఆయన సరిపెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొబ్బరి నీళ్లయినా తీసుకోమని వైద్యులు సూచించినా ఆయన నిరాకరించారు. రోజంతా తరలివస్తూనే ఉన్న నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ గడిపిన చంద్రబాబు గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో దీక్షా వేదికపైనే నిద్రకు ఉపక్రమించారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ ఆధ్వర్యంలో పలువురు ముస్లింలు చంద్రబాబును కలిశారు. వేమూరి ఆనంద్‌సూర్య ఆధ్వర్యంలో వచ్చిన వేదపండితులు చంద్రబాబుకు ఆశీర్వచనం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని