Chandrababu: కుప్పంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు

కుప్పం పురపాలక సంఘం పరిధిలో తెదేపా అభ్యర్థులకు ఓటేయనివ్వకుండా అక్కడి ప్రజల్ని అధికార పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు

Updated : 12 Nov 2021 05:11 IST

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు

ఈనాడు, అమరావతి: కుప్పం పురపాలక సంఘం పరిధిలో తెదేపా అభ్యర్థులకు ఓటేయనివ్వకుండా అక్కడి ప్రజల్ని అధికార పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. గ్యాస్‌, రేషన్‌ డీలర్లపై విజిలెన్స్‌ దాడులు చేయిస్తున్నారని, మెడికల్‌ దుకాణాలపై డ్రగ్‌ కంట్రోలర్‌తో తనిఖీలు చేయించి బెదిరిస్తున్నారని తెలిపారు. ‘తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసుంటే పులివెందులలో మాకు ఏకగ్రీవాలు అవ్వవా? పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద నాయకుడా? నేను తలుచుకునుంటే ఆయన గతి ఏమై ఉండేది’ అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి అనుమతి పొందాలంటూ కుప్పం డీఎస్పీ ఆంక్షలు విధించారని, ఆయన ఏమైనా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారా అని నిలదీశారు. ‘వైకాపా నాయకులు, మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో ప్రచారం చేసుకోవొచ్చా? తెదేపా నాయకులు ప్రచారం కోసం బయటకు వస్తే అరెస్టు చేస్తారా? ఇదెక్కడి న్యాయం?’ అంటూ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే!

పాదయాత్రను చూసి జగన్‌ భయపడుతున్నారు
‘అమరావతి రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకొని వారి బాధలను ప్రజలకు వివరించుకుంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? పోలీసులు ఎందుకు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆ యాత్రను ఎలాగైనా సరే ఆపేయాలనే ఇష్టానుసారంగా వ్యవహరించి లాఠీ ఛార్జీ చేస్తారా? 700 రోజులుగా వారు ఉద్యమిస్తుంటే వారిని వేధించి, దౌర్జన్యాలకు తెగబడింది చాలక.. రాష్ట్రమంతటా వారిపై సానుభూతి వస్తుంటే ముందుకు వెళ్లనీయకుండా పోలీసులతో అడ్డుకుంటారా?  జగన్‌, రాజశేఖర్‌రెడ్డిలు పాదయాత్రలు చేసినప్పుడు శాంతిభద్రతల సమస్యలు లేవా? మేము ఇలాగే వ్యవహరించి ఉంటే వారు పాదయాత్రలు చేయగలిగే వారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.  ‘ పాదయాత్రలో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడాన్ని ఖండిస్తున్నాం. గాయపడిన రైతులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి సీఎం జగన్‌ భయపడుతున్నారు’ అని చంద్రబాబు అన్నారు.

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి
‘తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏడో డివిజన్‌కు తెదేపా తరఫున విజయలక్ష్మి, ఆమె భర్త నామినేషన్లు దాఖలు చేశారు. అప్పట్లో వారి సంతకాలు ఫోర్జరీ చేసి వారి నామినేషన్లు అధికారులే ఉపసంహరించారు. తమకు న్యాయం చేయకపోతే పెట్రోల్‌ పోసుకుని అక్కడే తగలబెట్టుకుంటానని అప్పట్లో విజయలక్ష్మి భర్త వాపోయారు. అయినా అధికారులు స్పందించలేదు. అతను కోర్టును ఆశ్రయించగా. నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలపై ఉన్నవి ఫోర్జరీ పత్రాలని ఫోరెన్సిక్‌ నివేదికలో తేలింది. ఈ విషయంలో మేము చెబుతున్న విషయమే ఇప్పుడు న్యాయస్థానం సాక్షిగా నిరూపితమైంది. ఇలాంటి అక్రమాలను పాల్పడిన ముఖ్యమంత్రికి ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. ఆయనకు సిగ్గుంటే రాజీనామా చేయాలి. రిటర్నింగ్‌ అధికారిని ఉద్యోగం నుంచి తొలగించి అరెస్టు చేయాలి. ఆయనపై కేసు పెడతాం’ అని అన్నారు. ‘అధికార పార్టీకి ఓటేయకపోతే రేషన్‌, పెన్షన్‌ వంటివి నిలిపేస్తారనే ఆలోచనతో స్థానిక ఎన్నికల్లో వైకాపాను గెలిపిస్తే... రేపు వారు ప్రజలపై దాడులకు పాల్పడినా, ఆస్తులు కబ్జా చేసినా సరే కనీసం అడిగే పరిస్థితి కూడా లేకుండా చేసేస్తారు. ఉన్మాదుల్లా రెచ్చిపోతారు. బిడ్డలకు రక్షణ ఉండదు. నిద్ర నటిస్తున్న జగన్‌ని గట్టిగా ఓ దెబ్బ కొట్టి లేపి ‘‘బీ కేర్‌ ఫుల్‌’’ అంటూ ప్రజలుహెచ్చరించాలి. ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికలే అందుకు అవకాశం’ అని తెదేపా అధినేత పిలుపునిచ్చారు.  

తప్పు చేస్తున్న పోలీసుల్ని సీఎం కాపాడలేరు
‘అక్రమ కేసులపై మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఆ కేసుల్లో ఎవర్నీ అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా చట్ట వ్యతిరేకంగా రామానాయుడు, పులవర్తి నానిని గృహనిర్బంధం చేశారు. మరోమారు సీఆర్‌పీసీ 151 నోటీసు ఇచ్చారు. గురజాల ఒకటో వార్డులో తెదేపా అభ్యర్థి వెంకటేశ్‌ను గురువారం కిడ్నాప్‌ చేశారు. కోర్టు ఆదేశాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదా? వైకాపా నేతలు చెప్పినట్లు చేస్తున్న పోలీసుల్ని ముఖ్యమంత్రి, మంత్రులు కాపాడలేరు’ అని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని