Updated : 22 Nov 2021 05:55 IST

AP News: కుప్పకూల్చిన వాన

భయపెడుతున్న వరద
కొట్టుకుపోయిన వంతెనలు.. ధ్వంసమైన రోడ్లు
16వ జాతీయ రహదారిపై రాకపోకలకు ఆటంకం
తిరుపతి సమీపంలోని రాయలచెరువుకు గండి
కట్టుబట్టలతో పునరావాస ప్రాంతాలకు బాధితులు
4 జిల్లాల్లో 1,366 గ్రామాలపై ప్రభావం
నెల్లూరు జిల్లాలో 44,275 మంది సహాయశిబిరాలకు తరలింపు
దెబ్బతిన్న వరి, మెట్ట పంటలు

వరద ధాటికి వంతెనలు కుప్పకూలుతున్నాయి.. రోడ్లు కొట్టుకుపోతున్నాయి.. రైలు పట్టాలు తేలియాడుతున్నాయి.. ఊర్లు ఏరులవుతున్నాయి.. పల్లెలు, పట్టణాలు వణుకుతున్నాయి.. భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంట, ఆస్తి నష్టాలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. చెన్నై-కోల్‌కతా మార్గంలో నెల్లూరు దాటాక దామరమడుగు వద్ద 16వ నంబరు జాతీయ రహదారి ఓ వైపు కొట్టుకుపోయింది. నెల్లూరు జిల్లా పడుగుపాడు సమీపంలో ట్రాక్‌ మీదకు నీరు రావడంతో పలు రైళ్లను నిలిపేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో రాయల చెరువుకు లీకేజీ ఏర్పడి వంద గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. తిరుపతి నగరం వరద నుంచి ఇంకా కోలుకోలేదు. కడప జిల్లాలోని పాపఘ్ని నదిపై వంతెన కుప్పకూలింది.


పెరుగుతున్న వరద నష్టం

ఈనాడు, అమరావతి: వానలు వదలడం లేదు. వరద నష్టం అంతకంతకూ పెరుగుతోంది. ఎగువ నుంచి వరదనీరు పోటెత్తుండటంతో దిగువన ముంపు ఎక్కువవుతోంది. రాయలసీమ నుంచి వచ్చే వరదతో నెల్లూరు జిల్లాలోని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో వ్యవసాయ పంటల నష్టం 12 వేల ఎకరాల మేర పెరిగింది. మిగిలిన జిల్లాల్లోనూ క్రమంగా పెరుగుతోంది. నెల్లూరు, చిత్తూరు, కడప,  అనంతపురం జిల్లాల్లో మొత్తం 172 మండలాల్లోని 1,316 గ్రామాలపై వరద ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం శనివారం పేర్కొంది. ఆదివారం నాటికి ఇది 181 మండలాల్లోని 1,366 గ్రామాలకు చేరిందని ప్రకటించింది. పునరావాస కేంద్రాల్లోని వారికి ఒక్కొక్కరికి రూ.1,000, కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 వేల చొప్పున అందిస్తున్నట్లు తెలిపింది.

వరద ప్రభావిత గ్రామాల్లో కుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటరు పామాయిల్‌, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లి, బంగాళదుంపలు పంపిణీ చేయాలని రెవెన్యూ (విపత్తు నిర్వహణ)శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.  

నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మొత్తం 2,007 ఇళ్లు దెబ్బతిన్నాయి. 1,131 ఇళ్లు నీట మునిగాయి. రహదారులు భవనాలశాఖ పరిధిలో 2వేల కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్‌ పరిధిలో 1,736 కి.మీ. రహదారులు కోతకు గురయ్యాయి.

పెన్నా నీటి ప్రవాహం కారణంగా  నెల్లూరు జిల్లాలో 29 గ్రామాల్లోని ప్రజలను పడవల సాయంతో తరలించారు. కోవూరు పట్టణంపై తీవ్ర ప్రభావం పడింది. నెల్లూరులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కలెక్టరేట్‌తోపాటు నగరపాలక సంస్థలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 92 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేసి 44,275 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలాది ఎకరాల పంటపొలాలు నీటమునిగాయి. రహదారులు తెగిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆదివారం వెంకటేశ్వరపురం వద్ద జాతీయ రహదారి-16 కోతకు గురవడంతో పోలీసులు మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. జిల్లాలో 1,078 చెరువులు పూర్తిగా నిండటంతో గండ్లు పడకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు కృష్ణపట్నం నుంచి పడవలను తెప్పిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లాలో 83 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 9,301 మందిని తరలించారు.

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు చర్యలు

నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణకు ఎస్‌పీడీసీఎల్‌ సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ చెప్పారు. వీలైనంత త్వరగా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడానికి సిబ్బంది, సామగ్రిని తక్షణమే సమకూర్చుకోవాలని సూచించారు. వరదనీరు తగ్గిన తర్వాత 24 గంటల్లో గ్రామాలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తామని ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు తెలిపారు.

వదలని వాన

శని, ఆదివారాల్లో అనంతపురం, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉ. 8.30 గంటల మధ్య అత్యధికంగా అనంతపురం జిల్లా బొమ్మనహళ్‌లో 10.9, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురంలో 10.4, ప్రకాశం జిల్లా ఉలవపాడులో 8.6 సెం.మీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల మధ్య.. గుంటూరు జిల్లా బాపట్లలో 7.8, పొన్నూరు మండలం ములుకుదురులో 7.3సెం.మీ వర్షపాతం నమోదైంది. వేల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పడిపోయింది. పత్తి, మిరప చేలలో నీరు నిలిచింది.

నేడూ వానలు

క్షిణ అండమాన్‌, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. రాష్ట్రంలో సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు.


ఆ జిల్లాల్లో మళ్లీ అతి భారీ వర్షాలు
26 నుంచి డిసెంబరు 2 వరకూ..

ఈనాడు, అమరావతి: నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 26 నుంచి డిసెంబరు 2 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ‘దక్షిణ అండమాన్‌ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తక్కువ ట్రోపోస్పియరిక్‌ స్థాయిల్లో సర్క్యులేషన్‌ ఉంది. రాబోయే నాలుగైదు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది’ అని పేర్కొంది.


కుప్పకూలిన పాపఘ్ని నది వంతెన

కమలాపురం, వల్లూరు, న్యూస్‌టుడే: కడప జిల్లాలోని కమలాపురం, వల్లూరు మధ్యలో పాపఘ్ని నదిపై నిర్మించిన వంతెన ఆదివారం కుప్పకూలింది. దీన్ని 45 ఏళ్ల కిందట 550 మీటర్ల పొడవున ఓపెన్‌ ఫౌండేషన్‌ పద్ధతిలో నిర్మించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వెలిగల్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో వంతెన శనివారం రాత్రి కుంగింది. ఆదివారం ఉదయానికి ఆరు పిల్లర్లు, ఏడు శ్లాబ్‌లు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గంలో రోజూ దాదాపు 20 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.


పాల కోసం.. పాపం దూడ

మ్మ లేదని.. ఇక పాలివ్వలేదని ఆ లేగదూడకు తెలియదు. వరదనీటిలో మునిగి విగతజీవిగా మిగిలిన తల్లి వద్దకు వచ్చి... ఆకలి తీర్చుకోడానికి పాలు తాగాలని ప్రయత్నించింది. కడప జిల్లాను ముంచెత్తిన వరదలతో.. రాజంపేట మండలం మందపల్లిలో ఈ పాడిగేదె మృతిచెందింది. దూడ మాత్రం ప్రాణాలతో మిగిలి, తల్లిపాల కోసం ఇలా రావడం.. అందరినీ కంటతడి పెట్టించింది.

- న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణRead latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని