Updated : 23 Oct 2021 06:45 IST

Azadi Ka Amrit Mahotsav: చైనాతో పో‘టీ’పడి మనకు రుద్దారు!

నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా లెక్కనేనన్నిసార్లు గొంతుల్లో పడనిదే మనసును ప్రశాంతంగా ఉండనివ్వని చాయ్‌కీ... మన జాతీయోద్యమానికీ సంబంధం ఉంది. బ్రిటన్‌లో డబ్బులు కాపాడుకోవటానికి తెల్లవారు వేసిన ఎత్తుగడ మన గొంతులకూ చుట్టుకుంది... ఇప్ప‘టీ’కీ వదలకుండా!

వ్యాపారం కోసం భారత్‌లో అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ బ్రిటన్‌లో తమ ఖజానా ఖాళీ కాకుండా కాపాడుకోవటానికి ‘టీ’ని భారత్‌కు అంటగట్టింది. కాపాడుకుంటే చాలనుకుంటే ఏకంగా అది తమ ఖజానాను నింపేదిలా మారటం తెల్లవారు కూడా ఊహించని పరిణామం! 18వ శతాబ్దంలో బ్రిటన్‌లో టీకి డిమాండ్‌ ఎక్కువుండేది. వారిక్కావల్సిన తేయాకును చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. దీంతో చాలా సొమ్ము చైనాకు చెల్లించాల్సి వచ్చేది. బ్రిటిష్‌వారి బుర్రలో ఓ ఐడియా వెలిగింది. చైనాకు అవసరమైన నల్లమందును ఎగుమతి చేసి, బదులుగా టీని దిగుమతి చేసుకోవాలని తలచారు. ఇందుకోసమని భారత్‌లో భారీస్థాయిలో నల్లమందు పండించటం మొదలెట్టించారు. భారత్‌ నుంచి నల్లమందును చైనాకు పంపించి... చైనా నుంచి తేయాకును ఇంగ్లాండ్‌కు రప్పించేవారు.


చైనా మత్తువదలటంతో...

తమ ప్రజానీకం మత్తుకు బానిసవుతున్నారని ఆందోళన చెందిన చైనా... నల్లమందు దిగుమతిని ఆపేయాలని నిర్ణయించింది. దీనిపై 1839లో నల్లమందు యుద్ధమే జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటన్‌ గెలిచినా చైనా నుంచి టీ ఎగుమతులు తగ్గిపోయాయి. బ్రిటన్‌ కన్ను భారత్‌పై పడింది. తమ చేతిలో బొమ్మలా మారిన భారత్‌లోనే తేయాకు పండిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించింది. 1830లో ఈస్టిండియా కంపెనీ అస్సాంలో తొలి టీ ఎస్టేట్‌ను ఆరంభించింది. చైనా నుంచి రహస్యంగా తెచ్చిన విత్తనాలను నాటించారు. తేయాకు పంట ఆరంభించారు. అది విజయవంతమైంది. ఇంగ్లాండ్‌కే కాదు యావత్‌ యూరప్‌కు సరిపడా భారత్‌లోనే పండించసాగారు. లండన్‌లో చైనా తేయాకు వాటా 70% నుంచి 10శాతానికి పడిపోయింది.


ఇంటింటికీ ఉచితంగా..

అంతటితో తెల్లవారి ఆబ ఆగలేదు. ఈ తేనీరును భారీ జనాభాగల భారతీయులకు అలవాటు చేస్తే మరింత లాభాలు గడించవచ్చని భావించారు. వెంటనే... ఉచితంగా టీపొడి ప్యాకెట్లు పంచారు. రైల్వేస్టేషన్లలో, సినిమా హాళ్లలో, ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా ఆ ప్యాకెట్లు ఇచ్చేవారు. కానీ బ్రిటిష్‌వారు ఎంతగా ప్రయత్నించినా భారతీయుల నుంచి మొదట్లో అంతగా స్పందన రాలేదు. కారణం- టీ-ని భారత కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా బ్రిటిష్‌ సామ్రాజ్యవాద వస్తువుగా చూడటమే. ప్రఖ్యాత బెంగాల్‌ రచయిత శరత్‌ చంద్ర నవలల్లో (పరిణీత) కూడా చాయ్‌ను వ్యతిరేకిస్తూ పాత్రలుంటాయి. 1920ల్లో టీని విషంతో సమానంగా పోలుస్తూ ఆచార్య ప్రఫుల్ల రే కార్టూన్లు వేశారు. మహాత్మాగాంధీ సైతం చాయ్‌ పట్ల విముఖత ప్రదర్శించారు. దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తన పుస్తకంలో ఆరోగ్యం గురించిన అధ్యాయంలో ... టీ అనేది సిగరెట్‌, మత్తుపదార్థాల్లాంటి పరిహరించాల్సిన పదార్థమేనని రాశారు గాంధీజీ!


పోటాపోటీగా...

ఈ వ్యతిరేకత కారణంగా చాయ్‌ను భారతీయులకు అంటగట్టడానికి కంపెనీలు, బ్రిటిష్‌ ప్రభుత్వం నానా అగచాట్లు పడ్డాయి. జాతీయ నాయకుల ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రకటనలు ఇచ్చేవారు. టీ తాగితే శరీరంలో సరికొత్త బలం వస్తుందని, విషానికి విరుగుడనీ... ప్రచారం చేసేవారు. ఎడ్లబండ్లపై పట్టణాల్లోనే కాకుండా ఊర్లలోకీ ఈ ప్రచారాన్ని విస్తరించారు. కొన్నికంపెనీలైతే... ఎడ్లబండ్లపై ప్రచారంతో పాటు... పాలు తీసుకొస్తే ఉచితంగా చాయ్‌ చేసి ఇచ్చేవి. అలా మెల్లమెల్లగా అలవాటు చేయగా... 1920నాటికి భారత్‌లో టీ పొడి అమ్మకం 25 లక్షల కిలోలకు చేరింది. 1947కల్లా ఇది రెట్టింపైంది. స్వాతంత్య్రానంతరం ఇక చెప్పనే అక్కర్లేకుండా... టీ పూర్తిగా భారతీయమైపోయింది!


Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని