Updated : 28 Nov 2021 04:08 IST

AP News: సర్దుపోటు!

విద్యుత్తు బకాయిల పేరిట రెండు విడతల్లో రూ.1,245 కోట్ల ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు
ఇలా అయితే ఆదాయం తక్కువున్న పంచాయతీల మనుగడ కష్టమే
ఈనాడు - అమరావతి

పంచాయతీల ఆర్థిక స్వాతంత్య్రానికి, స్వావలంబనకు తూట్లు పడుతున్నాయి. పంచాయతీల అనుమతి తీసుకోకుండానే ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు బకాయిల కింద పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తోంది. గత ఐదు నెలల్లో దాదాపు రూ.1,245 కోట్లు రెండు విడతలుగా వెనక్కి తీశారు. సొంత ఆదాయ వనరులు ఎక్కువగా ఉండే ఏ కొద్ది పంచాయతీలో తప్ప... మిగిలినవన్నీ ప్రధానంగా ఆర్థిక సంఘం నిధులతోనే మనుగడ సాగిస్తున్నాయి. ఖాతాల్లో ఉన్న నిధులకు సరిపడా... కొన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేసి, బిల్లుల కోసం ఎదురు చూస్తున్నాయి. మరికొన్ని పంచాయతీలు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనులు ప్రారంభించబోతున్నాయి. తమ అనుమతి లేకుండా ఖాతాల్ని ప్రభుత్వం చాలా వరకు ఖాళీ చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఖాజీపేట మండల వైకాపా సర్పంచులే ఒక దశలో రాజీనామాలకు సిద్ధపడ్డారు! అధికారంలోకి వచ్చి పది నెలలైనా గడవకముందే ప్రభుత్వం ఇచ్చిన షాక్‌తో సర్పంచులు కుదేలైపోయారు. ప్రతి పంచాయతీకీ మూడు మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది. వాటిలో మొదటిది సొంత వనరుల ద్వారా వచ్చే ఆదాయం. ఆస్తిపన్ను, షాపుల లైసెన్సు ఫీజులు, కుళాయి కనెక్షన్ల ఫీజుల వంటివి సొంత వనరులు. కానీ వాటినుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఆస్తిపన్ను సగం కూడా వసూలు కాదు. చిన్న పంచాయతీలకు సొంత వనరుల ద్వారా సమకూరేది నామమాత్రమే.

ప్రభుత్వం ఇచ్చే నిధులూ అంతంతే
రాష్ట్రప్రభుత్వం నుంచి పంచాయతీలకు తలసరి గ్రాంటు, వృత్తి పన్ను, సీనరేజి, పంచాయతీ పరిధిలో జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా కొంత సమకూరుతుంది. ఒక్కో మనిషికి ఏడాదికి రూ.4 చొప్పున ప్రభుత్వం తలసరి గ్రాంటు ఇస్తుంది. టీ తాగాలన్నా రూ.10 వెచ్చించాల్సిన ఈ రోజుల్లో మనిషికి రూ.4 చొప్పున ఇవ్వడంలో హేతుబద్ధతేంటి? ఆ మొత్తం కూడా తోచినప్పుడు విడుదల చేస్తుంది. సీనరేజి, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఆదాయం వచ్చే పంచాయతీల్ని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు.

ఆర్థిక సంఘం నిధులే ఆధారం
సొంత ఆదాయ వనరులు ఎక్కువగా ఉండే కొన్ని మేజర్‌ పంచాయతీలకే మొత్తం ఆదాయంలో సగం సాధారణ నిధుల నుంచి, మరో సగం ఆర్థిక సంఘం నుంచి సమకూరుతుంది. కానీ మెజార్టీ పంచాయతీల ఆదాయంలో 70%కి పైగా ఆర్థిక సంఘం నిధులే ఆధారం. పంచాయతీలు తాము చేసే పనులన్నింటికీ వాటిపైనే ఆధారపడుతున్నాయి.

పదిహేనో ఆర్థిక సంఘం నిధులు రూ.12,856 కోట్లు
14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుచేయడానికి గడువు 2021 మార్చి నుంచి 2022 మార్చి వరకు పొడిగించారు. వీటిలో రాష్ట్రప్రభుత్వం రూ.344.93 కోట్లు ఇదివరకే విద్యుత్తు పంపిణీ సంస్థలకు జమ చేసింది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని పంచాయతీలకు రూ.12,856 కోట్లు కేటాయించింది. వీటిలో 2020-21, 2021-22కి సంబంధించి పంచాయతీలకు విడుదల చేసిన రూ.2,848 కోట్లలో దాదాపు రూ.900 కోట్లు విద్యుత్తు పంపిణీ సంస్థలకు తాజాగా సర్దుబాటు చేశారు.

రూపాయి ఖర్చు పెట్టాలన్నా తీర్మానం తప్పనిసరి
పంచాయతీల నిధుల నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఆ పంచాయతీ తీర్మానం తప్పనిసరి. సీఎఫ్‌ఎంఎస్‌ విధానం లేనప్పుడు పంచాయతీల్లో జరిగిన పనులకు బిల్లులు సమర్పిస్తే, ట్రెజరీలో ఆమోదించి, పంచాయతీల ఖాతాలకు ఆ నిధులు విడుదల చేసేవారు. పనుల్ని ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేసేందుకు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సీఎఫ్‌ఎంఎస్‌ విధానం అమల్లోకి తెచ్చారు. పంచాయతీలు తమ నిధులు ఖర్చు చేయనివ్వకుండా బిల్లుల మంజూరు విధానాన్ని సీఎఫ్‌ఎంఎస్‌ పేరుతో కేంద్రీకృతం చేయడంలోనే హేతుబద్ధత లేదు. ప్రస్తుతం తమ ఖాతాల్లో ఉన్న నిధుల్ని బట్టి పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణయించుకుని అమలు చేస్తాయి. బిల్లుల్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేస్తే సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి క్లియరెన్స్‌ వచ్చాక పంచాయతీల ఖాతాల్లో డబ్బు పడుతుంది.
*గతంలో నిధుల లభ్యత తక్కువగా ఉన్నప్పుడు పంచాయతీల ఖాతాల్ని కొంతకాలం ఫ్రీజ్‌ చేసేవారు. బిల్లులు చెల్లింపు రెండు మూడు నెలలు ఆలస్యమయ్యేది తప్ప, ఇలా ఖాళీచేయడం ఎప్పుడూ లేదు.
* ఇప్పుడు బిల్లులు సమర్పించాక ఆరు నెలలైనా చెల్లింపులు జరగట్లేదు. పంచాయతీలు సమర్పించిన ప్రతి బిల్లుకూ ఒక ఐడీ నంబరు కేటాయిస్తారు. సీఎఫ్‌ఎంస్‌లో నెంబరు కొడితే... సమాచారం లేదని వస్తోందని ఒక పంచాయతీ కార్యదర్శి తెలిపారు.

ప్రభుత్వం చెబుతున్న కారణమిది!
రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 22న జారీచేసిన జీవో 569 ఆధారంగా పంచాయతీ ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఆర్థికశాఖ సర్దుబాటు చేస్తోంది. జీవో వెలువడ్డాక పంచాయతీ ఖాతాల నుంచి రెండుసార్లు నిధులు వెనక్కి తీశారు. రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థలు.. విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు భారీగా బకాయి పడ్డాయి. వీటిని చెల్లించేందుకు కేంద్ర ఇంధనశాఖ ‘లిక్విడిటీ ఇన్‌ఫ్యూజన్‌ స్కీం’ పేరుతో ప్రభుత్వానికి రూ.6,600 కోట్ల రుణం కొన్ని షరతులతో ఇచ్చేందుకు అంగీకరించింది. తొలి విడతగా రూ.3,300 కోట్లు విడుదల చేసింది. రెండోవిడత నిధులు ఇవ్వాలంటే డిస్కంలకు పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్తు ఛార్జీల్ని, పాత బకాయిలను పంచాయతీ నిధుల నుంచి మినహాయించి డిస్కంల ఖాతాలకు జమచేయాలని షరతు పెట్టింది. దానిపై అప్పట్లో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యత నిర్వహిస్తున్న ఆదిత్యనాథ్‌దాస్‌ జీవో జారీ చేశారు. గ్రామ పంచాయతీలకు చెందిన ఆరు ఖాతాల నుంచి నిధుల సర్దుబాటుకు అప్పట్లో అనుమతించారు.


ఇలా ఖాళీ చేశారు

* నెల్లూరు జిల్లాలో 7వేల జనాభా ఉన్న ఒక పంచాయతీ ఖాతాలో పదిహేనో ఆర్థిక సంఘం నిధులు రూ.28 లక్షలు జమయ్యాయి. వాటిలో రూ.ఆరు లక్షలే పంచాయతీ ఇంతవరకు ఖర్చుచేసింది. మిగతా రూ.22 లక్షలకు అభివృద్ధి పనులు చేపట్టింది. గుత్తేదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ మొత్తం ఖాళీ చేయడంతో గుత్తేదారులకు ఏం చెప్పాలో తెలీక సర్పంచ్‌ సతమతమవుతున్నారు.
* కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు పంచాయతీ జనాభా 1500. వార్షికాదాయం రూ.3 లక్షలైతే ఖర్చు రూ.7 లక్షలు. ఈ లోటును ఆర్థిక సంఘం నిధులతో భర్తీ చేస్తోంది. పంచాయతీకి ఏటా ఆర్థిక సంఘం నిధులు రూ.20 లక్షలు వస్తాయి. వాటిలో ప్రాథమిక అవసరాలకు కొంత ఖర్చుచేసి, మిగతా దాంతో రహదారులు, కాలువలు నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆర్థిక సంఘం నిధులు రూ.9,79,480 వచ్చాయి. వాటిని ప్రభుత్వం మళ్లించడంతో పంచాయతీ ఖాతాలో జీరో చూపిస్తోంది. గ్రామంలో తాగునీటి సరఫరాను మెరుగుదలకు మరో వారం రోజుల్లో పనులు ప్రారంభించనుండగా... నిధులు మళ్లించడంపై సర్పంచ్‌ ఎం.శివశంకర్‌ యాదవ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.  
* కడప జిల్లా అట్లూరు మండలం తంబళ్లగొంది పంచాయతీ జనాభా 4,200. ఆదాయం రూ.4.50 లక్షలు. ఖర్చు రూ.10 లక్షలు. ఏటా ఆర్థిక సంఘం నుంచి వచ్చే రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రూ.12 లక్షలు మళ్లించింది. గ్రామంలో తాగునీటి సరఫరా పనులు చేపట్టామని, బిల్లులు అప్‌లోడ్‌ చేయబోతున్న సమయంలో ఖాతాలో నిధులు మళ్లించారని సర్పంచ్‌ కె.లోకేశ్వరిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.


ఇకపై పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సంఘం నిధులు

‘ఆర్థిక సంఘం నిధులు ఇక నుంచి గ్రామ పంచాయతీలకు చెందిన ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి పంచాయతీ పేరుతో జాతీయ బ్యాంకుల్లో ఇందుకోసం ఖాతాలు తెరిచేలా ఆదేశాలు ఇవ్వనున్నాం. సీఎఫ్‌ఎంఎస్‌తో సంబంధం లేకుండా ఆర్థిక సంఘం నిధులతో పూర్తిచేసిన పనులకు బ్యాంకు ఖాతాల్లో ఉన్న నిధులను పంచాయతీలు నేరుగా వాడుకోవచ్చు. విద్యుత్తు ఛార్జీలు, బకాయిలు గ్రామ పంచాయతీలే విద్యుత్తు పంపిణీ సంస్థలకు చెల్లించాలి’

- కోన శశిధర్‌, కమిషనర్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ


 

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని