Heavy Rain: ‘కొండ’పోత
భారీ వర్షాలతో తిరుపతి, తిరుమల అతలాకుతలమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపించాయి. చరిత్రలో లేని విధంగా ఎగువ ప్రాంతాలనుంచి వరద వస్తుండటంతో తిరుపతిలోని దాదాపు అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. నలువైపులనుంచి వరద ఇంకా వస్తూనే ఉంది. మోకాలి ....
తిరుపతి, తిరుమలను ముంచెత్తిన వానలు
వాగులను తలపించిన రహదారులు
అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి
కడప, నెల్లూరు జిల్లాల్లోనూ బీభత్సం
తిరుపతి.. ఎయిర్‌బైపాస్ రోడ్డులో వరద
భారీ వర్షాలతో తిరుపతి, తిరుమల అతలాకుతలమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపించాయి. చరిత్రలో లేని విధంగా ఎగువ ప్రాంతాలనుంచి వరద వస్తుండటంతో తిరుపతిలోని దాదాపు అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. నలువైపులనుంచి వరద ఇంకా వస్తూనే ఉంది. మోకాలి లోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వరదను బయటకు తీసుకెళ్లే కాలువల స్థాయి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. తిరుపతితో పాటు చిత్తూరు జిల్లావ్యాప్తంగానూ భారీ వర్షాలు భయపెట్టిస్తున్నాయి. కడప, నెల్లూరు జిల్లాల్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
తిరుమల శ్రీవారి మాడ వీధుల్లో భారీ వరద
ఈనాడు డిజిటల్, తిరుపతి-న్యూస్‌టుడే బృందం:కుండపోత వానతో తిరుపతి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తిరుపతిలోని శివజ్యోతినగర్, మంగళం, పద్మావతిపురం, శ్రీనివాసపురం, శ్రీపురం, లక్ష్మీపురం కాలనీలను వరద చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లన్నీ మునిగాయి. శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోకి వరద చేరింది. రైల్వే అండర్‌బ్రిడ్జిల వద్ద భారీగా నీరు చేరడంతో మూసేసి ట్రాఫిక్ మళ్లించారు. స్థానిక డీమార్ట్ వద్ద ప్రజలు తాడు సాయంతో అతికష్టమ్మీద రహదారి దాటాల్సి వచ్చింది. పలు కాలనీల్లో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి వస్తువులు మునిగాయి. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాత్రికి వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. సీకాం కళాశాల వద్ద మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరిన వాహనదారులు మూడు కి.మీ.దూరంలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరడానికి ఐదు గంటల సమయం పట్టింది. లక్ష్మీపురంలో 4.30కు బయలుదేరిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కి.మీ.దూరంలోని అన్నమయ్య కూడలికి వేర్వేరు మార్గాల్లో వెళ్లాల్సి వచ్చింది. రాత్రి 7.30కు కూడా బస్సు రాక పిల్లల తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ నిరీక్షించారు. తిరుపతి ఎస్వీయూలో భారీ వృక్షాలు కూలడంతో హెచ్‌టీ విద్యుత్తు లైన్లు తెగిపోయాయి. రామచంద్రాపురం- తిరుపతి మధ్య వాగులు భారీగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచాయి. నగరంలోని ప్రజలెవరూ ఇంటినుంచి బయటకు రావద్దని అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు హెచ్చరించారు.
తిరుమల కనుమ రహదారిలో విరిగిపడ్డ కొండచరియలు
పద్మావతి మహిళా వర్సిటీ వద్ద వరద
తిరుపతి కపిలతీర్థం వద్ద కొండకోనలనుంచి ఉద్ధృతంగా వస్తున్న వరద నీరు
చిత్తూరు జిల్లాలోనూ వర్షభయం
తిరుపతి సమీపంలోని ఎన్టీఆర్, కల్యాణి డ్యాంలలోకి భారీగా వరద వస్తుండడంతో గేట్లు ఎత్తివేశారు. 30ఏళ్ల తరువాత కల్యాణి డ్యాం మూడో గేటును కూడా తెరిచి 10వేల క్యూసెక్కులను వదిలారు. దీంతో కల్లేటి వాగు, సువర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చిత్తూరు జిల్లావ్యాప్తంగా పలు చెరువులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పీలేరు బస్టాండు మునిగింది. గురువారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 9గంటల వ్యవధిలో జిల్లాలో సగటు వర్షపాతం 7.2 సెం.మీ.గా నమోదైంది. చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి, పూతలపట్టు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల ముందే జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీనికి భిన్నంగా కొన్ని ప్రైవేటు విద్యాలయాలను నడపడంతో విద్యార్థులు ముంపులో అవస్థలు పడ్డారు.
వరద నీటితో నిండిపోయిన తిరుమల క్యూ కాంప్లక్స్
* తిరుపతి గ్రామీణ మండలం హరిపురం, జనార్ధన, నలందానగర్, నెహ్రూ కాలనీలు నీటి మునిగాయి. పేరూరు చెరువు నుంచి కాలనీల మీదకు వరద ముంచుకొచ్చింది. తిరుచానూరు సమీపంలోని నక్కల కాలనీ నీటమునగడంతో తమనెవరూ పట్టించుకోవడం లేదంటూ స్థానికులు పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో జాతీయరహదారిపై భారీగా వాహనాలు నిలిచాయి. శ్రీకాళహస్తి మండలం కొత్తూరు, కుంటిపూడి గ్రామాలు మునిగాయి. కుప్పం పరిధిలో వందలాది ఎకరాల్లో వరి నేలకొరిగింది.
చిత్తూరు-బలిజకండ్రిగ మార్గంలో వాగు దాటుతున్న విద్యార్థులు
* చిత్తూరులో ప్రైవేటుస్కూల్ బస్సు దొడ్డిపల్లి రైల్వే దిగువ వంతెనలో నిలిచిన నీళ్లలో చిక్కుకుంది. అప్రమత్తమైన స్థానికులు 20 మంది చిన్నారులను రక్షించారు. పాలసముద్రం కళాశాల విద్యార్థులు స్వగ్రామాలను చేరే దారి లేనందున అధికారుల బృందం వారిని ప్రత్యేక వాహనంలో తమిళనాడు మీదుగా తరలించారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలోకి నీరు చేరింది. తిరుమలలో మ్యూజియం వెనకవైపు నుంచి వస్తున్న వరద నాలుగు మాడవీధులను ముంచెత్తి బురద పేరుకుపోయింది. అదనపు ఈవో, జేఈవో బంగ్లాలు, క్యూలైన్లలోకి నీరు చేరింది. సర్వర్రూమ్లోకి నీరు చేరడంతో సర్వర్‌ను ఆపి మాన్యువల్‌గా టికెట్లను పరిశీలించారు. కనుమ మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో సాయంత్రం 4.30 నుంచి కొండపైకి భక్తుల రాకపోకలు నిలిపేశారు. నడకదారులను శుక్రవారం కూడా మూసేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. వర్షాలతో కొన్ని టెలికాం నెట్వర్కులు పనిచేయక భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
20 మంది పిల్లలతో ఉన్న స్కూలు బస్సు చిత్తూరు జిల్లా దొడ్డిపల్లి రైల్వే వంతెన కింద నీటిలో చిక్కుకోవడంతో బయటకు లాగుతున్న అగ్నిమాపక సిబ్బంది
నారావారిపల్లిలోని మాజీ సీఎం చంద్రబాబు నివాస ప్రాంగణంలో వరద నీరు
కడప జిల్లాలో భారీ వర్షం
కడప జిల్లాలో ప్రధాన నదులు పాపఘ్ని, చెయ్యేరు, బహుద, పెన్నా, బుగ్గవంక నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వెలిగల్లు, పీబీఆర్, అన్నమయ్య, పింఛ, మైలవరం జలాశయాల గేట్లు ఎత్తి నదులకు నీటిని విడుదల చేశారు. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కల్వర్టులు, రహదారులు కోతకు గురికావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కడపలోని ప్రకాష్‌నగర్, మృత్యుంజయకుంట, భరత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. స్థానికులు కొందరు సొంతంగా ఖాళీ నీటి క్యాన్లతో తెప్పలు తయారుచేసుకొని వాటిపై రాకపోకలు సాగిస్తున్నారు. బుగ్గవంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సమీప కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. నాగరాజుపేటలోని పలు నివాసాల్లోకి నీరు చేరింది. రైల్వేకోడూరు మండలం బాలపల్లె సమీపంలో కడప- చెన్నై ప్రధాన రహదారిని వరదనీరు ముంచెత్తింది. తిరుపతి వైపు వెళుతూ వరదలో చిక్కుకున్న కారును అధికారులు ఒడ్డుకు చేర్చారు.
కడప జిల్లా రైల్వేకోడూరు-తిరుపతి మధ్య బాలపల్లె వద్ద జాతీయ రహదారిపైకి దూకుతున్న వరద నీరు
నెల్లూరులో పొంగి పొర్లుతున్న వాగులు
నెల్లూరు జిల్లాలోని పంబలేరు, కేతామన్నేరు, బొగ్గేరు, బీరాపెరు, అల్లూరు, సంగం వద్ద కొమ్మలేరు, నక్కల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కాజ్‌వేలపైకి నీరు రావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. సోమశిలలో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1.35 లక్షల క్యూసెక్కులు ఉంది. దాంతో జలాశయం 10 గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కులను వదిలారు. సూళ్లూరుపేటలో దొండ్ల కాలువ పొంగిపొర్లడంతో దాదాపు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. చేజర్ల మండలం యనమదల వద్ద నల్లవాగు వంతెనపై అయిదడుగుల మేర వరద ప్రవహిస్తోంది. మర్రిపాడు మండలంలో పొంగి ప్రవహిస్తున్న కేతామన్నేరు, బొగ్గేరు వరద రోడ్డుపైకి రావడంతో 13 గ్రామాలకు అంతరాయం కలిగింది.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సన్నోరుపల్లిలో నీట మునిగిన మిరప పంట
విమానాలు వెనక్కి..!
పలు ప్రాంతాల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు వాతావరణం అనుకూలించక తిరిగి వెళ్లాయి. కొన్నింటిని బెంగళూరుకు మళ్లించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు
సహాయ చర్యలకు కార్యాచరణ సిద్ధం చేయండి: సీఎం
ఈనాడు, అమరావతి: భారీ వర్షాల నేపథ్యంలో సహాయ చర్యల కోసం అన్ని శాఖలు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయ శిబిరాల్లోని వారికి అన్ని వసతులు కల్పించాలని, ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున తక్షణ సాయం అందించాలని చెప్పారు. వర్ష ప్రభావిత ప్రాంతాలకు తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా రాజీపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, సహాయ చర్యలపై గురువారం సమీక్షించారు. తిరుపతిలో పరిస్థితిపై ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ప్రభావం అధికంగా ఉన్న చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ‘చెరువులు, జలాశయాల్లో ఎప్పటికప్పుడు నీటి మట్టాలను గమనిస్తుండాలి. ముఖ్యంగా శాఖాధిపతులు అప్రమత్తంగా ఉండాలి. తిరుపతిలో సహాయ చర్యలకు అవసరమైన మేర సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి. రాష్ట్ర, జాతీయ విపత్తు సహాయదళాల సేవలను ఉపయోగించుకోవాలి. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలు అందించండి, ఏ సహాయం అవసరమైనా తెలియజేయండి, నిరంతరం అందుబాటులో ఉంటాను’ అని సీఎం సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Asia Cup 2023: ‘వారు నరకానికి పోవాలనుకోవడం లేదు’’..: వెంకటేశ్ ప్రసాద్
-
General News
KTR: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అత్యవసర విచారణకు సీజేఐకి విజ్ఞప్తి
-
World News
Mumbai terror attacks: 2008 ఉగ్రదాడి గాయం గుర్తులు ఇంకా మానిపోలేదు: అమెరికా
-
Politics News
Balasaheb Thorat: మహారాష్ట్రలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. పార్టీ పదవికి థోరట్ రాజీనామా!
-
Sports News
IND vs AUS: నాగ్‌పుర్‌లో ‘టెస్టు’ రికార్డులు.. ఆధిక్యం ఎవరిదంటే..?