Chandrababu: పన్నులు, ధరలపై సామాన్యునికి అండగా పోరాటం

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పన్నులు, నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీలను తగ్గించేవరకు సామాన్యునికి అండగా పోరాటం చేస్తామని ప్రతిపక్షనేత, తెదేపా అధినేత...

Updated : 19 Nov 2021 04:37 IST

ప్రతిపక్షనేత చంద్రబాబు స్పష్టీకరణ
తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ర్యాలీ

‘ప్రజాకంటక ప్రభుత్వం నశించాలి’ అనే బ్యానర్‌ పట్టుకుని అసెంబ్లీ వరకు నడచి వెళుతున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పన్నులు, నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీలను తగ్గించేవరకు సామాన్యునికి అండగా పోరాటం చేస్తామని ప్రతిపక్షనేత, తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేేశాల సందర్భంగా ఆయన గురువారం తొలుత వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వెలగపూడి అసెంబ్లీ సమీపంలోని మారుతి షోరూం చేరుకుని అక్కడి నుంచి తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ‘ప్రజాకంటక ప్రభుత్వం నశించాలి’ అని రాసున్న ఫ్లెక్సీతో అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, చినరాజప్ప, అనగాని సత్యప్రసాద్‌, ఆదిరెడ్డి భవాని, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, చిక్కాల రామచంద్రరావు, బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ‘పెట్రోలు, డీజిల్‌ ధరలు, విద్యుత్తు ఛార్జీల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉపాధి అవకాశాలూ తగ్గిపోవడంతో సామాన్యులు చితికిపోతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. పెంచిన పన్నులు, ధరలను తగ్గించేవరకు పోరాటం చేస్తాం’ అని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని