SECI: సెకి నుంచి కొంటే షాకే..

టెండర్లు లేవు.. రివర్స్‌ టెండరింగ్‌ ఊసే లేదు.. ‘వేరే రాష్ట్రంలో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. అవి యూనిట్‌ కరెంటు రూ.2.49కి ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. 2024 సెప్టెంబరు నుంచి విద్యుత్‌ సరఫరా మొదలవుతుంది. పాతికేళ్లకు మీరు మాతో ఒప్పందం చేసుకోండి’

Updated : 26 Nov 2021 04:52 IST

యూనిట్‌ విద్యుత్‌ రూ.1.99కే కొనేందుకు అల్‌జొమాయ్‌తో గుజరాత్‌ ప్రభుత్వం ఒప్పందం
సెకి నుంచి రూ.2.49కి కొనేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంపై ఏడాదికి రూ.850 కోట్ల భారం
పాతికేళ్లలో రూ.21,250 కోట్ల పైమాటే

మార్కెట్‌లో యూనిట్‌ సౌర విద్యుత్‌ రూ.2కే దొరుకుతున్నప్పుడు.. యూనిట్‌ రూ.2.49కి కొనడం విజ్ఞతేనా?

ఒకే సంస్థ యూనిట్‌ విద్యుత్‌ను రూ.2కి, రూ.2.37కి కొంటూ.. మీకు రూ.2.49కే ఇస్తున్నామంటే మారుమాట లేకుండా ఒప్పేసుకుంటారా?

ఆ సంస్థ ఏ ధరలకు కొంటోందో పోల్చి చూసి, మాకూ సరసమైన ధరకు ఇవ్వండని బేరమాడాల్సిన పని లేదా?

భవిష్యత్తులో ధరలు ఇంకా తగ్గుతాయని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు... రెండేళ్ల క్రితం టెండర్ల ఆధారంగా ఖరారు చేసిన ధరల ప్రకారం మీకు ఇస్తామంటే సరేననడమేనా?

ఈనాడు - అమరావతి

టెండర్లు లేవు.. రివర్స్‌ టెండరింగ్‌ ఊసే లేదు.. ‘వేరే రాష్ట్రంలో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. అవి యూనిట్‌ కరెంటు రూ.2.49కి ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. 2024 సెప్టెంబరు నుంచి విద్యుత్‌ సరఫరా మొదలవుతుంది. పాతికేళ్లకు మీరు మాతో ఒప్పందం చేసుకోండి’ అని భారత సౌర విద్యుత్‌ సంస్థ (సెకి) ఈ ఏడాది సెప్టెంబరు 15న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మరో ఆలోచన లేకుండా మర్నాడే దానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. సౌర విద్యుత్‌ ప్యానళ్ల తయారీ వ్యయం దిగివస్తుండటంతో సౌర విద్యుత్‌ ధరలూ వేగంగా తగ్గుతున్నాయి. రూ.2కే యూనిట్‌ విద్యుత్‌ విక్రయించేందుకు ఉత్పత్తి సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. గుజరాత్‌ ప్రభుత్వ సంస్థ గుజరాత్‌ ఊర్జ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (జీయూవీఎన్‌ఎల్‌) యూనిట్‌ రూ.1.99కి కొనేందుకు అల్‌జొమాయ్‌ ఎనర్జీ, వాటర్‌ కంపెనీతో ఈ ఏడాది జనవరి 30న ఒప్పందం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా, సంస్థయినా.. మార్కెట్‌లో ఎంత తక్కువ ధరకు విద్యుత్‌ దొరుకుతుందో అధ్యయనం చేస్తుంది. ఎక్కడో రాజస్థాన్‌లో ప్లాంట్లు పెట్టి, మన రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరా చేయడంలోని సాధకబాధకాల్ని ఆలోచిస్తుంది. మా దగ్గరే ప్లాంట్లు పెట్టి తక్కువ ధరకు విద్యుత్‌ ఇమ్మని కోరుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా.. సెకి చెప్పగానే రాజస్థాన్‌లోని ప్లాంట్ల నుంచి ఏడు వేల మెగావాట్ల కరెంటు కొనేందుకు ఒప్పందం చేసుకోబోతోంది. ఏడాదికి 1,700 కోట్ల యూనిట్ల విద్యుత్‌ కొనేందుకు ఏపీఈఆర్‌సీ కూడా పచ్చజెండా ఊపింది.

రాష్ట్రంలో 6,400 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (ఏపీజీఈఎల్‌) 2020 జూన్‌లో టెండర్లు పిలిచింది. ఎన్‌టీపీసీ, అదానీ వంటి పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. యూనిట్‌కు కనిష్ఠంగా రూ.2.48 నుంచి గరిష్ఠంగా రూ.2.58 కోట్‌ చేశాయి. కొన్ని సంస్థలకే లబ్ధి చేకూర్చేలా నిబంధనలు పెట్టారంటూ కొందరు కోర్టుకెళ్లడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దాంతో రివర్స్‌ టెండరింగ్‌కూ వెళ్లలేదు. టెండర్ల ప్రక్రియలో లోపాలుంటే రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవాలి. కేవలం సెకి ప్రతిపాదన ఆధారంగా ఏడు వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు పాతికేళ్లపాటు ఒప్పందం చేసుకోవడమంటే.. నామినేషన్‌ పద్ధతిపై ఇచ్చినట్టే. రూ.100 కోట్లు దాటిన ప్రతి పనికీ రివర్స్‌ టెండరింగ్‌కి వెళతామన్న ప్రభుత్వం.. అసలు టెండరే లేకుండా సెకితో ఏకంగా రూ.1,05,825 కోట్ల విలువైన ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవడంలో అంతరార్థం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మనకు యూనిట్‌ రూ.2.49కి అమ్ముతామంటున్న సెకి.. ఇటీవల వివిధ విద్యుదుత్పత్తి సంస్థలతో యూనిట్‌ రూ.2కే కొనేందుకు ఒప్పందాలు చేసుకుంది. సెకి ట్రేడింగ్‌ మార్జిన్‌ యూనిట్‌కు 5-7 పైసలు కలిపినా కూడా రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌ రూ.2.05కో, రూ.2.07కో కొనాలే తప్ప.. రూ.2.49కి కొనడమేంటి?

* ‘మేం ట్రాంచ్‌-2, 3, 4ల్లో సౌర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ కొనేందుకు 2019 నవంబరులో టెండర్లు పిలిచాం. 2019 డిసెంబరు నుంచి 2020 జూన్‌ మధ్య ఒప్పందాలు చేసుకున్నాం. 2024 సెప్టెంబరులో 3 వేలు, 2025 సెప్టెంబరులో 3 వేలు, 2026 సెప్టెంబరులో 3 వేలు మెగావాట్ల చొప్పున ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఆ సంస్థలు విద్యుత్‌ను గంపగుత్తగా కొనేవాళ్లకు ధర తగ్గించి ఇస్తామంటున్నాయి. యూనిట్‌ రూ.2.49కే సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయి. ఆ మొత్తం మీరే కొనుక్కోండి’ అని సెకి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. 2019 నవంబరులో పిలిచిన  టెండర్ల ప్రకారం.. 2024, 2025, 2026ల్లో విద్యుదుత్పత్తి చేసే సంస్థలతో మూడు నుంచి అయిదేళ్ల ముందే యూనిట్‌ రూ.2.49కి కొనేందుకు   ఒప్పందాలు చేసుకోవడమేంటి? రాబోయే రెండు మూడేళ్లలో యూనిట్‌ సౌరవిద్యుత్‌ ధర రూ.1.50కి తగ్గొచ్చన్న అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు?

తయారీ సంస్థలకే లబ్ధి!

సెకీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే మధ్యవర్తి సంస్థ మాత్రమే. విద్యుత్‌ ఒప్పందాలు కుదర్చడం వల్ల దానికి 5 నుంచి 7 పైసల వరకు ట్రేడ్‌ మార్జిన్‌ దక్కుతుంది. మిగతా మొత్తం విద్యుదుత్పత్తి సంస్థలకే వెళుతుంది. అంటే ఒప్పందంతో ఏపీ అదనంగా చెల్లించే రూ.వేల కోట్లు విద్యుత్‌ ఉత్పత్తిదారులకే వెళతాయి.


వేల కోట్ల భారం పడబోతుందిలా..

* సెకి తమ ట్రేడింగ్‌ ఛార్జీలు కూడా కలిపి యూనిట్‌కు చెప్పిన ధర రూ.2.49  

* యూనిట్‌కు 50 పైసల చొప్పున భారం రూ.850 కోట్లు

* మార్కెట్లో ఇప్పుడున్న సౌరవిద్యుత్‌ కనిష్ఠ ధర కంటే ఇది 50 పైసలు అధికం

* పాతికేళ్లలో కొనబోతున్న విద్యుత్తు 42,500 కోట్ల యూనిట్లు

* రాష్ట్రంపై పడే భారం రూ.21,250 కోట్లు

* ఏడాదికి సెకి నుంచి కొనబోతున్న కరెంటు 1,700 కోట్ల యూనిట్లు

* ఇందుకు వెచ్చించే మొత్తం రూ.1,05,825 కోట్లు.


సౌర విద్యుత్‌ ధరలు తగ్గుతున్న తీరిదీ..

* 2020 జనవరి 3: 1200 మెగావాట్ల సౌరవిద్యుత్‌ కొనేందుకు సెకి టెండర్లు పిలిచింది. యూనిట్‌కు రూ.2.61 నుంచి రూ.2.76 మధ్య ధరలు కోట్‌ చేస్తూ 11 సంస్థలు టెండర్లు వేశాయి. ఫిబ్రవరి 27న సెకి ఈ-రివర్స్‌ ఆక్షన్‌ నిర్వహించి, యూనిట్‌ రూ.2.50కి సరఫరా చేసేంద]ుకు మూడు సంస్థలతోనూ, రూ.2.51కి ఒక సంస్థతోనూ ఒప్పందం చేసుకుంది.

* 2020 మార్చి 20: 2000 మెగావాట్లు కొనేందుకు సెకి టెండర్లు పిలిస్తే 11 సంస్థలు పోటీపడ్డాయి. యూనిట్‌కు  రూ.2.52 నుంచి రూ.2.65 వరకు   కోట్‌ చేశాయి. జూన్‌ 30న సెకి రివర్స్‌ ఆక్షన్‌ నిర్వహించి ఏడు సంస్థలతో ఒప్పందం చేసుకుంది. యూనిట్‌ కనిష్ఠ ధర రూ.2.36, గరిష్ఠ ధర రూ.2.38గా ఖరారు చేసింది.

* 2020 జులై 16: సెకి ట్రాంచ్‌-3 ప్రాజెక్టుల్లో భాగంగా రాజస్థాన్‌లో 1,070 మెగావాట్లు కొనేందుకు టెండర్లు పిలిచింది. 24 సంస్థలు యూనిట్‌కు కనిష్ఠంగా రూ.2.20, గరిష్ఠంగా రూ.2.75 కోట్‌ చేశాయి. నవంబరు 23న రివర్స్‌ ఆక్షన్‌ నిర్వహించింది. యూనిట్‌ రూ.2 చొప్పున కొనేందుకు అల్‌జొమాయ్‌ ఎనర్జీ అండ్‌ వాటర్‌ కంపెనీ, గ్రీన్‌ ఇన్‌ఫ్రా విండ్‌ ఎనర్జీ లిమిటెడ్‌లతోనూ, యూనిట్‌ రూ.2.01 చొప్పున కొనేందుకు ఎన్‌టీపీసీతోనూ ఒప్పందాలు చేసుకుంది.

ఈ టెండర్ల మధ్య ఉన్న వ్యవధి గరిష్ఠంగా ఆరు నెలలే. రీఆక్షన్‌ తేదీల్ని చూసినా.. మొదటి, చివరి టెండర్ల మధ్య వ్యవధి 11 నెలలే. అంత తక్కువ సమయంలోనే సెకి ఖరారు చేసిన యూనిట్‌ ధర రూ.2.51 నుంచి రూ.2కి (51 పైసలు) తగ్గిపోయింది. అలాంటప్పుడు సెకి రెండేళ్ల కిందట పిలిచిన టెండర్ల ఆధారంగా యూనిట్‌ రూ.2.49కి ఇస్తామంటే మనం మరో ఆలోచన లేకుండా కొనేయడమేంటి?


అన్ని లోపాలున్నాయని తెలిసీ..

సెకితో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోబోతున్న ఒప్పందం ఎంత లోపభూయిష్ఠమో, ఎందుకు అన్ని అనుమానాలకు, ఆరోపణలకు తావిస్తుందో తెలియాలంటే... అల్‌జొమాయ్‌ సంస్థతో గుజరాత్‌ ఊర్జ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (జీయూవీఎన్‌ఎల్‌) కుదుర్చుకున్న ఒప్పందంతో బేరీజు వేయాలి.

జీయూవీఎన్‌ఎల్‌ ఒప్పందంలో ముఖ్యాంశాలు

* జీయూవీఎన్‌ఎల్‌ 500 మెగావాట్లకు టెండర్లు పిలిచి, అల్‌జొమాయ్‌తో 80 మెగావాట్లకు 2021 జనవరి 30న ఒప్పందం చేసుకుంది. 2022 జులై 30న ఆ సంస్థ విద్యుత్‌ సరఫరా  ప్రారంభించాలి.

* ఫైనాన్షియల్‌ బిడ్లు తెరిచాక.. రివర్స్‌ ఆక్షన్‌ నిర్వహించి యూనిట్‌కి రూ.1.99కి టెండరు ఖరారు చేసింది. దీనికి నాలుగు నెలలు పట్టింది. ఇంత వరకు కుదిరిన పీపీఏల్లో ఇదే తక్కువ ధర.

* గుజరాత్‌ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ (గెట్‌కో) గ్రిడ్‌కు విద్యుత్‌ను అనుసంధానించే వరకు అయ్యే సరఫరా నష్టాలు, వీలింగ్‌ ఛార్జీలు, ఇతర ఖర్చులను ఉత్పత్తి సంస్థే భరించాలి

సెకితో ఏపీ చేసుకోనున్న ఒప్పందంలో లోటుపాట్లు

* సెకితో ఏపీ చేసుకోనున్న ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబరు నుంచి  2026 సెప్టెంబరు మధ్య విద్యుతుత్పత్తి జరుగుతుంది. అంటే మూడు నుంచి ఆరేళ్ల గడువు. నిబంధన ప్రకారం ఏ సంస్థయినా 15-18 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించాలి.

* ఈ ఏడాది సెప్టెంబరు 15న సెకి నుంచి ప్రతిపాదన వచ్చింది. ఆ మర్నాడే మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. టెండర్‌, రివర్స్‌ ఆక్షన్ల ఊసే లేదు.

* సెకితో తమ ఒప్పందంలో అలాంటి నిబంధన ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతుందో లేదో తెలీదు.


అది ప్రభుత్వ నిర్ణయం: శ్రీకాంత్‌, ఇంధన శాఖ కార్యదర్శి

మార్కెట్‌లో యూనిట్‌ సౌర విద్యుత్‌ కనిష్ఠ ధర రూ.2 ఉండగా, మీరు సెకి నుంచి రూ.2.49కి ఎందుకు కొంటున్నారు? టెండర్లు పిలిచి, రివర్స్‌ టెండరింగ్‌కి వెళితే ధర ఇంకా తగ్గించుకోవచ్చు కదా? అని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ను ‘ఈనాడు’ ప్రశ్నించింది. ‘అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. దీనికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్ర ఇంధనశాఖ నిబంధనల మేరకు సెకి టెండర్లను నిర్వహించింది. సెకి, ఎన్‌టీపీపీ రెండూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే. ప్రస్తుతం ఎన్‌టీపీసీ నుంచి తీసుకునే విద్యుత్‌కు అంతర్రాష్ట్ర విద్యుత్‌ సరఫరా ఛార్జీలను చెల్లిస్తున్నాం. వాటికి మినహాయింపు ఉందని, తన ట్రేడ్‌ మార్జిన్‌ కూడా కలిపి యూనిట్‌ రూ.2.49 ఇస్తామని సెకి చెప్పింది’ అని ఆయన సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని