CAG of India: ఆర్థికం అస్తవ్యస్తం

రాష్ట్రప్రభుత్వ ఆర్థిక విధానాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక తూర్పారబట్టింది. శాసనసభ నియంత్రణ దాటిపోయే స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు ఉంటున్నాయని ఆగ్రహించింది. శాసనసభ ఆమోదమే

Updated : 27 Nov 2021 11:06 IST

రాష్ట్ర బడ్జెట్‌ నిర్వహణ తీరు బాగాలేదు

వచ్చే 7 ఏళ్లలో రూ.1,10,010 కోట్లు అప్పు చెల్లించాలి

వడ్డీలు చెల్లించేందుకు మళ్లీ అప్పులా?

ఖర్చు చేశాక శాసనసభ ఆమోదం రాజ్యాంగ విరుద్ధమే

ఎండగట్టిన కాగ్‌

ఈనాడు - అమరావతి

రాష్ట్రప్రభుత్వ ఆర్థిక విధానాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక తూర్పారబట్టింది. శాసనసభ నియంత్రణ దాటిపోయే స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు ఉంటున్నాయని ఆగ్రహించింది. శాసనసభ ఆమోదమే పొందకుండా అనుబంధ పద్దు మొత్తాలు ఎలా ఖర్చు చేస్తారని నిలదీసింది. అసలు ఇది రాజ్యాంగ నిబంధనలకే విరుద్ధమని హెచ్చరించింది. అప్పుల తీరుతెన్నులను, బడ్జెట్‌లో చూపకుండా అప్పులు చేసి ఖర్చుచేస్తున్న వ్యవహారాలను తప్పుబట్టింది. పీడీ ఖాతాల నిర్వహణతో అసలు వ్యయం చేయకుండానే చేసినట్లు చూపుతున్న పరిస్థితులను ప్రస్తావించింది. పీడీ ఖాతాల పేరుతో శాఖాధిపతులకు నిధులు బదలాయిస్తున్నా, అసలు వారు ఖర్చు చేసుకునేందుకు ఆ నిధులు అందుబాటులో ఉండట్లేదని, ఇదేం విధానమని ప్రశ్నించింది. ఒకవైపు సగటున 6.31% వడ్డీతో అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్రప్రభుత్వం వివిధ కంపెనీలు, కార్పొరేషన్లలో రూ.కోట్ల పెట్టుబడులు పెడుతూ కనీసం 0.04% ప్రతిఫలం కూడా పొందట్లేదని తేల్చిచెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో రుణాలు తీర్చేందుకు ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించే వనరులు మరింత తగ్గిపోతాయని తెగేసి చెప్పింది.2020 మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆడిట్‌ పూర్తయిన పద్దుల ఆధారంగా కాగ్‌ ఈ విశ్లేషణ చేసింది. ఒక నివేదికను వెలువరించింది. ఆ నివేదికను ప్రభుత్వం శుక్రవారం శాసనసభకు సమర్పించింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.

‘ఒకవైపు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రుణాల శాతం పెరిగిపోతోంది. ఏటా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ ఆదాయంలో వడ్డీకి చెల్లించాల్సిన వాటాయే అధికం. గడిచిన అయిదేళ్లలో కొత్తగా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులో 65-81% పాత అప్పు తీర్చేందుకే వినియోగించాల్సి వస్తోంది. అప్పు తీసుకుంటే దాంతో ఆస్తులు సృష్టించాలి. అంటే ప్రభుత్వానికి ఆదాయం అందించే అభివృద్ధి కార్యక్రమాలపై వెచ్చించాలి. రోజువారీ అవసరాలు తీర్చుకునేందుకు, రుణాలపై వడ్డీలు చెల్లించేందుకే మళ్లీ అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. ఈ రుణాలు చెల్లించేందుకు సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అభివృద్ధి పనులకు నిధులు ఉండబోవు’ అని కాగ్‌ సుస్పష్టంగా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

* రాబోయే ఏడేళ్లలోనే రూ.1,10,010 కోట్ల అప్పులను ప్రభుత్వం తీర్చాల్సి ఉంటుందని 2020 మార్చి నెలాఖరు వరకు ఉన్న లెక్కల ప్రకారం కాగ్‌ పేర్కొంది. (ఇందులో ప్రభుత్వ బడ్జెటేతర రుణాలు కలిపి లేవని, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి, గ్యారంటీ ఇవ్వకుండా  తీసుకున్న తాజాగా ఉన్న రూ.2లక్షల కోట్ల రుణాలకు సంబంధించిన చెల్లింపుల వివరాలు లేవని సమాచారం)

* రాష్ట్రం చెల్లించాల్సిన బకాయిలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.32,373 కోట్లు ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇవి 17.20% ఎక్కువ. బడ్జెట్‌ పద్దుకు సంబంధం లేని అప్పులు రూ.26,096.98 కోట్లు. బడ్జెట్‌లో వీటిని చూపలేదు. ఇది శాసనసభ పర్యవేక్షణను నీరుగార్చడమే. కొవిడ్‌ వల్ల లాక్‌డౌన్‌ విధించిన మాట వాస్తవమే అయినా, 2020-21 బడ్జెట్‌ అంచనాలకు ఆర్డినెన్సు ద్వారా గవర్నర్‌ ఆమోదం పొందారు. ఇందులో 2019-20 అనుబంధ పద్దులను చేర్చలేదు.

* రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సర అనుబంధ పద్దులను వాటిలో పేర్కొన్న మొత్తాలను ఖర్చు చేశాక, ఆ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత.. అంటే 2020 జూన్‌లో శాసనసభలో ఉంచింది. ఈ మొత్తం రూ.15,991.85 కోట్లు. రాజ్యాంగ నిబంధనలకు ఇది విరుద్ధం.

* 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపుల వాటా 15.90%. ఇది 11.30% దాటకూడదని 14వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. ఇతర రాష్ట్రాల సగటుతో పోలిస్తే వడ్డీ చెల్లింపులు, పరిపాలన ఖర్చులు, పింఛన్లు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చుల నాణ్యత కూడా ఆ రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే.

* వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాలకు (పీడీ ఖాతాలు) 2019-20 సంవత్సరంలో పెద్ద ఎత్తున నిధులు బదిలీచేసినట్లు చూపారు. వాస్తవంలో సంబంధిత ప్రభుత్వ శాఖల సిబ్బంది ఆ నిధులు ఖర్చు చేసుకునేలా అవి అందుబాటులో ఉండటం లేదు. పీడీ ఖాతాలకు నిధులు బదిలీ చేసినా, వాటిని ఖర్చు చేయడంలేదు. కానీ చేసినట్లు చూపడం వల్ల వాస్తవ ఖర్చు కన్నా ఎక్కువ ఖర్చు చేసినట్లు గణాంకాల్లో చూపుతున్నట్లవుతోంది. ఒకవైపు భారీ రెవెన్యూ లోటు చూపుతున్నారు. మరోవైపు బడ్జెట్‌ కేటాయింపుల్లో మూడోవంతు పీడీ ఖాతాల్లో మిగిలిపోయినట్లు చూపుతున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పీడీ ఖాతాలకు రూ.93,122 కోట్లు బదిలీ చేసినట్లు ప్రభుత్వ ఆదేశాలు తెలియజేస్తున్నాయి. ఈ ఖాతాల్లో అందుబాటులో ఉన్న నిధులు రూ.38,599.99 కోట్లే. ఆర్థిక పద్దులు చూస్తే ఈ విషయాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. పద్దుల ప్రకారం బదిలీలు రూ.38,599.99 కోట్లు, చెల్లింపులు రూ.31,868.27 కోట్లు. బదిలీలకు సంబంధించి రూ.54,522.03 కోట్లు, చెల్లింపులకు సంబంధించి రూ.36,202.44 కోట్లు వ్యత్యాసం కనిపిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినా 2021 ఫిబ్రవరి వరకు సమాధానం అందలేదు.

* ప్రభుత్వరంగ సంస్థలు, అథారిటీలు, అభివృద్ధి సంస్థలు వాటి పద్దులను సమర్పించడం లేదు. నిర్దేశిత ఆర్థిక నియమాలకు ఇది విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో అంతర్గత  నియంత్రణ సరిగా లేకపోవడాన్ని ఇది సూచిస్తుంది.

* కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లను వేరే ఇతర ప్రయోజనాలకు మళ్లిస్తున్నారు. దీంతో కేంద్ర పథకాల అమలు లక్ష్యాలు నెరవేరట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత అందించాల్సిన గ్రాంట్లపైనా ఇది ప్రభావం చూపుతోంది. 2018-19, 2019-20 సంవత్సరాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు వరుసగా రూ.16,608.72 కోట్లు, రూ.11,781.33 కోట్ల నిధులు కేంద్రం ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం వరసగా రూ.4,514.95 కోట్లు, రూ.5,961.71 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది.

* 2019-20 ఆర్థిక సంవత్సరంలో 221 రోజులు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకులో కనీస నిల్వలు నిర్వహించలేకపోయింది. రోజువారీ కనీస నగదునిల్వ రూ.1.94 కోట్లు ఉండాలి. 145 రోజులే ఆ నగదు నిల్వ ఉండేలా చూసుకోగలిగింది. ఈ ఏడాదిలో 221 సందర్భాల్లో రూ.60,371.10 కోట్లు చేబదుళ్లో, ప్రత్యేక సదుపాయం రూపంలోనో, ఓవర్‌ డ్రాఫ్టు రూపంలోనో వినియోగించుకుంది. రూ.66.17 కోట్ల వడ్డీ చెల్లించింది. ఈ పరిస్థితి రాకుండా నగదు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలి.


రాష్ట్ర ఆర్థిక నిర్వహణ తీరుతెన్నులు సరిగా లేవు. వనరుల అంచనా, చేబదుళ్ల అంచనాలు తప్పుతున్నాయి. కేటాయింపులకు మించి కొన్ని చోట్ల ఖర్చులు చేస్తున్నారు.. మరికొన్ని చోట్ల కేటాయింపుల మేరకు నిధులు వెచ్చించడం లేదు. అప్పులు తెచ్చి రెవెన్యూ ఖర్చులకే సింహభాగం వినియోగించడమేంటి?

- రాష్ట్ర ప్రభుత్వంపై కాగ్‌ నిశిత వ్యాఖ్యలు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని