Updated : 22 Nov 2021 05:28 IST

AP News: మూడు ముక్కలు కానీయం

అమరావతికి భాజపా సంపూర్ణ మద్దతు
అన్ని జిల్లాల్లో యాత్రలో పాల్గొంటాం: భాజపా నేతలు
మహాపాదయాత్రకు తరలివచ్చిన మహిళలు, వృద్ధులు
21వ రోజు 15 కిలోమీటర్లు సాగిన యాత్ర

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: అమరావతే రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు ముక్కలు కానీయబోమని భాజపా నేతలు పునరుద్ఘాటించారు. మహాపాదయాత్ర 21వ రోజు నెల్లూరు జిల్లా కావలిలో భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి పురందేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌, మాజీమంత్రులు కామినేని శ్రీనివాస్‌, రావెల కిషోర్‌బాబు, ఆదినారాయణరెడ్డితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. తొలుత విజయవాడ నుంచి గుంటూరు జిల్లా కాజ టోల్‌గేటు మీదుగా నాయకులంతా కలిసి నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఇక్కడ రైతులకు సంఘీభావం తెలిపి వారితోపాటు నడిచారు.

పురందేశ్వరి మాట్లాడుతూ అమరావతిలో రాజధాని కొనసాగాలని రెండేళ్ల కిందటే నిర్ణయం తీసుకున్నామని, తాజాగా తిరుపతిలో ఇదే విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించామన్నారు. రైతులపై లాఠీఛార్జీ దుర్మార్గమన్నారు. రాయలసీమలోకి రైతులను రానీయబోమంటున్నట్లు తెలిసిందని, రైతులకు అండగా భాజపా శ్రేణులు వస్తారని భరోసా ఇచ్చారు. సోము వీర్రాజు మాట్లాడుతూ అమరావతికి భాజపా సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలోనూ పాదయాత్రకు మద్దతు అందిస్తామన్నారు. ఎంపీ సీఎం రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని అని, ముఖ్యమంత్రులు మారొచ్చు కానీ, రాజధాని మారదన్నారు. హైకోర్టు బెంచ్‌ ఎక్కడైనా పెట్టుకోవచ్చని, అమరావతి నుంచి హైకోర్టును మార్చే ప్రసక్తే లేదన్నారు. రెండున్నరేళ్లుగా పోలీసులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని, వారి ఆటలు ఇక సాగవన్నారు. మరో ఎంపీ సుజనాచౌదరి మాట్లాడుతూ రాజధాని అమరావతి రాష్ట్రంలోని 13 జిల్లాలదన్నారు. రైతులకు న్యాయం ఆలస్యం కావచ్చు కానీ ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లదని భరోసా ఇచ్చారు. పాదయాత్ర దేవస్థానం చేరేలోపే సీఎం జగన్‌ మెడలు వంచైనా రాజధానిపై ప్రకటన చేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రజలు మర్చిపోరన్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పిన జగన్‌ ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. రైతుల పాదయాత్రకు వెళుతున్నానని తెలిసి ముగ్గురు కుటుంబసభ్యులు రూ.15లక్షలు ఇచ్చారంటూ ఆ మొత్తాన్ని ఐకాస నేతలకు అందజేశారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జగన్‌రెడ్డి విశాఖలో భూములు కబ్జా చేశారన్నారు. న్యాయపరంగానే అమరావతిని సాధించి తీరుతామని చెప్పారు.

 


Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని