AP High Court: ఇది నగరాల మధ్య పోటీ కాదు

రాజధానికి ఏ నగరాలు అనువైనవో ప్రస్తుత వ్యాజ్యాల్లో తాము నిర్ణయించడం లేదని, సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాల చట్టబద్ధతనే తేలుస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Updated : 19 Nov 2021 04:31 IST

రాజధానికి ఏ నగరాలు అనువైనవో మేం చెప్పం
సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ చట్టాల చట్టబద్ధతనే తేలుస్తాం
స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం

ఈనాడు, అమరావతి: రాజధానికి ఏ నగరాలు అనువైనవో ప్రస్తుత వ్యాజ్యాల్లో తాము నిర్ణయించడం లేదని, సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాల చట్టబద్ధతనే తేలుస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ఆ చట్టాలను చేసేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానం సక్రమంగా ఉందా.. లేదా నిర్ణయిస్తామంది. అంతేకానీ రాజధానిగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, అమరావతిలో ఏది ఉత్తమమైందో తాము తేల్చడం లేదంది. ఇది నగరాల మధ్య పోటీ కాదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు స్పష్టంచేసింది. సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై వరుసగా నాలుగో రోజు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్లు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు తదితరుల తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. అవి ఇలా ఉన్నాయి...

చట్టాలు చేయడం వెనుక ప్రభుత్వానిది దురుద్దేశం
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు చేయడం వెనుక ప్రభుత్వం, పలువురు మంత్రుల దురుద్దేశం ఉంది. రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చి భూ సమీకరణ ద్వారా 33 వేల ఎకరాల్ని తీసుకుంది. ఇచ్చిన హామీ నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి వీల్లేదు. రాజధానిపై అధ్యయనం చేసి, సిఫారసులు చేసేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్‌ కమిటీని ఎక్కువ శాతం ప్రజలు విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటుచేయాలని కోరారు. ఆ కమిటీ సిఫారసులను పట్టించుకోకుండా గత ప్రభుత్వం.. అమరావతిని రాజధానిగా ప్రకటించిందని ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం సరికాదు. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. అక్కడి నిపుణులు ఆ భావన విఫలమైందని చెబుతున్నారు. ఆ వివరాల్ని కోర్టు ముందు ఉంచాం.. పరిశీలించండి.

ఎన్నో సహజ ప్రయోజనాలున్నాయి..
శివరామకృష్ణన్‌ కమిటీ సిఫారసుల తర్వాత అప్పటి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. దానివల్ల సహజంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. పక్కనే కృష్ణానది ఉంది. ప్రపంచంలో ప్రముఖ నగరాలన్నీ నదీ తీరాల్లో ఉన్నవే. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉండటం వల్ల రాకపోకలకు అనువైంది. భూ సమీకరణకు ఇబ్బంది లేదు. ప్రకృతి విపత్తులు వచ్చే అవకాశం లేదు. హైదరాబాద్‌, చెన్నైలతో పోలిస్తే అమరావతిలో నిర్మాణ వ్యయం చాలా తక్కువ. కర్నూలు, విశాఖపట్నం, ఇతర నగరాలతో పోలిస్తే అమరావతి రాజధానికి అనువైనదని అప్పటి ప్రభుత్వం భావించింది. ఆ మేరకు నిర్ణయం తీసుకుంది.

అన్ని ప్రాంతాల అభివృద్ధి
రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకపోతే ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయని ప్రస్తుత ప్రభుత్వం వాదిస్తోంది. అమరావతితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మూడు మెగా సిటీలు, 14 స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి 2014 సెప్టెంబరు 1న అప్పటి ప్రభుత్వం తీర్మానం చేసి, జీవోలు జారీచేసింది. ఈ నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ చట్టంతో ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా చేసేదేమీ లేదు. రాజధాని అమరావతిగా నిర్ణయించినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైకాపా వ్యతిరేకించలేదు. అందుకు సంబంధించిన వీడియోలు కోర్టు ముందు ఉంచాం. అధికారంలోకి రాగానే జగన్‌ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. మూడు రాజధానుల కోసం చట్టం చేసే శాసనాధికారం ప్రభుత్వానికి లేదు. అమరావతి కోసం భూములిచ్చిన అధికశాతం మంది రెండెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులే. రాజధాని కోసం జీవనాధారాన్ని వదులుకున్నారు. రాజధాని నిర్మాణంతో చట్టబద్ధమైన నిరీక్షణ ఫలితం దక్కుతుందనే భూములు ఇచ్చారు. మూడు రాజధానుల నిర్ణయంతో వారి హక్కులకు భంగం వాటిల్లుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. రాజధానులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మూడు కమిటీలు భూములిచ్చిన రైతుల వాదనను వినలేదు. ఏకపక్షంగా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. వాటికి చట్టబద్ధత లేదు. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్ని శాసనమండలి ఛైర్మన్‌ సెలక్ట్‌ కమిటీకి సిఫారసు చేశాక వాటిని రెండోసారి చట్టసభల్లో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధం’ అన్నారు. మరో న్యాయవాది ఉన్నం శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. అధికారంలో ఉన్న పార్టీ మారడం తప్ప.. రాజధాని మార్పునకు ఏ ఇతర కారణం లేదన్నారు. రాజకీయ కారణాలతో రాజధానుల మార్పు సరికాదన్నారు. భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా, అభివృద్ధి లేని అమరావతిలో ప్లాట్లు ఇచ్చి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.


ప్రభుత్వ వాదన అర్థం లేనిది: సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు

మరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు పానకాలరెడ్డి, మరికొందరు వేర్వేరుగా వేసిన వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాజధాని నిర్మాణం కోసం అధ్యయనం చేసేందుకు విభజన చట్టం నిబంధనలకు అనుగుణంగా శివరామకృష్ణన్‌ కమిటీని వేశారు. అరు నెలల్లోపు ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. రాజధాని నగర నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వానికి వదిలేసింది. ఈ నేపథ్యంలో అమరావతిని అప్పటి ప్రభుత్వం రాజధానిగా నిర్ణయించింది. అమరావతిని రాజధానిగా ప్రకటించడం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలవారు అసంతృప్తితో ఉన్నారని, అందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పడం సరికాదు. అలాంటి అసంతృప్తి ఉంటే అప్పట్లోనే కోర్టులను ఎందుకు ఆశ్రయించలేదు? మూడు రాజధానుల చట్టాన్ని సవాలు చేస్తూ ఇప్పుడే ప్రజలు ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు? అమరావతి తమదనే భావన ఇతర ప్రాంత ప్రజలకు కలగడం లేదని ప్రభుత్వం చెప్పడం అర్థం లేని వాదన. దేశ ప్రజలందరికీ ఒకే రాజధాని ఉంది. దాన్ని అందరూ అంగీకరించడం లేదా? అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని దుష్ప్రచారం చేశారు. ఆ కేసులను న్యాయస్థానాలు కొట్టేశాయి. 33వేల ఎకరాల్ని భూ సమీకరణ కింద రాజధాని కోసం రైతులు ఇచ్చిన సందర్భం దేశంలో ఇదే మొదటిది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పిల్లి తన పిల్లల్ని ఇంటింటికీ మార్చినట్లు రాజధానిని మార్చడానికి వీల్లేదు. అక్బర్‌, తుగ్లక్‌ చక్రవర్తులు రాజధానులు మార్చి, మళ్లీ పాత రాజధానికే వచ్చినట్లు చరిత్రలో ఉంది. అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో తొందర పడిందని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. మరి ఇప్పటి ప్రభుత్వం చేస్తోందేంటి? వికేంద్రీకరణ బిల్లుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదా? న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరిస్తూ మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ హడావుడిగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదా? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దుచేయాలనే హడావుడి ప్రభుత్వ ప్రతి చర్యలో కనబడింది. రాజధాని విషయంలో పెడార్థాలు తీస్తూ బహుళ రాజధానులు ఉండొచ్చని ప్రభుత్వం చెబుతోంది. సీఆర్‌డీఏ చట్టం చేసేటప్పుడు అప్పటి ప్రభుత్వం ఇతర ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేదని శాసనసభ వ్యవహారాల్ని తప్పు పట్టేలా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అప్పట్లో కౌంటర్‌ దాఖలు చేయడానికి ఎంత ధైర్యం? శాసనాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనేదాన్ని చట్ట సభలే పునఃసమీక్షిస్తాయి. లేదా న్యాయస్థానాలు ఆ విషయాన్ని తేలుస్తాయి. అంతేతప్ప ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి చట్టసభలు చేసిన శాసనాలపై అభ్యంతరం చెప్పడం సరికాదు’ అన్నారు. ఆయన వాదనల కొనసాగింపునకు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని