Cyclone: ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు?

ఉత్తరాంధ్ర, పరిసర జిల్లాలకు తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఈ నెల 4 నాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,

Updated : 01 Dec 2021 06:26 IST

దక్షిణ థాయ్‌లాండ్‌లో అల్పపీడనం

2న వాయుగుండంగా.. 3 నాటికి తుపానుగా మారే అవకాశం

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చు

ఈనాడు, అమరావతి: ఉత్తరాంధ్ర, పరిసర జిల్లాలకు తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఈ నెల 4 నాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో డిసెంబరు 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణ విభాగం హెచ్చరించింది. దక్షిణ థాయ్‌లాండ్‌, పరిసర ప్రాంతాల్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించి డిసెంబరు 2 నాటికి వాయుగుండంగా బలపడనుంది. డిసెంబరు 3న మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుంది. తర్వాత వాయవ్యదిశలో ప్రయాణించి.. మరింత బలపడుతూ 4వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాన్ని చేరే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

కోతకొచ్చిన వరి.. రైతుల్లో తీవ్ర ఆందోళన

ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లోనూ వరి కోత దశలో ఉంది. మొన్నటి వరకూ వర్షాలు కురుస్తుండటంతో కోతలు సాధ్యం కాలేదు. రెండుమూడు రోజులుగా కాస్త తెరపినివ్వడంతో కోతల్లో నిమగ్నమవుతున్నారు. ఈ సమయంలో మళ్లీ తుపాను హెచ్చరికలు రావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పడిపోయిన వరిని కోయడానికి ఎన్నో కష్టాలు పడుతున్నామని, ఇప్పుడు మళ్లీ వానలు మొదలైతే అది కాస్తా చేతికి రాకుండా పోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని